ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమైంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటే ఎందుకంతగా భయపడుతున్నారు? చంద్రబాబు ఆయా చోట్ల చేస్తున్న ఉపన్యాసాలు చూస్తే దారుణంగా ఉంటున్నాయి. తాను రాష్ట్రాన్నిఏ విధంగా అభివృద్ది చేసేది, తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేసేది చెప్పకుండా జగన్‌పై దూషణలకు దిగుతున్నారు. జగన్‌ను భూతంతో పోల్చుతూ భూస్థాపితం చేయాలని దుర్భాషలాడారు. భూతం మళ్లీ లేవకుండా కాంక్రీట్ వేయాలని చెబుతున్నారు. అప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట.
ఈవిఎమ్‌ల మానిప్యులేషన్ ద్వారా అధికారం సాధించారా? లేక ప్రజలుఎన్నుకుంటే ప్రభుత్వంలోకి వచ్చారా అన్నది పక్కనబెడితే, ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటారు కదా! అఫ్ కోర్స్! ఆయనకై ఆయన తప్పుకుని తన కుమారుడు లోకేష్‌కు సీఎం పదవి ఇస్తే తప్ప. అప్పుడైనా ఇదే కూటమి ప్రభుత్వమే కదా ఉండేది! అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్సార్సీపీ అన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంటే చంద్రబాబు ఇంతగా భయపడుతున్నారంటేనే ఆయన గెలుపు ప్రజల అభిమానంతో వచ్చింది కాకపోవడం వల్లేనేమో అన్న భావన కలుగుతుంది.
గత రెండున్నర నెలలుగా ఏపీలో సాగుతున్న అరాచక పాలన చూసి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అనుకుంటున్నారన్న సందేహం చంద్రబాబుకే వచ్చి ఉండాలి. దానికి తోడు జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు జేజేలు పలుకుతున్న తీరు కూటమి నేతలకు వణుకు పుట్టిస్తుండాలి. అనకాపల్లి వద్ద ఒక ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు ఆయనకు తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన జనసందేహాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడ్డవారికి పరిహారం సత్వరమే ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతానని జగన్ హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్న భావన ప్రజలలో ఏర్పడింది. అంతకుముందు బాధితులకు ఇవ్వవలసిన పరిహారం ఎప్పుడు ఇచ్చేది చెప్పని ప్రభుత్వం, జగన్ వార్నింగ్‌తో సాయంత్రానికి చెక్కులు పంపిణి చేసింది. గతంలో విశాఖ ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు జగన్ స్పందించిన తీరుకు, ఇప్పుడు అనకాపల్లి ప్రమాదంపై చంద్రబాబు అనుసరించిన తీరును ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇవన్ని చంద్రబాబుకు చికాకుగానే ఉంటాయి. తాము ఏదో రకంగా జగన్‌ను అధికారంలో నుంచి దించివేసినా, ఆయన జనంలో తిరిగితే తమకు ఇబ్బందేనని చంద్రబాబుకు అర్ధం అయింది. దానికి తోడు ఇంత స్వల్పకాలంలోనే ప్రజలలో అసంతృప్తి పెరుగుతుండడంవల్ల ప్రస్టేషన్‌తో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలుస్తూనే ఉంది.
ఐదేళ్ల తన అధికారానికి ఎదురులేకపోయినా, జగన్ వల్ల ఏదో నష్టం జరుగుతుందని అంటున్నారంటే, ప్రజలను మభ్య పెట్టడానికే. తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అసాద్యమని తెలుసు కనుక మొత్తం సమస్యలన్నిటిని జగన్‌పై నెట్టేసి ప్రజలను మాయ చేయవచ్చన్న ఆలోచన కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వాన్నంగా మారాయి. వైఎస్సార్సీపీ వారిపై హింసాకాండ కొనసాగుతూనే ఉంది. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. వాటిని అదుపు చేయకపోగా, ఈ రెండు నెలల్లో వైఎస్సార్సీపీ వారిని ఎవరైనా అడ్డుకున్నారా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారంటే ఆయన ఏ స్థాయిలో అసత్యాలు చెబుతున్నది ప్రజలకు స్పష్టం అవుతోంది.
రాష్ట్రంలో ఒక్క జగన్ తప్ప మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవి ఆయనను ప్రశ్నించవు. జనసేన ఎటూ కూటమిలో భాగమే. అందులోను ఆ పార్టీ అదినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పూర్తిగా లోబరుచుకున్నారు. దాంతో చంద్రబాబు ఏమి చేసినా పొగడడమే ధ్యేయంగా పెట్టుకుని పవన్ కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలోకి వచ్చాక ఆ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీలకు తోక పార్టీగా మారింది. షర్మిల ఎప్పుడూ జగన్‌నే విమర్శించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లడం లేదు. వెళ్లినా అదేదో మాటవరసకు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వామపక్షాలు కూడా ముఖ్యంగా సీపీఐ ఇందుకు భిన్నంగా లేదు. అడపతడపా ఇచ్చే ప్రకటనలు మినహాయించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, ప్రభుత్వ దమనకాండపై సీపీఐ నోరు విప్పడం లేదు.
వీరందరికన్నా కాస్తో, కూస్తో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ గట్టిగా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయన వాయిస్ ఇంకా రాష్ట్రం అంతటికి వెళ్లడం లేదు. ఈ నేపధ్యంలో ఒక్క వైఎస్సార్సీపీ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. ప్రభుత్వం రాకపోయినా, జగన్ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గలేదని, పైగా కూటమి వైఫల్యాలతో జగన్‌పై ప్రజలలో విశ్వాసం పెరుగుతోందని అర్ధం అవుతోంది. అందుకే చంద్రబాబు భయంతో ఇష్టారీతిన దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు.
జగన్ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదెలాగో మాత్రం వివరించలేరు. జగన్ ఇచ్చిన హామీల కన్నా రెండు రెట్లు అధికంగా వ్యయం అయ్యే హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిపై ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారు. జగన్ తన హామీల విషయంలో బాధ్యతతో వ్యవహరించి ఆచరణ సాధ్యం కాని వాటిని తాను ఇవ్వలేనని అంటే, చంద్రబాబు ఆ రోజుల్లో ఏమని అనేవారు! తనకు చాలా అనుభవం ఉందని, తను సంపద సృష్టించి వాటిని అమలు చేస్తానని బీరాలు పలికేవారు. తీరా అధికారంలోకి వచ్చాక, అన్నిటికి మంగళం పాడి, మొత్తం మాట మార్చేసి ఏవేవో నంగనాచి కబుర్లు చెప్పి జగన్‌ను తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారు. అయితే చంద్రబాబు తన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలి.. లేదా భారీ ఎత్తున అప్పులు తెచ్చి ఆ హామీలు చేసి చూపించాలి. అది సాధ్యం అయ్యే పని కాదు. నిజంగానే ఏదోలా చంద్రరబాబు హామీలు అమలు చేస్తే కచ్చితంగా ఏపీ సుడిగుండంలో చిక్కుకుంటుంది.
చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అవుతుంది. అందుకే ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సిద్దం అవుతున్నారనిపిస్తుంది. ఆ విషయం గమనించిన ప్రజలలో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. ప్రతిపక్షంగా జగన్ భవిష్యత్తులో సూపర్స్ సిక్స్ హామీల గురించి గట్టిగా నిలదీస్తారు. అప్పుడు కూటమి ప్రభుత్వం మరిన్ని కష్టాలలో పడుతుంది.
ఈ నేపద్యంలోనే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఓటమి పాలైంది. అంటే ఆయన భూతంలా ప్రభుత్వాన్ని నడపబట్టే ఓడిపోయారా? ఆ భూతాన్ని భూ స్థాపితం చేయకపోబట్టే మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చారా? అదే ప్రకారం వైఎస్సార్సీపీ కూడా మళ్లీ ప్రజల మద్దతు కూడగట్టుకుని వచ్చే ఎన్నికలలో గెలుస్తుందన్న ఆందోళన ఇప్పటి నుంచే మొదలై ఉండాలి.
తన భవిష్యత్తుకన్నా, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై బెంగతోనే చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కావచ్చు. చంద్రబాబు తన సీనియారిటీ తగ్గట్లు వ్యవహరిస్తే ఆయనకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఎన్నేళ్లు పాలన చేసినా, సాదాసీదా నాయకుడిగానే జనం దృష్టిలో మిగిలిపోతారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment