డేటా చోర్‌.. బాబు సర్కార్‌ | Nara Lokesh close Friend Kilari Rajesh Hand In Voters master data theft | Sakshi
Sakshi News home page

డేటా చోర్‌.. బాబు సర్కార్‌

Published Tue, Mar 5 2019 3:20 AM | Last Updated on Tue, Mar 5 2019 7:57 PM

Nara Lokesh close Friend Kilari Rajesh Hand In Voters master data theft - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా ఈవీఎంలను చోరీ చేసిన కేసులో నిందితుడైన సీఎం చంద్రబాబు సన్నిహితుడు వేమూరు హరిప్రసాద్‌తోపాటు నారా లోకేశ్‌కు ఆప్తుడైన  కిలారి రాజేశ్‌ ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను అపహరించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కనుసన్నల్లోనే సాగిందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారం అండతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను చోరీ చేశారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన హరిప్రసాద్‌ ప్రస్తుతం ఫైబర్‌గ్రిడ్, ఆర్టీజీఎస్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఎలక్ట్రోరల్‌ రోల్స్‌కు సంబంధించిన డేటా ఉండడం నేరమని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో...క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

టీడీపీ యాప్‌లోకి ఓటర్ల మాస్టర్‌ డేటా..
ఓటర్ల మాస్టర్‌ డేటా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటా టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా ఆధార్‌ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్‌ డేటాలోనే ఆధార్‌ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు)

పెదబాబు, చినబాబుల కనుసన్నల్లో..
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అందచేసే ఓటర్ల జాబితాల్లో ఆధార్‌ వివరాలు ఉండవు. అలాంటప్పుడు ఆధార్‌ డేటాతో కూడిన మాస్టర్‌ ఓటర్ల జాబితా టీడీపీ సేవా మిత్ర యాప్‌లోకి ఎలా చేరిపోయిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాస్టర్‌ డేటాలోని 910 మంది ఓటర్ల వివరాలను ఒక్కో సేవామిత్రకు, పార్టీ బూత్‌ కన్వీనర్‌కు సేవామిత్ర యాప్‌లో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఓటర్‌ ఏ కులానికి చెందిన వారనే వివరాలను సేవామిత్ర సేకరించాలి. ఓటర్లు ఆ ఊరులో ఉంటున్నారో లేదో తెలుసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేస్తారో సేవా మిత్రలు ఆరా తీసి ఐటీ గ్రిడ్‌కు సమాచారం అందిస్తున్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగించేందుకు ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున ఫామ్‌ 7లను సమర్పిస్తున్నారు.

ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఐటీ గ్రిడ్‌ ఎండీ అశోక్‌ కేవలం నిమిత్తమాత్రుడని, చంద్రబాబు, లోకేశ్‌ చెప్పినట్లు చేస్తారని పేర్కొంటున్నాయి. అశోక్‌ ఎక్కువ సమయం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌ దగ్గరే ఉంటారని, పలుసార్లు సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వస్తుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అశోక్‌కు సీఎంసన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌ ఈ వ్యవహారాలను అప్పగించారని సమాచారం. (‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం)

ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం..
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మెరుగైన సేవలందించడానికి వినియోగించాల్సిన ప్రభుత్వం టీడీపీ ప్రయోజనాల కోసం అప్రజాస్వామిక చర్యలకు వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజాధనంతో ఏర్పాటైన ఫైబర్‌ గ్రిడ్, ఆర్టీజీఎస్, 1100 నెంబర్లకు చెందిన సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌తో అనుసంధానంచేశారు. ప్రభుత్వ ధనంతో చేపట్టిన ప్రజాసాధికార సర్వే వివరాలను  కూడా సేవా మిత్ర యాప్‌తో జోడించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ అధికార పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది ఓటర్ల వివరాలు, ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ల సమాచారాన్ని కూడా సేవా మిత్ర యాప్‌లో నిక్షిప్తం చేశారు.

సేవామిత్ర యాప్‌లో సమాచారం ఆధారంగా ఓటర్ల అకౌంట్లలోకి నగదు వేసి ఓట్లను కొనుగోలు చేయడానికి ఎత్తుగడ వేశారని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆర్టీజీఎస్, ఇ–ప్రగతిని సమర్ధంగా వినియోగించుకోవాల్సిందిగా ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, ఇ–ప్రగతి, 1100 నెంబర్‌ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వీటిని తమ అదుపులోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా సూచిస్తున్నారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement