
అనంతపురం, సాక్షి: రాజకీయ ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు తెగ బడుతోంది. ఈ క్రమంలోనే.. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య(Kuruba Lingamaiah) దారుణహత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబానికి పరామర్శ కోసం వెళ్లిన టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది.
ఓవైపు హత్య చేయించి.. మరోవైపు పరామర్శకు వస్తారా?. టీడీపీ ప్రభుత్వం(TDP Government)లో బీసీలకు రక్షణ లేదా? అంటూ లింగమయ్య కొడుకు మనోహర్ ఎంపీ పార్థసారథి(Bk Parthasarathi)ని నిలదీశారు. దీంతో ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. పరిటాల సునీత నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లాడాయన. అంతకు ముందు..
‘‘టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) సోదరులే మా నాన్నను హత్య చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్నందుకే చంపారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాము రాజకీయంగా ఎదగ కూడదనే హత్య చేశారు’’ అని లింగమయ్య కొడుకులు మనోహర్, శ్రీనివాసులు మీడియా ముందు వాపోయారు.
రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పూట ఘోరం జరిగింది. గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పరిటాల సునీత బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ హత్యా రాజకీయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్‌సీపీలో లింగమయ్య కీలకంగా ఉన్నందుకే ఈ హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు పరామర్శ కోసం వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనపై గోరంట్ల మండిపడ్డారు.
ఇదీ చదవండి: జగన్ హయాంలో హింసా రాజకీయాలెక్కడివి?