
సాక్షి, బాపట్ల: వైఎస్సార్ సీపీ పెత్తందారుల పార్టీ కాదని.. పేదల, బలహీన వర్గాల పార్టీ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని, ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానూభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా సపోర్టు చేయడం లేదని విమర్శించారు.
పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్
లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబులా.. లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాబు పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని అన్నారు. పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు.
మంత్రివర్గం కూర్పులో కూడా సామాజిక న్యాయం చేశామని తెలిపారు. పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయమని విమర్శించారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని, స్వార్త, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని మండిపడ్డారు.
ఆధారాలు లేని ఆరోపణలు
ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై పురంధేశ్వరి ఆరోపణలు చేయడం తగదని చురకలంటించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ విషయంలో తనపై, విథున్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది
‘బాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టే బాబును ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది. పేదలకు పెన్షన్ పెంచుతుంటే తట్టుకోలేకపోతుంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేకపోతుంది. చంద్రబాబు చరిత్ర ముగిసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
బాపట్లలో సామాజిక సాధికార యాత్ర
బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు నుంచి సామాజిక సాధికార బస్సు ప్రారంభం అయ్యింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీలు ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, మార్కెటింగ్ ప్రభుత్వ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment