BK Parthasarathi
-
మంత్రి సవిత Vs ఎంపీ పార్థసారథి.. మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రొద్దంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించగా, ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య అధిపత్య పొరు కొనసాగుతోంది.కాగా, పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచిన సంగతి తెలిసిందే.మంత్రి పదవినీ కూడా దక్కించుకున్న సవిత.. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడటంతో గతంలో పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తిన సంగతి తెలిసిందే. -
పార్థసారథికి పచ్చ పోటు!
శ్రీ సత్యసాయి: టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు పలకడం లేదు. ఇప్పటికే పెనుకొండలో తిరుగుబాటు చేసిన సవితమ్మ పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ సారి టికెట్ తనదేనంటూ హడావుడి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీకే పార్థసారథి ఒంటరిగా మిగిలిపోయారు. కానీ పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘జయహో బీసీ’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించాలని, తద్వారా పెనుకొండలో తనపట్టు చూపాలని భావించారు. అయితే బుధవారం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమానికి టీడీపీ బీసీ నేతలు చాలా మంది దూరంగా ఉన్నారు. ముఖ్యనేతలైన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మతో పాటు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాలకు చెందిన బీసీ నాయకులు చాలా మంది గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు తెరపైకి వచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా, పెనుకొండ ఎమ్మెల్యేగా పార్థసారథి, హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండేవారు. అప్పుడే వారి మధ్య వర్గ విభేదాలు పొడచూపాయి. అప్పట్లో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ ఇరువురు నేతలు ఎడముఖం, పెడముఖంగా ఉండేవారు. దీంతో పార్టీ కేడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఆధిపత్య ధోరణిలో ఒక వర్గం, మరోవర్గంపై దాడులకు సైతం తెగబడింది. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతుండగా, ఇక పెనుకొండలో టీడీపీ గెలవడం కలేనని బుధవారం జరిగిన జయహో బీసీ సభలో కార్యకర్తలు చర్చించుకున్నారు. -
అలక వీడని ఈరన్న.. రంగంలో దిగిన బీకే, పరిటాల సునీత
మడకశిర: నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. టీడీపీలో దళితులకు గౌరవం లేదంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ ఇన్చార్జ్ ఈరన్న అలకబూనారు. ఈ క్రమంలో బుధవారం మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉండాలని ఈరన్న వర్గం మొత్తం నిర్ణయించుకుంది. రంగంలో దిగిన బీకే, పరిటాల సునీత అలకబూనిన ఈరన్నను బుజ్జగించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రంగంలో దిగారు. రొద్దం మండలంలోని తన స్వగ్రామం మరువపల్లికి ఈరన్నను పిలిపించుకుని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని కోరినట్లు తెలిసింది. టీడీపీలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదని ఈరన్న ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానికంగా ఉన్న తనకే ఆహ్వానం లేనప్పుడు తానెందుకు హాజరు కావాలని ప్రశ్నించడంతో బీకే స్వీయరక్షణలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత సైతం ఈరన్నకు ఫోన్ చేసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆమెతో తన మనసులోని మాటను ఆయన నిర్మోహమాటంగా చెప్పినట్లు సమాచారం. బీకే తీరుపై ఈరన్న వర్గం గుర్రు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారిథి వ్యవహరిస్తున్న తీరుపై ఈరన్న వర్గం గుర్రుగా ఉంది. ఆయన ఒంటెత్తు పోకడలతోనే మడకశిరలో టీడీపీకి ఈ గతి పట్టిందని బహిరంగంగానే ఈరన్న వర్గం మండి పడుతోంది. ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఈరన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినవారిని కాదని, వలస వచ్చిన నాయకుడికి అందలం ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రకులాలు, డబ్బున్న వారికే విలువ నిస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో బీకే వైఖరిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నాడని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అధిష్టానానికి నివేదికలు అందడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఈరన్నతో కలసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో ఈరన్నను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. -
ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సర్కారుతో కనెక్ట్ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది. -
సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్ పంచాయితీ!
పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం. సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనే గొప్ప.. నాకే కావాలి గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి
సాక్షి, అనంతపురం జిల్లా: రూ. కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్ వస్తుందంటూ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తమ పార్టీ బాగోతాన్ని బయటపెట్టారు. బాగా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి రావాలని, ఉత్తి చేతులతో వస్తే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన కురుబ కులస్తుల సమావేశంలో టీడీపీ డబ్బు సిద్ధాంతాన్ని బీకే పార్థసారథి బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్! -
పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?
ఇంట్లో నుంచి కాలు బయటపెడితే అనుచరుల హంగామా...పార్టీ నేతల స్వాగతాలు. అధిష్టానానికి తమగురించి చెప్పాలంటూ నాయకుల వినతులు. ఒకప్పుడు బీకే పార్థసారథి హవా ఇది...ఇప్పుడు మొత్తం మారిపోయింది. అధిష్టానం పట్టించుకోవడం లేదు. పైగా టికెట్ యూత్‌కేనంటూ తేల్చేసింది. వైరివర్గం ఫుల్‌జోష్‌లో ఉంది. మాట్లాడించే కార్యకర్త లేడు. కలిసి నడిచే నాయకుడు కరువు. పేరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడే అయినా...మాట చెల్లడం లేదు. సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకే పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తిగా డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బాబు ‘బాది’పోయాడా.. ఇటీవల చంద్రబాబు సోమందేపల్లిలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి బీకే పార్థసారథి పూర్తిగా నిరుత్సాహపడినట్లు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. 2024లో పెనుకొండ టికెట్‌పై చంద్రబాబు గానీ, లోకేష్ గానీ హామీ ఇవ్వకపోగా, ఈ సారి యువతకే అవకాశమని స్పష్టం చేయడంతో బీకే దిక్కుతోచని స్థితిలో పడ్డారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీకే పార్థసారథి ఇప్పటికే 2, 3 సార్లు చంద్రబాబును, లోకేష్‌ను కలసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అందువల్లే నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. దీంతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. చీలిన నాయకులు, కార్యకర్తలు.. పెనుకొండలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బీకే వ్యవహారశైలి, ఆయన అల్లుడి అజమాయిషీ నచ్చని తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. గతంలో బీకేకు అనుకూలంగా ఉన్న వారే ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్నారు. సొంతంగా గుంపుకట్టి పార్టీ కార్యక్రమాలు వేరుగా చేస్తున్నారు. బలప్రదర్శనతో అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ చుట్టూ్ట తిరిగిన వారంతా బాయ్ బాయ్ బీకే అంటూ వ్యతిరేక వర్గంలో చేరిపోయారు. బీకేకు పోటీగా కార్యక్రమాలు చేస్తూ నిరసన నిప్పు రాజేస్తున్నారు. ప్రోత్సహిస్తున్న అధిష్టానం.. బీకే వ్యతిరేక వర్గాన్ని టీడీపీ అధిష్టానమే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమందేపల్లికి రాగా...బీకే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీకే వ్యతిరేక వర్గం ‘కియా’ కార్ల పరిశ్రమ వద్దే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ఆహ్వానించింది. క్రమశిక్షణ ముఖ్యమని పదేపదే చెప్పే చంద్రబాబు కూడా బీకే వైరి వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అనంతరం సోమందేపల్లి కార్యక్రమానికి వచ్చారు. దీంతో భంగపడిన బీకే అధినేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిడ్డ లేదా అల్లుడికైనా... తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన పెద్ద కుమార్తెకు గానీ, లేదా కుడి భుజంగా ఉంటున్న అల్లుడు శశిధర్‌కు గానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీకే... చంద్రబాబు, లోకేష్‌ను కోరినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి బయోడేటాలను పార్టీ నేతలకు అందించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇది కూడా బీకేకు ఆశించిన ఫలితం కనిపించేలా లేదని సమాచారం. ఎంపీగా వెళ్దామంటే... అసెంబ్లీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయగా...బీకే హిందూపురం ఎంపీ టికెట్ అయినా అడుగుదామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వాల్మీకి వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ అడ్డుగా నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు అధినేత చంద్రబాబు కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలని ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యే బీకే ...తన రాజకీయ భవిష్యత్తును తలచుకుని మదన పడుతున్నట్లు చర్చ సాగుతోంది. ఆయన అనుచరులు సైతం తమ నాయకుడు పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. -
Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి
టికెట్ నాదే... అంతా నేనే. ఎవరొచ్చినా మన తర్వాతే. టీడీపీలో ప్రతి నాయకుడూ అనుచర వర్గానికీ, కార్యకర్తలకు చెబుతున్న మాటలివి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని తమ్ముళ్లు తలోదారి పట్టారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులంతా వర్గపోరు రాజేస్తుండగా... కార్యకర్తలు జెండా పక్కనపెట్టి మిన్నకుండిపోయారు. సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీని కాపాడే నాయకుడు కరువయ్యారు. నేతల నడుమ వర్గపోరుతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భారీ స్థాయిలో మహానాడు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం కార్యకర్తలంతా నిస్తేజంలో ఉండిపోయారు. సొంతపార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండగా కార్యకర్తలు ఏ కుంపటి దగ్గర చలికాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. పల్లెకు పొగ పెట్టిన సైకం.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి గట్టిగా పోరాడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతాడని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ పల్లె బాగా వెనుకబడ్డారని తేలింది. దీంతో పాటు పల్లె రఘునాథరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో సొంతపార్టీలోనే పల్లె ఒంటరిగా మిగిలిపోయారు. చివరకు సీఎంను విమర్శిస్తేనైనా చంద్రబాబు మెప్పు పొందచ్చునేమోనన్న ఆశతో ఆయన తన స్థాయిని మించి విమర్శలు చేస్తుండగా... నియోజకవర్గ ప్రజలు ఈయనపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (టీడీపీలో మహిళలకు గౌరవం లేదు) ధర్మవరంలో సూరికి సెగ.. భూదందాల్లో ఆరితేరిన వరదాపురం సూరికి ధర్మవరంలో నిరసన సెగ తగలుతోంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూరి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు పచ్చజెండా కప్పుకోవాలని చూస్తుండగా... సూరీని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. కండువా కప్పుకోవాలంటే ‘నేనే కండువా వెయ్యాలి, ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు’ అని శ్రీరామ్ విమర్శించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకుడెవరో కార్యకర్తలకు అర్థం కాక ఇప్పటికే మెజార్టీ కేడర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కదిరిలో కందికుంటకు చెక్.. చెక్‌బౌన్స్ కేసులో శిక్ష పడిన మాజీ ఎమ్మెల్యే కందికుంట పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కదిరిలో టీడీపీ కేడర్ అత్తర్ చాంద్‌బాషా, కందికుంట వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చాంద్‌బాషా 2014లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఇదే సమయంలో కందికుంటపై కేసులు నమోదయ్యాయి. దీంతో కందికుంట పక్కన పెట్టిన టీడీపీ కేడర్... అత్తార్ వైపు కూడా నడవలేక పోతోంది. గెలిపించిన పార్టీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లారని సొంత సామాజికవర్గమే అత్తార్‌పై గుర్రుగా ఉండగా.. కదిరి తెలుగు తమ్ముళ్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీకేకు దీటుగా సబిత .. పెనుకొండలో బీకే పార్థసారధి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు సరిగా చేయడం లేదని ఇప్పటికే ఆయనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీమంత్రి రామచంద్రారెడ్డి కూతురు సబిత ఇక్కడ టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్గాన్ని కూడగడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీకేకు తలనొప్పిగా మారాయి. అసలు బీకేకు టికెట్ వస్తుందో రాదోనన్న పరిస్థితి నెలకొంది. చదవండి: (చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు) మడకశిరలో ఎవరికి వారే.. మడకశిరలో వింతపరిస్థితి. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిన ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉప్పూ నిప్పులా మారారు. దీంతో కార్యకర్తలూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఏ కార్యక్రమమైనా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరో వర్గం ఓట్లు వేసే పరిస్థితి లేదు. అధిష్టానం ఇరువురినీ పిలిపించి రాజీ చేసినా తెల్లారేసరికి మళ్లీ గ్రూపులుగా విడిపోయారు. ఇలా వర్గపోరుతో కేడర్ మడకశిరలో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలూ ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులవుతుండగా.. వారిని కాపాడుకోవడం తలకుమించిన భారమైంది. బాలయ్యను మర్చిపోయిన ‘పురం’వాసులు.. రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణను గెలిపించినా ఏడాదికి ఒకసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్గం, పార్టీ అనేది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురంలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో నియోజకవర్గ జనం ఎమ్మెల్యే బాలకృష్ణను పూర్తిగా మర్చిపోయారు. ఈ సారి అందుబాటులో ఉండేవారికి ఓటేస్తే బావుంటుందన్న ఆలోచన ఉన్నారు. ఇదే జరిగితే ఈసారి హిందూపురంలోనూ టీడీపీకి గల్లంతు ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సోమందేపల్లి: అనంతపురం జిల్లా సోమందేపల్లిలో నామినేషన్ల దాఖలు సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్లలోపు జనం గుమికూడరాదనే నిబంధనలున్నా అనుచరులతో హడావుడి చేశారు. పార్టీ కండువాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఆయన తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసినా అధికారులు వారించలేదు. టీడీపీ నాయకులతో కలిసి శైలజ సర్పంచ్ స్థానానికి నామినేషన్ పత్రాలు అందజేసినా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ప్రభుత్వంపై అక్కసు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుండటం మింగుడుపడని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. నామినేషన్ కేంద్రం వద్ద వార్తల సేకరణ కోసం ఉన్న ‘సాక్షి’ విలేకరి జాకీర్‌హుస్సేన్‌తో వాగ్వాదానికి దిగారు. పత్రికపై నోరు పారేసుకోవడంతోపాటు అనుచరులను ఉసిగొలిపి దౌర్జన్యానికి ప్రయతి్నంచారు. రాజకీయ సమావేశాలు పెట్టకూడదని పోలీసులు చెప్పినా బేఖాతరు చేశారు. బీకే పార్థసారథి కారులోని ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మీడియాను దుర్భాషలాడారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై పెనుకొండ సబ్ కలెక్టర్ నిషాంతి స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నా టిప్పర్లనే పట్టుకుంటారా.. మీ అంతు చూస్తా: బీకే
సాక్షి, రొద్దం: ‘‘నేనెవరో తెలుసా....కంకర తరలిస్తున్న నా టిప్పర్లనే పట్టుకుని కేసులు పెడతారా...? మీ అంతు చూస్తా’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారధి పోలీసులపైనే జులుం ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే....రొద్దం మండల పరిధిలోని కంబాలపల్లి సమీపంలో బీకే పార్థసారథికి ఓ క్వారీ ఉంది. పరిమితికి మించి టిప్పర్లలో కంకర తరలిస్తుండటంతో రోడ్లు దెబ్బతినడంతో పాటు దుమ్ముధూళి చెలరేగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు సీజ్ చేసిన టిప్పర్ ఈ క్రమంలోనే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 15న తనిఖీలకు వెళ్లిన పోలీసులు బీకే సాయి కనస్ట్రక్షన్స్‌కు చెందిన టిప్పర్లలో పరిమితికి మించి కంకరను తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసి ఆర్టీఓ అధికారులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సదరు కనస్ట్రక్షన్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వెంటనే ఎస్ఐ నారాయణకు ఫోన్ చేశారు. ‘నా టిప్పర్ నీకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు కనబడుతోంది. కంకర క్వారీ అమ్మేసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. (ఇదేంటయ్యా..? ఇన్‌చార్జ్‌లే దొరకడం లేదు..) -
డబ్బు ఇవ్వకపోతే చస్తారు బీకే పార్థసారథి అల్టిమేటం
పెనుకొండ: తీసుకున్న డబ్బు వాపస్ చేయకపోతే చస్తారంటూ పెనుకొండ నియోజవకర్గం టీడీపీ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రొద్దం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి గాండ్ల విశాలాక్షి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలో నిలిచిన నియోజకవర్గంలోని ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చులకు తన సొంత డబ్బు రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమైన ఆమె ఆ మొత్తాన్ని పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి అందజేసినట్లు సమాచారం. అయితే ఎన్నికలు వాయిదా పడడంతో తాను ఇచ్చిన డబ్బు వాపసు చేయాలంటూ బీకేపై ఆమె ఒత్తిడి చేశారని తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులను బుధవారం రొద్దంకు రప్పించుకుని బీకే సమావేశమయ్యారు. తాను ఇచ్చిన డబ్బు వెంటనే వాపసు చేయాలని లేకపోతే చస్తారంటూ హుకుం జారీ చేయడంతో నాయకులు బిత్తరపోయారు. ఎన్నికలు సకాలంలో జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ డబ్బు తాము ఖర్చు చేశామని, ఇప్పటికిప్పుడు వాపసు చేయాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదంటూ పలువురు వాపోతున్నారు. అయినా పార్టీ అధ్యక్షుడు ససేమిరా అంటూ గడువు విధించి, ఆ లోపు డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేసినట్లు చర్చ జరుగుతోంది. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
‘న్యాయవాదులంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. టీడీపీ నాయకులు సైతం మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
కూతురు.. అల్లుడు.. ఓ సవిత!
సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు పిండి చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమందేపల్లి మండలం గూడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 64లో నాలుగు హెక్టార్ల స్థలంలో క్వారీకి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కుమార్తె బీకే రోజా పేరిట 2015 జూలై 4న లీజుకు తీసుకున్నారు. అయితే ఇక్కడ క్వారీకి పర్యావరణ అనుమతుల్లేవు. అయినప్పటికీ నాలుగేళ్లుగా అక్రమ తవ్వకం కొనసాగుతోంది. బీకే పార్థసారధి అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్వారీకి సంబంధించి 20వేల క్యూబిక్ మీటర్లకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 2లక్షల క్యూబిక్ మీటర్లకు పైనే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రొద్దం మండలం కొగిరి గ్రామంలోని 454, 456–2 సర్వే నెంబర్లలో బీకే సాయి కన్స్ట్రక్షన్స్ పేరిట ఐదు హెక్టార్ల రోడ్డు మెటల్ క్వారీ నిర్వహణకు బీకే పార్థసారధి అల్లుడు పి.శశిభూషణ్ అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీకి నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే దీనికి తోడు అదే గ్రామ సర్వే నంబర్ 456లో 2017లో వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే తాత్కాలిక పర్మిట్ పొంది తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ సైతం తాత్కాలిక పర్మిట్ పొందేందుకు భూగర్భ గనుల శాఖ అధికారులపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముసుగులో కొన్ని వేల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తవ్వేశారు. కియా పరిశ్రమ పక్కన తాత్కాలిక పర్మిట్లతో ఎస్.సవిత పేరిట నిర్వహిస్తున్న క్వారీ పెనుకొండ మండలం మునిమడుగు సర్వేనంబర్ 152లో నిర్వహిస్తున్న ఈ రోడ్డు మెటల్ క్వారీ కియా పరిశ్రమ పక్కనే ఉంది. నిబంధనల మేరకు పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి.అయితే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి అండదండలతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూడు తాత్కాలిక పర్మిట్లు పొందారు. పర్మిట్లను మించి ఇప్పటికే 80వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రతీ క్వారీకి తాత్కాలిక పర్మిట్లను పొందారు. పార్థసారధి కూతురు రోజా పేరిట నిర్వహిస్తున్న క్వారీకి అసలు అనుమతులే లేకపోవడం గమనార్హం. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవితమ్మ పేరిట ఓ క్వారీ లీజుకు తీసుకోగా.. కియా పరిశ్రమ సమీపంలో మూడు తాత్కాలిక పర్మిట్లతో పెద్ద ఎత్తున కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనల మేరకు లీజు ఒక చోట తీసుకోవడం, తవ్వకాలు మరో చోట చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వం మారినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ దందా కొనసాగుతోంది. గనుల శాఖ నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక పర్మిట్లను ఇవ్వరాదు. క్వారీలకు లీజు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో బీకే పార్థసారధి నాకేంటి అడ్డు అన్నట్లుగా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తాత్కాలిక పర్మిట్ల ముసుగులో దోపిడీ అత్యవసర ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లను జారీ చేస్తారు. ఈ ముసుగులో బీకే కుటుంబ సభ్యులు దోరికినంతా దోచేశారు. ఎస్.సవితమ్మ 80వేల క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు తీసుకొని దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే రోడ్డు మెటల్‌ను తవ్వేశారు. 2015నుంచి నేటి వరకు ప్రతి క్వారీలోను అక్రమంగా తవ్వాలు చేపట్టినా గనులశాఖ అధికారులు చుట్టపు చూపుగా కూడా పరిశీలించలేదంటే ఏస్థాయిలో బీకే పార్థసారధి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. వీరి కనుసన్నల్లో నడుస్తున్న ఏ ఒక్క క్వారీని కనీసం తనిఖీ చేసే సాహసం కూడా అధికారులు చేయలేకపోయారు. వారు చెల్లించిందే రాయల్టీ అనే రీతిన క్వారీలను నిర్వహిస్తున్నారు. బీకే పార్థసారధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
బరితెగించిన బీకే పార్థసారథి
సాక్షి, పరిగి: అధికార బలంతో ఏదైనా చేయడానికి వెనకాడని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి తన దుర్బుద్దిని మరోసారి చాటారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిగి మండలంలోని కాలువపల్లి వద్ద ఉన్న నిషా డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమకు బుధవారం సాయంత్రం వచ్చి దాదాపు అరగంటకు పైగా గార్మెంట్‌లో పనిచేస్తున్న మహిళలను సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. లోపలికి వెళ్లిన ఆయన తన అనుచరులతో కలిసి కలియతిరిగారు. పరిశ్రమ యాజమాన్యంతో ఉన్న చొరవతోనే లోపలికి ప్రవేశించి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. ప్రతి ఒక్క మహిళతో తనకు గెలిపించాలని కోరినా అక్కడున్న మహిళలు పెద్దగా స్పందించకవడంతో అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడి చేరుకొని వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ గణపవరం శివ లోపలికి వెళ్లగా లోపలున్న పార్థసారధి అక్కడి నుంచి తన వాహనంలో ఉడాయించారు. ఆయనకు సిగ్గు మానం లేదు:గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పెనుకొండ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి తను సీనియర్ రాజకీయ నాయకుడన్న విషయమే మరిచిపోయాడని, సమయం దాటినా ప్రచారం నిర్వహించి మహిళలతో తరిమించుకున్నాడని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. పరిగి మండలం కాలువపల్లి గార్మెంట్ పరిశ్రమ వద్దకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించిన పార్థసారథి తీరును ఖండించారు. డబ్బులు ఎరచూపి, గందరగోళం సృష్టించి ఫ్యాక్టరీలోకి ప్రవేశించాడన్నారు. అక్కడున్న మహిళలు వెంటబడి తరిమితే సిగ్గులేకుండా పరిగెత్తిపోయాడన్నారు. అలాగే హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సంతలో పశువులను కొంటున్నట్లు విచ్చలవిడిగా డబ్బుపంచాడని ధ్వజమెత్తారు. వెంటనే వైఎస్సార్సీపీ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ముఖ్య ఎలక్షన్ ఏజెంట్ మాలగుండ్ల రవీంద్ర, పరిగి మండల కన్వీనర్ జయరాం తదితరులు పాల్గొన్నారు. -
పార్థసారథి..ఇక ఇంటికే!
సాక్షి, సోమందేపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి ఏపల్లెకెళ్లినా ప్యాకప్ చెప్పాల్సి వస్తోంది. రోజురోజుకూ ఆయనకు చేదు అనుభవం ఎదురవుతోంది. గత ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టకున్నా.. పాలనా కాలమంతా పల్లెల మొహం ఎరగకున్నా ఏ మొహం పెట్టుకొని ఓట్లడగడానికి వస్తారు? అంటూ జనం నిలదీస్తున్నారు. శుక్రవారం మండలంలోని నాగినాయని తండా, తుంగోడు, చిన్నబాబయ్యపల్లి రోడ్‌షోలను ప్రజలు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే బీకే పార్థసారథి నాగినాయని చెరువు తండాలో రోడ్షోనిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ చేరుకోగానే గ్రామస్తులు సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థి బీకేకు ఏకరువు పెట్టారు. వేలుపుకొండ క్వారీకు సంబంధించి తమకు న్యాయం చేయలేని నువ్వు.. ఓట్లు అడిగే అర్హత లేదంటూ నిలదీశారు. ప్రచార రథం నుంచి దిగకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. క్వారీ నిర్వాహకులకు వంతపాడారని, వేలుపుకొండకు సంబంధించి పురాతన అకమ్మగార్లు ఉన్నాయని చెప్పినా గ్రామస్తుల సమస్యను పట్టించుకోలేదని, ఐదేళ్లు నీటి సమస్యతో బాధపడుతున్నా సమస్య తీర్చేందుకు చొరవచూపలేదని నిలదీశారు. దీంతో కొద్దిసేపు గ్రామస్తులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్దంగా 12 కార్లు 100 బైక్‌లతో వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చి బీకే హంగామా చేశారు. చిన్నబాబయ్యపల్లిలోనూ చుక్కెదురే..: అనంతరం చిన్నబాబయ్యపల్లికి చేరుకోగానే ఎస్సీ కాలనీ వద్ద ఖాళీ బిందెలతో స్థానికులు నిరసన తెలియజేశారు. నీళ్లు ఇవ్వని ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. స్థానిక రైతు ప్రతాప్‌రెడ్డి నీళ్ల సమస్యపై స్థానికులతో కలిసి ఎమ్మెల్యేను సమస్యను ప్రస్తావించగా కోపోదిక్తుడైన బీకే గతంలో మీ ఊరికి వచ్చినప్పుడు నువ్వే ప్రజలను రెచ్చగొట్టి నన్ను అవమానపరిచావు..ఇప్పుడు నువ్వే అతిగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. ’ అంటూ ఎమ్మెల్యే బెదిరించాడు. గ్రామస్తులు నినాదాలు చేస్తుండడంతో ‘చిల్లర వ్యక్తులతో మనకెందుకు అని ’ వెళ్లిపోయారు. అసభ్య పదజాలంతో తిట్లదండకం : అనంతరం తుంగోడు గ్రామానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా నీటి సమస్యతో పాటు రోడ్డు, డ్రైనేజీ, కాలువలు సైతం నిర్మించలేదని, తమను ఎందుకు ఓట్లు అడుగుతారని స్థానికులు ప్రశ్నించారు. కొందరు కార్యకర్తలు ఇళ్ల వద్దకువవెళ్లి కరపత్రాలు ఇవ్వగా టీడీపీ ఓటు వేసేదిలేదని చెప్పారు. దీంతో బయప్పరెడ్డి అనే రైతుపై ఆ పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా దూషించారు. ఎమ్మెల్యే బీకే కూడా కాన్వాయ్ నుంచి మైకులో పత్రికల్లో రాయలేని భాషలో తిట్లదండకం అందుకున్నారు. తుంగోడు వా ళ్లు ఏమైనా పాలేగాళ్లా.. ‘నీయమ్మా.. ’ ఎన్నికలు ముగియనీ.. మీ అంతు చూస్తా’ అంటూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ వెంకటరమణ, జీవీపీ నాయుడు తదితరులు స్థానికులకు నచ్చజెప్పడానికి ప్రయత్నిం చారు. కాగా పోలీసులను ఎమ్మెల్యే ఉసిగొలిపి ఆయా గ్రామాల్లో నిలదీసిన వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. -
బీకే గొప్పలు..జనం తిప్పలు
సాక్షి, పెనుకొండ: అసమర్థ ప్రజాప్రతినిధి అరాచకంతో దశాబ్దకాలంగా ఎదుగూబొదుగూలేని నియోజకవర్గంగా పెనుకొండ మిగిలిపోయింది. ఎటు చూసినా బీడు భూములే.. తాగునీటి ఇబ్బందులే.. అందరూ వలసపోగా నిర్మానుష్యంగా ఉన్న పల్లెలే. అయినా స్థానిక ఎమ్మెల్యే మాత్రం అరచేతిలో అభివృద్ధి చూపుతున్నారు. అన్నీ తానే చేశానంటూ గొప్పలు చెబుతున్నారు. ఎన్నికల వేళ హామీల ముల్లె భూజాన వేసుకుని ఊరూవాడా తిరుగుతున్నారు. రోడ్డులేదు.. నీరురాదు..ఇల్లు లేదు 2014 ఎన్నికల్లో పార్థసారథి పెనుకొండ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దర్గాపేటలో మాత్రం నాటుగైదు రోజులకు ఒకసారి నీరు వదలుతుంటే ఆ ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దీంతో ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదు. పెన్నానదికి అడ్డంగా సబ్‌సర్ఫేస్ డ్యాం కట్టించి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య తీర్చుతానని బీకే పార్థసారథి హామీ ఇచ్చినా.. అది కాగితాలను పరిమితమైంది. ఇక నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లుకూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గకేంద్రంలో గత ప్రభుత్వాలు పట్టాలివ్వగా...లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకుండా ఎమ్మెల్యేనే అడ్డుపడ్డారు. ఇళ్లు నిర్మించుకునేందుకు వెళ్తున్న పేదలను పోలీసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయల ఉత్సవాలకూ మంగళం పురాతన కట్టడాలను అభివృద్ధి చేసి ఈప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే..తన మాట నిలుపుకోలేదు. అసలు పురాతన కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక రాయల ఉత్సవాలను నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇక పర్యాటక కేంద్రం అన్న అంశాన్నే అటకెక్కించారు. విద్యాభివృద్ధికి చర్యలు లేవు ఇక్కడి బాలికల కోసం జూనియర్ కళాశాల ఏర్పాటుచేస్తానని చెప్పినా... నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు పూర్థిస్థాయిలో కృషి చేసి విద్యార్థులు టెక్నికల్ కోర్సులు చదివేలా చూస్తానన్న ఆయన హామీ గాల్లో కలిసిపోయింది. ఇక పరిగిలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. నీళ్లు కరువు..బీళ్లుగా పొలాలు గోరంట్ల మండలానికి హంద్రీనీవా నీళ్లు తీసుకువస్తానని గొప్పలు చెప్పిన బీకే..నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకువచ్చి హంద్రీనీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతానని ఆయన ఇచ్చిన హామీ...గాల్లో కలిసిపోయింది. దీంతో రిజర్వాయర్ కింద ఉన్న 10 వేల ఎకరాలు, పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండలాల పరిధిలోని 25 చెరువుల కింద ఉన్న 14 వేల ఎకరాలు బీడుగా మారిపోయింది. కళ్లముందే పారుతున్న కృష్ణా జలాలు పొలాల్లో పారక రైతులు అల్లాడిపోతున్నారు. ఇక పెనుకొండ మండలంలోని మునిమడుగు చెరువు తెగి ఏళ్ళు గడుస్తున్నా.. పట్టించుకోలేదు. చేనేతలకు మొండిచేయి పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాల్లోని చేనేతల ఓట్ల కోసం బీకే పార్థసారథి ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక కనీసం వారిని పలకరించిన పాపన పోలేదు. చేనేతల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా అందక...అప్పుల పాలైన ఎందరో చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా...ఆయన స్పందించలేదు. ఇవే కాకుండా రొద్దం డెయిరీని తెరిపించడం.. గోరంట్లలో హిందూశ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నేటికీ నెరవేరలేదు. అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే బీకే పార్థ సారథి ఈ నాలుగున్నరేళ్లలో అవినీతి, ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలుచారు. అల్లుడు శశిని ప్రోత్సహించి సెంటిల్మెంట్లు, దందాలు సాగించారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.కోట్లు పర్సెంటేజ్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద రైతుల భూములను తక్కువ ధరకు కోనుగోలు చేసి అనంతరం మూడు రెట్లు ఎక్కువకు ‘కియా’ యాజమాన్యానికి విక్రయించారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రైతులను బెదిరించి పరిశ్రమ సమీప ప్రాంతాల్లో రూ.కోట్ల విలువజేసే భూములు అక్రమంగా కొనుగోలు చేసినట్లు జనం చర్చించుకుంటున్నారు. ఇక పేటకుంట సమీపంలో ఓ సామాజిక సంస్థ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.కోట్ల రూపాయల లాభానికి విక్రయించారన్న విమర్శలున్నాయి. అలాగే పరిగి మండలం ఊటుకూరు చెరువులో కియా అనుబంధమైన కేఐఎంఎల్ పరిశ్రమ ఏర్పాటులో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవు ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి ప్రజా సమస్యలు పట్టవు. అందుకే ఇక్కడ అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గ కేంద్రంలోని దర్గాపేటలో వందలాది మంది ఇళ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య వేధిస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నా...ఎమ్మెల్యేకు పట్టడం లేదు. – యాసిన్, పెనుకొండ వ్యవసాయం మానుకున్నాం చెరువుకు మరమ్మత్తులు చేయించి రైతులను ఆదు కుంటానని బీకే పార్థ సారథి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తీరా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇపు డు హడావుడిగా పనులు ప్రారంభించారు. చెరువు కు నీళ్లు చేరక..వ్యవసాయం చేయడమే మానేశాను. – శేఖరప్ప, రైతు, మునిమడుగు, పెనుకొండ -
తిట్టినా.. తుడిచేసుకొని!
సాక్షి, పెనుకొండ రూరల్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈ కోవలోనే ఉప్పునిప్పుగా ఉన్న ఎమ్మెల్యే బీకే పార్థసారధి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మునిమడుగు చిన వెంకటరాముడు ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం పెనుకొండ మండలంలోని మునిమడుగులో బీకే ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక సందర్భంగా చిన వెంకటరాముడు తన వర్గీయులను పెద్ద ఎత్తున టీడీపీలోకి తీసుకొస్తారని ఆశించినా నిరాశే మిగిలింది. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన కొందరు అనుచరులు మినహాయిస్తే పెద్దగా స్పందన లేకపోవడం బీకేతో పాటు టీడీపీ శ్రేణులను తీవ్ర అసహనానికి గురిచేసింది. పైగా మంత్రి పరిటాల సునీత కూడా కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో హల్చల్ ఆదివారం ఉదయం నుంచి ఒక వీడియో సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది ప్రత్యేక హోదా కోసం పెనుకొండ పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్న అప్పటి కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ బాధ్యుడు, ప్రస్తుతం టీడీపీలో చేరిన మునిమడుగు చిన వెంకట్రాముడును ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి తీవ్ర పదజాలంతో దూషించారు. రోడ్డుపై ధర్నా చేస్తూ తన కారుకు అడ్డుగా తగిలాడనే కారణంతో బండ బూతులు తిట్టిన వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ నియోజకవర్గంలో తన ఓటమి ఖాయమని తేలిపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే బీకే పడుతున్న పాట్లను చూసి అధికారం కోసం ఇంతటి నీచానికి దిగజారుతారా? అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిన వెంకటరాముడు కూడా ప్యాకేజీ కోసం తనను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే పంచన చేరడాన్ని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మహిళా నేత మధ్యవర్తిత్వం చిన వెంకటరాముడు టీడీపీలో చేరిక వెనుక పెద్ద డీల్ కుదిరినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడుకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించగా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలుస్తోంది. పెనుకొండకు చెందిన ఓ మహిళా నేత రాప్తాడులో కుల ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తుండటంతో.. ఇందుకు ప్రతిగా రాప్తాడుకు చెందిన మహిళా నేత ఈ డీల్ కుదిర్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం చిన్న వెంకటరాముడుకు పెనుకొండ నేత రూ.50లక్షలు, పార్లమెంట్ నేత రూ.30లక్షలు, రాప్తాడు మహిళా ప్రజాప్రతినిధి రూ.20లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. -
బొండా ఉమా, పార్థసారధి రాజీనామా
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి మంగళవారం టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న భావనతో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కాగా, తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి రాజీనామా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టిక్కెట్ ఆశించి భంగపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తాను ఏవిధంగా పోటీకి దిగుతాననే దానిపై రెండు మూడు రోజుల్లో తెలియజేస్తానన్నారు. -
ఎమ్మెల్యేవారి బూతుపురాణం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న ఆశతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంతకుమునుపు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఎంతగానో సహకరించారు. కానీ ఆయన మాత్రం సొంత లాభమే ఎక్కువగా చూసుకున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే బూతు పురాణం వినిపిస్తున్నారు. 2014లో ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. అక్రమ సంపాదనతో అహం పెరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నించే విపక్ష పార్టీల నాయకులను దూషించడం, ప్రజలను చులకనగా మాట్లాడటంతో జనమంతా ఆయనంటేనే ఈసడించుకుంటున్నారు. చివరకు సొంత పార్టీ నేతలను సైతం రాయలేని పదజాలంతో దూషిస్తుండటంతో చాలా మంది సీనియర్లు ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి నెలకొంది. తన అల్లుడి ద్వారా నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు చేసుకుని సొంత పార్టీలోని సీనియర్లను తీవ్రంగా అవమానించారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడగా...మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత్రికేయులనూ వదలని బీకే పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలు, అవినీతిపై కథనాలు రాసిన విలేకరులను సైతం బీకే నోరుచేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. నోటికి అంతూపంతూ లేకుండా ఆయన వినిపించే బూతుపురాణం వింటే ఎవరైనా ఇతనో ఎమ్మెల్యేనా అని అనుమానిస్తారు. ‘‘ఏయ్ ఎస్ఐ.. ఈ నా కొడుకులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి మక్కిలు విరిగేలా తన్ను’’ - నీటి సమస్యలపై నిలదీసిన పెనుకొండ మండలం కొండంపల్లి సీపీఐ నాయకులనుద్దేశించి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలివి. ‘‘ఏయ్ సీఐ.. ఆ లం..కొడుకును.. ఎవరు రోడ్డుపై ధర్నా చేయమన్నారు. మొదట ఆ లం..కొడుకును చెప్పుతో కొట్టి పోలీస్‌స్టేషన్‌లో పెట్టి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చెయ్...’’ - ప్రత్యేక హోదాపోరుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి అప్పటి సీఐ శ్రీనివాసులుతో ఎమ్మెల్యే అన్న మాటలివి. బీకే దూషణల పర్వంలో మచ్చుకు కొన్ని.. ఇటీవలే సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లిలో గ్రామస్తులు నీటి సమస్యపై ఎమ్మెల్యేని నిలదీస్తే దీనికి బాధ్యుడిగా చేస్తూ స్థానిక ‘సాక్షి’ విలేకరిపై చిందులు వేసి దూషించాడు. అలాగే పెనుకొండ, రొద్దం మండలాలకు చెందిన విలేకరులను సైతం చాలా సందర్భాల్లో బహిరంగంగానే దూషించారు. రెండునెలల క్రితం గోరంట్ల మండలం అమ్మవారిపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో మంజూరైన సిమెంట్ రోడ్డును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బీకే గ్రామానికి రాగా...స్థానికులంతా సిమెంట్ రోడ్డు బదులుగా తారురోడ్డు వేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే బీకే సహనం కోల్పోయి వారితో దురుసుగా ప్రవర్తించాడు. ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించమని అడిగిన పాపానికి అమ్మవారిపల్లికి చెందిన భూ నిర్వాసితుల కుటుంబానికి చెందిన విద్యార్థి వెంకటరెడ్డిని అందరి ముందే దూషించాడు. ఇలా ఆయన నోటికి బలైన వారు ఎందరో ఉన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడటం తగదంటున్నారు. -
బీకేకు అసమ్మతి సెగ
పెనుకొండ: టీడీపీలో అసమ్మతి సెగ తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దంటూ పెనుకొండకు చెందిన ముఖ్య నాయకులు కొందరు ఏకంగా సీఎం చంద్రబాబు వద్దే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడోరేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పార్థసారథి సైతం టికెట్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి ముందే రాజధానికి చేరుకున్న పలువురు అసమ్మతినేతలు ఎమ్మెల్యే బీకేకు టికెట్ ఇవ్వరాదని పెద్దఎత్తున రచ్చచేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బీకే గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి, అవినీతి, అక్రమాలు, ఏకపక్ష ధోరణిపై భగ్గుమంటున్న పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి, పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూరి, సీనియర్ టీడీపీ నాయకులు జీవీపీ నాయుడు ఇతర నాయకులు టికెట్ విషయంలో అడ్డుపడినట్లు సమాచారం. సీఎంకు సన్నిహితంగా ఉన్న మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు, తదితర మంత్రులను సైతం కలిసిన నాయకులు ఎమ్మెల్యే బీకే వ్యవహారశైలిని వివరించినట్లు తెలిసింది. అయితే సకాలంలో నాయకులు సీఎం వద్దకు చేరే పరిస్థితి లేకపోవడంతో సీఎం ఏకపక్షంగా టికెట్ బీకేకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అసమ్మతి నేతల ద్వారా ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సీఎం మళ్లీ మాట్లాడదాం అంటూ దీనిపై మౌనం వహించినట్లు తెలిసింది. రగులుతున్న అసంతృప్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీకే తీరుపై సీనియర్లలో అసంతృప్తి రగులుతోంది. ఇప్పటికే అనేక మంది టీడీపీ ముఖ్యులు వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. సోమందేపల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ చేనేత నాయకుడికి సోమందేపల్లిలో ఎంతో పేరుంది. అలాంటి నాయకుడిని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అవమానానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన పార్టీలో ఉండటం కంటే బయటికి పోవడమేæ మేలనీ, అతన్ని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఎమ్మెల్యే నుంచే ఆదేశాలు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అదే గ్రామంలో దివంగత జెడ్పీ చైర్మన్ బంధువు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఉపసర్పంచ్ సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి, పెనుకొండ, రొద్దం, గోరంట్ల మండలాల్లో అసమ్మతి నేతలు.. ఎమ్మెల్యే నీడలా నడుస్తూ ఆయన ఓటమిని చూడాలని తహతహలాడుతున్నారు. ఇక తన సామాజిక వర్గమైన కురుబ కులస్తుల్లో సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విచారంలో ఎంపీ నిమ్మల బీకే. పార్థసారథికే సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఎంపీ నిమ్మల క్రిష్టప్ప తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన ఎంపీ కిష్టప్ప జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎలాగైనా పెనుకొండ టికెట్‌ను తనకుమారుడి, లేదా తనకైనా తెచ్చుకోవాలని భావించిన నిమ్మల ఆశలకు గండిపడటంతో దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్ళు తాను ఎదుర్కొన్న అవమానాలపై ఎంపీ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి గెలుపు కష్టసాధ్యమేనన్న ప్రచారం జరుగుతోంది. -
పెనుకొండ కోటకు.. అవినీతి సారథి
పెనుకొండ... పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అరాచక రాజకీయానికి నిలయం... అవినీతి, అక్రమాలను ఎదురించలేక బిక్కుబిక్కుమంటూ గడిపే అమాయక ప్రజలున్న ప్రాంతం. 2004 వరకూ పరిటాల రవీంద్ర, ఆ తర్వాత బీకే పార్థసారథి గుప్పిట్లో ఉన్న నియోజకవర్గం. దశాబ్దాలుగా ఇక్కడి జనం పేదలుగానే ఉన్నా....నేతలు మాత్రం రూ.వందల కోట్లకు పడగలెత్తారు. గత నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆర్జించిన మొత్తమే రూ.400 కోట్లు దాకా ఉంటే.... నియోజకవర్గంలోని టీడీపీ నేతలు సాగించిన దందా మరో రూ.400 కోట్ల మేర ఉంటుంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన అల్లుడు శశిభూషణ్.. నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నుంచి కంకర క్వారీల దాకా...‘నీరు–చెట్టు’ పథకం పనుల నుంచి మరుగుదొడ్ల దాకా...ప్రభుత్వ భూముల నుంచి ఎస్సీల భూముల వరకు దేన్నీ వదల్లేదు. ప్రతీ పనిలోను ‘మాకేంటి? మా వాటా ఎంత?’ అనే రీతిలోనే దందా సాగిస్తున్నారు. నాలుగున్నరేళ్ల కిందట పార్థుడి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత స్థితి బేరీజు వేస్తే.... అందనంత ఎత్తుకు ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పార్థుడితో పాటు ఆయన సైన్యం పెనుకొండ కోటను అడ్డాగా చేసుకుని సాగించిన అవినీతికాండపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, అనంతపురం ఎస్సీల భూముల్లో ‘పార్థుడి’ క్వారీ రొద్దం మండలంలోని కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి క్వారీ నడుపుతున్నారు. తన కుమారుడు సాయి పేరు మీద నడుస్తున్న ఈ క్వారీ కోసం కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను ఎమ్మెల్యే స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏడాదికి రూ.4 వేల చొప్పున లీజు ఇస్తామని బలవంతంగా లాక్కున్నారు. క్వారీ మిషనరీ ఈ పొలాల్లో ఏర్పాటు చేశారు. కొండ పైనుంచి రాళ్లు ఇక్కడికి తెచ్చి..కంకర చేసి విక్రయిస్తున్నారు. అయితే ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తే తాము ఎలా బతకాలని ఎస్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము పంటలు పండించుకుంటే కనీసం రూ.30 వేలు దాకా సంపాదించుకుంటామని..అందువల్ల రూ.4 వేల లీజుకు పొలాలు ఇవ్వమని తొలుత తేల్చిచెప్పారు. కానీ పొలాలు ఇవ్వకపోతే పూర్తిగా లాగేసుకుంటామని బెదిరించిన ఎమ్మెల్యే బీకే... వారి చేతిలో చిల్లర విదిల్చి క్వారీ పనులకు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి భారీగా ఆర్జిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలాల్లో క్వారీ పనులు జరుగుతున్న సమయంలో కంకర పొడి, దుమ్మ, ధూళి ప్రభావంతో చుట్టపక్కల వంద ఎకరాల్లోని పంటలు నాశనమవుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పనులు జరుగుతున్నపుడు దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లాలనే నిబంధన ఉన్నప్పటికీ...ఇక్కడ పాటించడం లేదు. దీంతోపాటు కేవలం 10 ఎకరాల్లో క్వారీ నడిపేందుకు అనుమతులు తీసుకున్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి...అధికారం అండతో ఏకంగా 30 ఎకరాల్లో నడుపుతున్నారు. పగటి వేళల్లో కూడా క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్డు పనుల్లో ఎమ్మెల్యే అల్లుడికి 6 శాతం కమీషన్లు రొద్దం మండలంలో 57 నెలల్లో రూ.90 కోట్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్ కనుసన్నల్లోనే సాగాయి. రోడ్డు పనులు దక్కించుకోవాలనుకున్న వారు శశిని కలిసి కమీషన్ మాట్లాడుకుంటారు. కమీషన్‌పై అవగాహన కుదిరిన తర్వాత అస్మదీయ కాంట్రాక్టర్లు మినహా ఎవ్వరూ టెండర్లు వేయకుండా శశి హుకుం జారీ చేస్తారు. ఇలా నియోజకవర్గంలో రోడ్డు పనుల ద్వారా దాదాపు రూ.6 కోట్ల మేర కమీషన్ రూపంలో శశి ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. పరిగి మండలంలో... ‘నీరు–చెట్టు’ పథకం కింద పరిగి మండలంలో రూ.5.04 కోట్లు ఖర్చుపెట్టారు. ఇందులో పనులే చేయకుండా రూ.3.87 కోట్లు దుర్వినియోగం చేశారు. చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు, కాల్వల తవ్వకం, చెక్‌డ్యాం పనుల్లో రూ.38.71 లక్షల అవినీతికి పాల్పడ్డారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద గ్రామాల్లో సిమెంట్‌రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కూడా టీడీపీ నేతలు ‘గుడ్‌విల్’ తీసుకున్నారు. ఊటుకూరులో 480.80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 2018లో సర్వే నంబర్ 240, 241లో 15.1 ఎకరాల విస్తీర్ణంలో చెన్నైకి చెందిన కేఐఎల్‌ఎం పరిశ్రమ పనులు చేపట్టింది. ఇందులో 9. 31 ఎకరాలకు తప్పుడు రికార్డులతో అనుమతులు పొందారు. ఇందులో ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. చెరువు స్థలాన్ని మాజీ సర్పంచ్ ఈశ్వరప్ప 5 ఎకరాలు ఆక్రమించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. శాసనకోటలో 85 మరుగుదొడ్లకు ఒక్కో యూనిట్ రూ.15 వేలతో 85 యూనిట్లకు కలిపి రూ.12.75 లక్షలకు టీడీపీ నేతలు తప్పుడు బిల్లులు చేసుకుని స్వాహా చేశారు. 15.80 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా రొద్దం మండలంలో ప్రభుత్వ జాగా కన్పిస్తే తమ్ముళ్లు పాగా వేస్తున్నారు. మండలంలోని రొద్దంకపల్లిలో సర్వే నంబర్ 23–1, 2, 3లో 11.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 23–1 లెటర్లో టీడీపీ నేత జనార్దన్ భార్య లక్ష్మీదేవి పేరుతో 5 ఎకరాలు, 23–2 లెటర్లో ఈశ్వరప్ప పేరుతో 2.65 ఎకరాలు, 23–3 లెటర్లో నాగరాజు భార్య సావిత్రమ్మ పేరుతో 4 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. దీంతో పాటు టీడీపీ నేత రామచంద్ర పేరుతో 1303–2లో 4.15 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. ఈ సర్వే నంబర్లలోని భూమి విలువ ప్రస్తుతం ఎకరా రూ. 10 లక్షల దాకా ఉంది. ఈ భూముల పట్టాలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా పొందారు. ఇసుక దోపిడీనే రూ.438 కోట్లు పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పతో పాటు టీడీపీ నేతలకు భారీ ఆదాయన వనరు ఇసుక. నియోజకవర్గ పరిధిలో పెన్నా, జయంగళీ, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాలున్నాయి. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక రవాణా అక్రమంగా సాగుతోంది. డ్వాక్రా మహిళల కనుసన్నల్లో ఇసుక రీచ్‌లు నడిచిన రోజుల నుంచి ...నేటి వరకూ ఇసుక రవాణా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. ఎమ్మెల్యే సొంత మండలం రొద్దంలో పెన్నానది ఉంది. పరిగి, గోరంట్లలో పెన్నా, చిత్రావతితో పాటు జయమంగళి ఉన్నాయి. పెన్నా నుంచి ఒక టిప్పర్ ఇసుక కర్ణాటకు తరలిస్తే రూ.50 వేలు తీసుకుంటున్నారు. ట్రాక్టర్‌కు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. రొద్దం నుంచే రోజూ 20 టిప్పర్లు, 50 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. గోరంట్ల, పరిగి నుంచి కూడా రోజూ 20 టిప్పర్ల చొప్పున ఇసుక తరలిపోతోంది. అంటే సగటున నియోజకవర్గం నుంచి 60 టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.50 వేల చొప్పున రోజూ రూ.30 లక్షలు ఆర్జిస్తున్నారు. మరో రూ.10 లక్షలు ట్రాక్టర్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఈ లెక్కన రోజుకు రూ.40 లక్షల చొప్పున టిప్పర్ల ద్వారా ఏడాదికి రూ.146 కోట్ల ఆదాయం వచ్చినట్లే. ఈ నాలున్నరేళ్లలో ఏడాదిన్నర పాటు ఇసుక తవ్వకాలు చేపట్టలేదనుకున్నా... మూడేళ్ల పాటు ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ఇసుక అక్రమ రవాణాతోనే రూ.438కోట్లు ఆర్జించి ఉంటారు. ఇందులో మెజార్టీ వాటా ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్లకు చేరితే...మిగతా సొమ్మును టీడీపీ నేతలు, కార్యకర్తలు వాటాలు పంచుకున్నారు. మరుగుదొడ్ల పేరుతో రూ.2.50 కోట్ల దోపిడీ రొద్దం...ఎమ్మెల్యే బీకే పార్థసారథి సొంత మండలం. 19 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ కింద 8,700 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 6,533 పూర్తయినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇందుకు రూ. 9.79 లక్షల బిల్లులు చేశారు. అయితే 63 గ్రామాల్లో కూడా 35 శాతం మరుగుదొడ్లు చేయకుండానే చేసినట్లు తప్పుడు బిల్లులు చూపించి నిధులు స్వాహా చేశారు. ఇలా రూ.2.50 కోట్ల నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి చేరాయి. జెడ్పీటీసీ సభ్యుడు చిన్నప్పయ్య తప్పుడు బిల్లులతో రూ.50 లక్షలు ఆర్జించినట్లు తెలుస్తోంది. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యులే పనులు చేశారు. దీంతో వారు పనులు చేయకుండానే ఎమ్మెల్యే బీకే పార్థసారథితో అధికారులకు ఫోన్లు చేయించుకుని, ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నారు. దొంగబిల్లులు చేయడానికి నిరాకరించిన ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ సభ్యుడు బదిలీ చేయించారు. ‘నీరు–చెట్టు’ పనుల్లో భారీ దోపిడీ మండలవ్యాప్తంగా ‘నీరు–చెట్టు’ పథకం కింద 120 పనులు జరిగాయి. రూ.7 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో పూడిక తీత, సప్లయి చానల్స్, కంపచెట్ల తొలగింపు, చెరువుల మరమ్మతులు, తూముల మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా పనులు చేసి, చేయని పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి రూ.2.79 లక్షలు దోచుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చలపతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణం, కొండయ్య ఈ పనులు చేశారు. సోమందేపల్లి మండలంలో... గుడిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్– 64లో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కుమారై బీకే రోజ, అల్లుడు చంపకదామ పేరుతో 4.96 ఎకరాల్లో క్వారీ ఉంది. ఈ క్వారీ ద్వారా భారీగా అర్జిస్తున్నారు. సోమందేపల్లి చెరువు సమీపంలో రాయ్‌బహద్దూర్ నరసింహదాస్ వై పవర్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీ, వేలుపుకొండలోని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీల నుంచి ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందుతున్నాయి. దీనికి రోడ్డు సౌకర్యం లేకపోతే ఎమ్మెల్యేనే జాతీయరహదారిని కలుపుతూ రోడ్డు వేయించారు. దీనికి ప్రతిఫలంగా క్వారీ యజమానులు ఎమ్మెల్యేకు మామూళ్లు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎవరు రోడ్డు పనుల టెండర్లు దక్కించుకున్నా...ఎమ్మెల్యేకు సంబంధించిన క్వారీల నుంచే కంకర తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. పాపిరెడ్డిపల్లిలోని ఐ పవర్ నేషన్ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోన్న క్వారీతో గిరిజనుల ఆరాధ్య దైవమైన వేలపుకొండ దెబ్బతింటోంది. బ్లాస్టింగ్‌తో సమీపగ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ‘నీరు–చెట్టు’ పథకం కింద రూ.12 కోట్ల పనులు చేశారు. 160 పనులకు రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తక్కిన రూ.8 కోట్లను పనులు చేయకుండానే తప్పుడు బిల్లుల సృష్టించి స్వాహా చేశారు. గుడిపల్లి పొలంలో సర్వే నంబర్ 117–2ఎలో ఎమ్మెల్యే కుమారై బీకే రోజ పేరుతో భూములు కొనుగోలు చేశారు. గోరంట్ల మండలంలో... గోరంట్ల మండలంలో రూ.5 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారు. ఈ పనులు ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులే చేస్తున్నారు. ఎంపీ నిమ్మల తన సొంత పొలాలు, కల్యాణమంటపాలకు ఎంపీ నిధులతో సిమెంట్‌రోడ్లు వేయించుకున్నారు. బీఎన్ తండా నుంచి హిందూపురం రోడ్డు వరకూ రూ.80 లక్షలు, కాటేపల్లి నుంచి రూ.40 లక్షలతో రోడ్డు పనులు చేశారు. ఈ పనులు టెండర్ ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. చిత్రావతి నది నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా కర్ణాటకకు రవాణా చేసి రూ.60 కోట్లు దాకా స్వాహా చేశారు. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకు వాటాలు అందాయి. ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా మండలంలో రూ.20 లక్షల వరకూ టీడీపీ నేతలు స్వాహా చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించి టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. గోరంట్లలో చిత్రావతి నదిపై రూ.4.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో కూడా కాంట్రాక్టర్ నుంచి ముడుపులు అందుకున్నారు. పెనుకొండ మండల పరిధిలో... శెట్టిపల్లిలో సర్వేనంబర్ 345–2లో ఎమ్మెల్యే బీకే... బినామీల పేరుతో గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. ఈ క్వారీ నుంచి ఎక్కువగా ముంబయికి గ్రానైట్ సరఫరా అవుతోంది. గ్రానైట్ ద్వారానే ఎమ్మెల్యే బీకే రూ.70 కోట్లు ఆర్జించి ఉంటారు. ‘కియా’ కార్ల పరిశ్రమ వస్తుందని తెలిసి అమ్మవారిపల్లి, ఎర్రమంచి ప్రాంతాల్లో తన అనుచరుల పేరుతో బీకే పార్థసారథి భూములు భారీగా కొనుగోలు చేశారు. వీటి విలువ రూ. 50 కోట్ల దాకా ఉండొచ్చు. గుట్టూరులో కురబ కార్పొరేషన్ వైస్ చైర్మన్ సబితకు కంకర క్వారీ ఉంది. ఇందులో కూడా ఎమ్మెల్యేకు వాటా ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పనుల్లో గుడ్‌విల్, ల్యాండ్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్ రూ.80 కోట్లపైనే ఆర్జించి ఉంటారని తెలుస్తోంది. పెనుకొండ మండలంలో చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం పనుల్లో రూ.10 కోట్లు అవినీతి జరిగింది. ఈ వ్యవహారంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులు భారీగా లబ్ధిపొందారు. ‘కియా’ కార్ల పరిశ్రమ, గొల్లపల్లి రిజర్వాయర్‌లో భారీగా మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా వాటాలు అందినట్లు తెలుస్తోంది. పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బెదిరింపులు పావగడ నుంచి దేవనహళ్లి వరకు పవర్ గ్రిడ్ ద్వారా విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితం పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం, సోమందేపల్లి మండలాల పరిధిలో టవర్లు ఏర్పాటు చేస్తుండగా.. ఎమ్మెల్యే బీకే అల్లుడు శశిభూషణ్ అడ్డుకున్నారు. పెనుకొండ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్దకు కాంట్రాక్టర్లను పిలిపించి రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు తాము అంత మొత్తం ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు పెనుకొండ నియోజకవర్గంలో టవర్ పనులు నిలిపి గౌరిబిదనూరు వద్ద పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక పెనుకొండ నియోజకవర్గంలో పనులు మొదలు పెడతామనీ, అప్పటి వరకు తాము అడుగుపెట్టమని కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే అనుచరుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. -
టీడీపీకో దండం.. ఎమ్మెల్యే బీకే ఓ ఉన్మాది
అనంతపురం సెంట్రల్: పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నాడని ఆ మండల ఎంపీపీ పద్మావతి, పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎంపీపీ పద్మ తన పదవికి రాజీనామా చేశారు. తమ అనుచరులతో నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఆమె తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణకు అందజేశారు. అనంతరం తన రాజీనామాకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు. 2017 నుంచి (18 నెలలు) ఎంపీపీగా కొనసాగుతున్నట్లు వివరించారు. రొద్దం మండలంలో తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారథి కక్షసాధింపు చర్యలతో వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని ఆరోపించారు. పేరుకు మాత్రం తాము ఎంపీపీ హోదాలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఉన్మాదిలా మారిన ఎమ్మెల్యే... మండల అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం ఎమ్మెల్యే అనుమతి లేనిదే ఇవ్వడం లేదన్నారు. కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడన్నారు. జిల్లా పరిషత్‌లో కూడా ఎమ్మెల్యేలు లేఖలు ఉంటేనే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. అధికార టీడీపీ కన్నా గత కాంగ్రెస్ హయామే మేలని అన్నారు. చివరకు ఎంపీ నిమ్మలకిష్టప్ప తమను చేరదీయడాన్ని జీర్ణించుకోలేక మరింత వేధింపులకు గురి చేస్తూ వచ్చాడన్నారు. తమకు అనుకూలంగా వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు ఉండడంతో ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే కార్యకర్తలు, నాయకులను కలుపుకుని జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఇకపై పనిచేస్తామం టూ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణ తమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్థసారథి సన్నిహితుడు సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యేది, తనది ఒకే ఊ రని, అయినా ఆయన వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డామని, పార్థసారథి వెన్నంటే ఉంటూ వచ్చామని వివరించారు. త్వరలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామని ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, ఎంపీపీ భర్త అక్కులప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్థుడికి షాక్ రొద్దం: మండలంలో టీడీపీని బలోపే తం చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి విజయంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత, ఎంపీపీ పద్మావతి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సందర్భంగా ఆమె భర్త అక్కులప్పతో పాటు తాజా మాజీ సర్పంచ్ నాగరాజు, ఎం.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, మాజీ సర్పంచ్ సి.నారాయణరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు జెట్టి అంజినరెడ్డి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి కురుబ తిప్పన్న, పలువురు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ.. నమ్మిన వ్యక్తులను, పార్టీ అ భ్యున్నతికి కృషి చేసే వ్యక్తులను ఎమ్మెల్యే పార్థసారథి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అక్కులప్ప మాట్లాడుతూ పార్థసారథిని నమ్మి ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసినట్లు తెలిపారు. ఓ క్రమంలో పార్టీ కోసం జైలుకు సైతం వెళ్లినట్లు గుర్తు చేశారు. మండల అభివృద్ధిని అడ్డుకుంటు, ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కకుండా చేస్తున్న ఎమ్మెల్యే వైఖరితో విసుగు చెంది టీడీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితులై త్వరలో వైఎస్సార్ సీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. -
కృష్ణార్జున యుద్ధం!
పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నాలుగున్నరేళ్లుగా అవకాశం చిక్కిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా.. ప్రైవేట్ పనులైనా ఒకరు ముందు.. మరొకరు వెనుక హాజరవుతూ వచ్చారు. వేదికలపై కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటూ, మరొకరు లేచి వెళ్లిపోయే సంస్కృతిని అలవాటు చేసుకున్నారు. ఇటీవల ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఎంపీ కిష్టప్పను రాజకీయంగా పూర్తిగా అణచివేసేందుకు ఎమ్మెల్యే బీకే చేస్తున్న ప్రయత్నాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో పార్థుడి వ్యవహారంపై కిష్టప్ప గుర్రుగా ఉన్నారు. ఇటీవల సీఎం పర్యటనలో ఎమ్మెల్యేకు విరుద్ధంగా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతపురం,పెనుకొండ : ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకిష్టప్ప మధ్య వైరం తారస్థాయికి చేరుకుంది. ఇంతకాలం నిప్పూ, ఉప్పులా ఉండే ఈ ప్రజాప్రతినిధులు.. మళ్లీ విభేదాలతో వీధికెక్కారు. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వాపోయినట్లు సమాచారం. భగ్గుమన్న ఎంపీ వర్గీయులు ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను రెచ్చగొట్టేందుకే ఎమ్మెల్యే పార్థసారథి పోలవరం యాత్ర సాగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఎంపీ వర్గీయులను పూర్తిగా పక్కన బెట్టి కేవలం తన అనుచరులను మాత్రమే ఎమ్మెల్యే సానంపారు. దీనిపై ఎంపీ వర్గీయులు భగ్గుమన్నారు. ఎన్నికల్లో కేవలం ఆయన అనుచర వర్గం మాత్రమే ఓట్లు వేయించలేదని, సమష్టి కృషితోనే ఎమ్మెల్యేగా ఆయన గెలిచారంటూ వ్యాఖ్యానించారు. ఆరంభం నుంచి ఎమ్మెల్యే తమను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై ఎంపీ ఎదుట తమ అక్కసును వెళ్లగక్కారు. తమకు గుర్తింపు లేకుండా చేయడానికే ఎమ్మెల్యే ఇలా వ్యవహరించారంటూ పెద్ద దుమారమే లేపారు. రైతులను పిలుచుకెళ్లాల్సిన చోట పార్టీ కార్యకర్తలను ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. దీని వల్ల పార్టీ ప్రతిష్టను ఎమ్మెల్యే పార్థసారథి మంటగలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కలేదనే అక్కసు? నిమ్మల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ఎమ్మెల్యే బీకే.రగిలిపోతున్నట్లు సమాచారం. ఎంపీసిఫారసు చేయడం వల్లనే పల్లె రఘునాథరెడ్డికి గతంలో మంత్రి పదవి దక్కిందనే వాదనలూ ఉన్నాయి. అప్పటి నుంచి ఎంపీపై అసంతృప్తితో ఎమ్మెల్యే రగలిపోతూ వచ్చారు. ఇలాంటి తరుణంలోనే ఎంపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటూ వచ్చారు. గోరంట్ల మండలం కమ్మవారుపల్లికి రూ.90 లక్షలతో ఎంపీ కోటా, ఉపాధి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు తన వర్గీయుడైన సర్పంచ్ సుధాకరరెడ్డి ద్వారా ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. నీరు– చెట్టు పనుల కేటాయింపుల్లో ఎంపీ వర్గీయులు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీ ద్వారా తనకు అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యేతో జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ కుటుంబసభ్యులు వాపోవడంతో, ఏకంగా కమిటీల్లో ఉన్న ఎంపీ వర్గీయులను ఎమ్మెల్యే తొలగించడం వీరి మధ్య ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. ఇసుక మాఫియా విషయంలో ఘర్షణలు తలెత్తి ఎమ్మెల్యే అనుచరుడు నరేష్ హత్య కావడంతో ఆ సమయంలో ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గీయులు బహిరంగ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచనలమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేవారిపై చర్యలు తప్పవని, అవసరమైతే రాబోవు ఎన్నికల్లో వారికి టికెట్ కూడా ఇచ్చేది లేదంటూ మూడు రోజుల క్రితం అనంత వేదికగా సీఎం చేసిన ప్రకటన.. ఈ ఇద్దరి విషయంలో ఎంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఎదుటి వారి కళ్లకు గంతలు కట్టే ఈ నాయకుల వ్యవహారం ఎన్నికల నాటికి ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. -
పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతల జల్సాలు
సాక్షి, అనంతపురం: పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతలు చేసిన జల్సాలు వెలుగులోకి వచ్చాయి. రైతుల ముసుగులో పోలవరం యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతల మద్యం తాగి చిందేశారు. వివరాల్లోకి వెళితే.. రైతుల పేరుతో ఏర్పాటు చేసిన 25 ఆర్టీసీ బస్సుల్లో 1300 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలవరం యాత్రకు వెళ్లారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. అయితే.. బస్సులో మద్యం తాగిన నేతలు.. చిందేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో టీడీపీ నేతల బాగోతం బయటపడింది. పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతలు చేసిన నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. పోలవరం యాత్రకు రైతులను తీసుకెళ్తున్నామని పైకి చెబుతూ.. అధికార పార్టీ నేతలు సాగిస్తున్న జల్సాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.