చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ | KSR Comments On TDP Attacks In Elections | Sakshi
Sakshi News home page

ఏపీలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ

Published Fri, May 17 2024 12:44 PM | Last Updated on Sat, May 18 2024 1:02 PM

KSR Comments On TDP Attacks In Elections

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.

దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.

ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.

ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్‌ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.

ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్‌సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్‌సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.

టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.

ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.

ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.

టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.

ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్‌సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.

నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.

పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement