సాక్షి, తిరుపతి: లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తారా అని వైఎస్సార్‌సీపీ దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. తిరుపతిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్టే తెచ్చుకున్న అన్ని కేసుల్లోనూ స్టే ఎత్తివేయాలని కోరి తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కంచాల మోతకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
‘బకాసురుడి బావమరుదులంతా శ్రీకృష్ణుడి వేషం వేస్తారా.. అవినీతికి సిగ్గుపడాల్సిందిపోయి, సింగారించుకుని బయటకొచ్చి కంచాలు మోత మోగిస్తారా’ అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే ఇప్పుడు ఇంట్లో ఈగల మోత, జైలులో దోమల మోత అన్న చందంగా ఆయన పరిస్థితి తయారైందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం నాలుగేళ్లలోనే రూ.2.35 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలు కింద అందిస్తే.. చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేంద్ర నిధులు దోచేసినందుకు కంచాలు మోగిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దోషిగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టులు నమ్మినందునే ఆయన పిటిషన్‌ను తిరస్కరించాయని అన్నారు.
దర్యాప్తు సంస్థల ఎదుట కొట్టండి
చంద్రబాబు చేసిన అవినీతి కేసులో ఈడీ నలుగుర్ని అరెస్ట్ చేసిందని, చంద్రబాబు రూ.119 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆదాయ పన్ను శాఖ నోటీస్ ఇచ్చిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడన్న ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ముందు, ఈడీ కార్యాలయం ముందు లోకేశ్, టీడీపీ ఎంపీలు, టీడీపీకి తొత్తులుగా ఉన్న పురందేశ్వరి, సీఎం రమేష్, రేవంత్‌రెడ్డి, జయప్రకాష్ నారాయణ, సత్యకుమార్, సీపీఐ నారాయణ, రామకృష్ణతో కలిసి కంచాల మోత మోగించాలన్నారు.
‘ప్రతి విషయంలో అడ్డంగా తినేసి బకాసురులంతా కంచాలు మోగిస్తారా.. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి, ఆర్థిక మంత్రి కార్యాలయాల వద్ద కదా ఆ పని చేయాల్సింది. మరి ఇక్కడ మోగించడం ఏమిటి’ అని నిలదీశారు. తండ్రి అరెస్ట్ తరువాత ఢిల్లీలో దాక్కొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లోకేశ్ ధైర్యవంతుడా.. ఉత్తర కుమారుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతికి మద్దతుగా పచ్చ పత్రికలు, చానళ్ల యజమానులు కూడా కంచాల మోత మోగిస్తున్నారన్నారు. ‘ప్రాజెక్ట్ లేకుండానే నిధులు తినేశారనేది మా వాదన. అలా సొమ్ము తినేయడమే చంద్రబాబు స్కిల్. అందుకే అతన్ని స్కిల్డ్ క్రిమినల్ అని చెప్పడం అతిశయోక్తి కాదు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హెరిటేజ్‌లో స్కామ్ జరిగిందని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, దోషులు ఎవరన్నది విచారణలో తేలిపోతుందని అన్నారు. చంద్రబాబు దేశ, విదేశాల్లో రూ.ఐదారు లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్నారు.
మీ నిజాయితీని కోర్టుల్లో తేల్చుకోండి
‘అసలు మీరేం చెప్పదలచుకున్నారు రాష్ట్ర ప్రజలకు. మీరు అవినీతిపరులు కాదని చెప్పుకోదల్చుకున్నారా? అలా అయితే విచారణకు మీరు రెడీ కావాలి. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలి. మీ నిజాయితీని కోర్టుల్లో తేల్చుకోండి. స్టే తెచ్చుకోకుండా విచారణ పూర్తయితే మీరు నీతిమంతులా.. అవినీతిపరులా అన్నది తేలిపోతుంది. మీరు నిజంగా నీతిమంతులైతే ఈ సవాల్ స్వీకరించి.. 10 కేసుల్లో మీరు ఎక్కడైతే స్టే తెచ్చుకున్నారో.. ఆ స్టేలు ఎత్తివేయాలని కోర్టులను కోరాలి’ అని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎంవైఎస్ జగన్ త్వరలోనే విశాఖకు మారుతున్నారని, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, అఖండ మెజారిటీతో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఆయన వెంట ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
చదవండి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం: నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment