
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం.
మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు.
