నిబంధనలకు విరుద్ధ్దంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీకే పార్థసారథి
సాక్షి, పరిగి: అధికార బలంతో ఏదైనా చేయడానికి వెనకాడని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి తన దుర్బుద్దిని మరోసారి చాటారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిగి మండలంలోని కాలువపల్లి వద్ద ఉన్న నిషా డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమకు బుధవారం సాయంత్రం వచ్చి దాదాపు అరగంటకు పైగా గార్మెంట్‌లో పనిచేస్తున్న మహిళలను సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. లోపలికి వెళ్లిన ఆయన తన అనుచరులతో కలిసి కలియతిరిగారు. పరిశ్రమ యాజమాన్యంతో ఉన్న చొరవతోనే లోపలికి ప్రవేశించి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. ప్రతి ఒక్క మహిళతో తనకు గెలిపించాలని కోరినా అక్కడున్న మహిళలు పెద్దగా స్పందించకవడంతో అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడి చేరుకొని వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్‌ఐ గణపవరం శివ లోపలికి వెళ్లగా లోపలున్న పార్థసారధి అక్కడి నుంచి తన వాహనంలో ఉడాయించారు.
ఆయనకు సిగ్గు మానం లేదు:గోరంట్ల మాధవ్, వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి
పెనుకొండ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి తను సీనియర్ రాజకీయ నాయకుడన్న విషయమే మరిచిపోయాడని, సమయం దాటినా ప్రచారం నిర్వహించి మహిళలతో తరిమించుకున్నాడని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. పరిగి మండలం కాలువపల్లి గార్మెంట్ పరిశ్రమ వద్దకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించిన పార్థసారథి తీరును ఖండించారు. డబ్బులు ఎరచూపి, గందరగోళం సృష్టించి ఫ్యాక్టరీలోకి ప్రవేశించాడన్నారు. అక్కడున్న మహిళలు వెంటబడి తరిమితే సిగ్గులేకుండా పరిగెత్తిపోయాడన్నారు. అలాగే హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సంతలో పశువులను కొంటున్నట్లు విచ్చలవిడిగా డబ్బుపంచాడని ధ్వజమెత్తారు. వెంటనే వైఎస్సార్‌సీపీ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ముఖ్య ఎలక్షన్ ఏజెంట్ మాలగుండ్ల రవీంద్ర, పరిగి మండల కన్వీనర్ జయరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment