
మడకశిర: నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. టీడీపీలో దళితులకు గౌరవం లేదంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ ఇన్‌చార్జ్ ఈరన్న అలకబూనారు. ఈ క్రమంలో బుధవారం మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉండాలని ఈరన్న వర్గం మొత్తం నిర్ణయించుకుంది.
రంగంలో దిగిన బీకే, పరిటాల సునీత
అలకబూనిన ఈరన్నను బుజ్జగించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రంగంలో దిగారు. రొద్దం మండలంలోని తన స్వగ్రామం మరువపల్లికి ఈరన్నను పిలిపించుకుని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని కోరినట్లు తెలిసింది. టీడీపీలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదని ఈరన్న ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానికంగా ఉన్న తనకే ఆహ్వానం లేనప్పుడు తానెందుకు హాజరు కావాలని ప్రశ్నించడంతో బీకే స్వీయరక్షణలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత సైతం ఈరన్నకు ఫోన్ చేసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆమెతో తన మనసులోని మాటను ఆయన నిర్మోహమాటంగా చెప్పినట్లు సమాచారం.
బీకే తీరుపై ఈరన్న వర్గం గుర్రు
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారిథి వ్యవహరిస్తున్న తీరుపై ఈరన్న వర్గం గుర్రుగా ఉంది. ఆయన ఒంటెత్తు పోకడలతోనే మడకశిరలో టీడీపీకి ఈ గతి పట్టిందని బహిరంగంగానే ఈరన్న వర్గం మండి పడుతోంది. ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఈరన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినవారిని కాదని, వలస వచ్చిన నాయకుడికి అందలం ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రకులాలు, డబ్బున్న వారికే విలువ నిస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో బీకే వైఖరిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నాడని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అధిష్టానానికి నివేదికలు అందడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఈరన్నతో కలసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడంతో ఈరన్నను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం.