కార్యకర్తలకే మళ్లీ మళ్లీ కండువాలు
సొంత పార్టీ వాళ్లకే కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు
టీడీపీలో చేరినట్లు ప్రచారం
జిల్లా వ్యాప్తంగా టీడీపీలో చేరికలపై విమర్శలు
నాడు అధికారంలో బీసీలను అణగదొక్కిన వైనం
నేడు బీసీలందరూ తమ వాళ్లేనంటూ ప్రగల్బాలు
సాక్షి, పుట్టపర్తి: జనసేన – బీజేపీతో చంద్రబాబు చేతులు కలపడంతో తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కూటమిలో మెలగలేక.. నాయకుల మధ్య సఖ్యత లేక టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. దీంతో టీడీపీకి బాగా డ్యామేజ్ జరుగుతుండగా, ఆ పార్టీ నాయకులు కొత్త రకం ప్రచారానికి తెరలేపారు. పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న వారికే మళ్లీ కండువాలు వేస్తూ.. కొత్తగా చేరినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం మొదలుపెట్టారు.
ప్రచారంలో పది మంది కూడా లేక...
క్షేత్రస్థాయిలో టీడీపీ ఉనికి కోల్పోయింది. ఈనేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే.. పట్టుమని పది మంది కూడా రావడం లేదు. దీంతో టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి ఇతర ప్రాంతాల నుంచి జనాలను తరలించడంతో పాటు.. టీడీపీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి కొత్తగా టీడీపీలో చేరినట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. అయితే వాస్తవాలు వెలుగు చూస్తున్న కారణంగా పెద్దల నిర్ణయంపై తెలుగు ‘తమ్ముళ్లే’ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉనికి కోసం పాకులాట..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం పెత్తందార్లు మాత్రమే పాలించారు. మిగతా సామాజిక వర్గాల వారు కేవలం ఓట్లు వేసేందుకు.. నాయకుల వెంట తిరిగేందుకు పరిమితమయ్యారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక వర్గాల వారికి, ముఖ్యంగా బీసీలకు అధిక ప్రాధాన్యం లభించింది. నామినేటెడ్ పోస్టులూ భారీగా దక్కాయి. దీంతో ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఫలితంగా గ్రామస్థాయిలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతం టీడీపీ తరఫున ప్రచారం చేసే వారు కూడా కరువయ్యారు. ఈనేపథ్యంలో ‘చేరికల వెల్లువ’ శీర్షికన ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుండటం గమనార్హం.
రాప్తాడులోనే అధికంగా..
‘పరిటాల’ కుటుంబాన్ని ఓటమి భయం వెంటాడుతోంది. ధర్మవరంలో టికెట్ రాకపోవడంతో పరిటాల శ్రీరామ్ కూడా రాప్తాడులోనే ప్రచారం చేస్తున్నారు. ఆర్భాటంగా ప్రచారానికి వెళ్లినా.. జనాలు రాకపోవడంతో.. ఆలోచనలో పడ్డారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నవారికే మళ్లీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. పుట్టపర్తి, కదిరిలో కూడా ‘తమ్ముళ్లు’ ఇదే విధానం కొనసాగిస్తున్నారు.
ధర్మవరంలో దిక్కు లేని బీజేపీ..
కూటమిలో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో కూటమి తరఫున బరిలోకి దిగిన సత్యకుమార్ ఒంటరిగా మిగిలారు. అంతేకాకుండా టీడీపీ నుంచి రోజూ వైఎస్సార్‌సీపీలో చేరుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. వార్డుల వారీగా టీడీపీ ఖాళీ అవుతోంది. నిత్యం వందల కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరుతుండగా..సత్యకుమార్ పరిస్థితి ప్రశ్నార్థకమైంది.
అన్నిచోట్లా కుంపట్లే..
పెనుకొండలో సవిత, బీకే పార్థసారథి వర్గాల మధ్య వర్గ పోరుతో టీడీపీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బీకే వర్గీయులు సవిత తరఫున ప్రచారం చేయడం లేదు. మడకశిరలో సునీల్‌కుమార్, గుండుమల తిప్పేస్వామి మధ్య పోరు కొనసాగుతోంది. పుట్టపర్తిలో బీసీలందరూ టీడీపీ వెంట నడిచేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment