![KSR Comment On Chandrababu Lokesh Wrong Step In Vamsi Arrest](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Vamsi_Lokesh_Vamsi.jpg.webp?itok=xGA0lnIQ)
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు.
రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు.
రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/CBN_Revenge.jpg)
వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Vamsi_Arrest2.jpg)
ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి.
తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు.
కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్‌సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు.
చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు.
వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు.
చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది.
టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Vamsi_Arrest_Row.jpg)
వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Chandrababu_Arrest2.jpg)
మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే.
ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/KSR-Main_11.jpg)
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment