‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’ | VijayaSai Reddy Fires On TDP Over IT Grids Scam | Sakshi
Sakshi News home page

‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’

Published Tue, Apr 30 2019 3:31 PM | Last Updated on Tue, Apr 30 2019 5:56 PM

VijayaSai Reddy Fires On TDP Over IT Grids Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్స్‌కు ప్రజల డేటా చేరిందన్నారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్‌ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్‌ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్‌ అయిన తర్వాత ఆధార్‌ డేటాను ఈ ప్రగతికి లింక్‌ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్‌ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్‌ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు మళ్లించారు. సేవామిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ రూపొందించింది. డేటా చోరీ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ ఎండీ డాకవరం అశోక్‌పై కేసు నమోదు చేశారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌తో ట్రాక్‌ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్‌తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ఫోన్‌ స్టోరేజీ డేటా కూడా వారి వద్దకు వెళ్లిపోయింది. చంద్రబాబు, అశోక్‌ ద్వారా దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు.

సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్‌-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతున్నారు. అశోక్‌ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్‌పై ఉంది. టీడీపీ ప్రభుత్వ దొంగతనాన్ని దాచడానికే సిట్‌ వేశారా?. ఈ ప్రగతి, సీఎం డ్యాష్‌ బోర్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాంకేతికతను ఉపయోగించుకోకుండా చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్‌డేట్‌ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్‌ ఆర్గ్‌, ఓటీఎస్‌ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్‌సైట్‌ సాంకేతిక బాధ్యతలను అప్పగించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్‌ పైలెట్‌ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే అభయ యాప్‌ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారు?. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్‌సైట్‌లోనే నాయకులను ఆదేశించింది. అశోక్‌ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలి.

ఇటీవల అశోక్‌ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్‌ రోజు ఎలా హ్యాక్‌ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసింది. ఇంతా జరుగుతున్నా ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కౌంటింగ్‌ రోజున భద్రతా చర్యల గురించి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. టీడీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉందని తెలిపాం. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు అరెస్ట్‌ అయినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి ఎదైయినా జరిగిందంటే దాని వెనుక టీడీపీ హస్తం ఉండే అవకాశం ఉంద’ని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement