కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు..  | Ambati Rambabu Comments On TDP Party Leader Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు.. 

Published Fri, Jul 17 2020 4:35 AM | Last Updated on Fri, Jul 17 2020 4:37 AM

Ambati Rambabu Comments On TDP Party Leader Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రంతో లాలూచీ కోసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరగకుండా రక్షణగా ఉండాలని కోరేందుకే టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఇచ్చిన 52 పేజీల లేఖలో ప్రజాసమస్యల ఊసే లేదని, అసలు విషయం ఒకటైతే రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నానిలు బయట మీడియాకు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మరొకటి చెప్పారన్నారు. 

రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలను ఎవ్వరూ ధ్వంసం చేయటం లేదని, రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు లేవన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు చాలా హాయిగా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు హైదరాబాద్‌ నుంచి కరకట్టకు వస్తున్నారు, తిరిగి హైదరాబాద్‌ వెళుతున్నారని చెప్పారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుంది.. 
► రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు తప్పుడు ఆరోపణలతో 52 పేజీల లేఖ ఇచ్చారు. కేంద్రంతో లాలూచీ పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకే.. సుజనా, సీఎం రమేష్‌ ఇతర రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు.  
► చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయొద్దంటున్నారు.  కేసుల నుంచి చంద్రబాబు రక్షణకే టీడీపీఎంపీలు రాష్ట్రపతి వద్దకెళ్లారు.
► చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నాయకులకు  కలుగుతున్న భయమే రాష్ట్రపతికి ఇచ్చిన పిటిషన్‌లో కనిపించింది. ఈ ఫిర్యాదు కేవలం టీడీపీని, చంద్రబాబును రక్షించుకునే వ్యూహంలో భాగంగానే జరిగింది.    
► రాష్ట్రపతికి ఇచ్చిన దస్త్రంలో ప్రజాసమస్యలు అసలు లేవు. తప్పులు చేశారు కాబట్టే.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు అయ్యారు.  
చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుంది 
► వేధించదలుచుకున్న ప్రభుత్వం మూడు వారాలు అచ్చెన్నాయుడిని ఆసుపత్రిలో ఉంచుతుందా? కొల్లు రవీంద్రపై పూర్తి సాక్ష్యాధారాలతోనే పోలీసులు అరెస్టు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమాల విషయంలో వందలు, వేల ఆరోపణలున్నాయి.   
► రోజురోజుకీ బలహీన పడుతున్న టీడీపీపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. నల్ల చొక్కా వేసుకుని, మోదీ భార్య, తల్లి గురించి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడారు. మోదీ గెలిచాక కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి తెలిపారు. దొరికితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబుకు ఎవరూ సరిలేరన్నది జగమెరిగిన సత్యం. 
► కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సీబీఐ, ఈడీ, ఐటీల మీద ఎప్పటి నుంచి చంద్రబాబుకు నమ్మకం కలిగింది, ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆధారాలు దొరికితే ఎంతటి వారినైనా అరెస్ట్‌ చేస్తాం.   
► చట్ట ప్రకారమే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తుంది. బాబు చేసిన అక్రమాలపై విచారణ జరుగుతుంది.

టీడీపీ నేతలవి ప్రేలాపనలు 
► చెన్నైలో దొరికిన డబ్బు బంగారం వ్యాపారిది. ఆ డబ్బు తనది అని ఆ వ్యాపారి చెబుతున్నా.. రాజకీయం చేయటం ఏంటి?  
► చెన్నైలో దొరికిన డబ్బుకు, బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధం లేదని ఆయన చెబుతున్నా టీడీపీ నేతల ప్రేలాపనలు ఏంటి?  
► గతంలో కదిరిలో చంద్రబాబు పేరుపై రిజిస్టర్‌ అయినట్లు ఉన్న వాహనంలో రూ.7 కోట్లు పట్టుబడ్డాయి. ఆ డబ్బు చంద్రబాబుదేనని చంద్రగిరి తెదేపా నేత పేరం హరిబాబు తండ్రి చెప్పలేదా? మరి, బాబు రాజీనామా చేశారా? దానికి సమాధానం చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement