Sri Sathya Sai District Latest News
-
‘యంగ్ ఇండియా’ బేడీ ఇక లేరు
పెనుకొండ రూరల్: యంగ్ ఇండియా ప్రాజెక్టును స్థాపించి..ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ హక్కుల కోసం ఉద్యమించిన నరేంద్ర సింగ్ బేడీ(86) ఇకలేరు. వయో భారంతో సోమవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ఫారంలోని తన నివాసంలో కన్నుమూశారు. బేడీ 1939 సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. అమెరికాలో కెమికల్ ఇంజినీరింగ్ చదివి..కొంతకాలం అక్కడే ఉద్యోగం చేశారు. 1969లో స్వదేశానికి తిరిగొచ్చారు. 1975–76 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు వచ్చారు. పెనుకొండ మండలం గుట్టూరు వద్ద 44వ జాతీయ రహదారికి సమీపంలో యంగ్ ఇండియా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. తీవ్ర కరువు, పేదరికంతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న ఆ రోజుల్లో రైతులు, గ్రామీణ శ్రామికులు, పేదల హక్కుల కోసం ఉద్యమించారు. భూ పోరాటాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. యంగ్ ఇండియా ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు. రైతు సహకార, వ్యవసాయ కూలీల, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి..ఆయా వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చేలా చైతన్య పరిచారు. దివ్యాంగులకు చేయూతనిచ్చారు. చేతి వృత్తిదారులు, కళాకారులను ప్రోత్సహించారు. విద్య, వైద్య, కరువు నివారణ, సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఉపాధి హామీ కోసం ఉద్యమం.. పేదల అభివృద్ధికి ప్రభుత్వాల చేయూత కావాలనే సంకల్పంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నరేంద్ర సింగ్ బేడీ ఉద్యమించారు. గుట్టూరులోని యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రాంగణం నుంచి సంస్థ సభ్యులతో కలసి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. అలాగే లక్ష సంతకాలు సేకరించి.. సైకిల్ ర్యాలీగా వెళ్లి అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గుడిసెల రామస్వామికి వినతి పత్రం అందచేశారు. పేదరిక నిర్మూలనే కాకుండా, గ్రామాల అభివృద్ధికి సాధనంగా పనిచేసేలా గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టాలంటూ తన ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. అలాగే చుండూరులో దళితులపై దాడులు, మారణహోమాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులను చైతన్య పరిచారు. 1983లో భూ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలను రాజకీయంగా చైతన్య పరిచారు. ప్రశ్నించే హక్కును అలవాటు చేశారు. నరేంద్ర సింగ్ బేడీ.. మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖులకు సమకాలికులు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ..బేడీకి మూడేళ్ల జూనియర్. ఈయనకు భార్య సోనియాబేడీ, కుమారులు రాజీవ్, సంజయ్, కుమార్తె తారా ఉన్నారు. నేడు అంత్యక్రియలు.. నరేంద్ర సింగ్ బేడీ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వయోభారంతో కన్నుమూసిన సామాజిక ఉద్యమకారుడు -
సచివాలయ ఉద్యోగులకు చార్జ్‌మెమో
● 11 గంటలైనా తెరచుకోని తంబాపురం సచివాలయం ● ఫొటో తీసి వాట్సాప్ ద్వారా ఎంపీడీఓకు పంపిన గ్రామస్తుడు బత్తలపల్లి: సమయపాలన పాటించని తంబాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకే విధుల్లో ఉండాల్సిన వారు 11 గంటలైనా అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చర్యలు ఉపక్రమించారు. తలుపుకూడా తీయకపోవడంతో.. ఆధార్ అప్లోడ్ చేసుకునేందుకు పలువురు స్థానికులు సోమవారం ఉదయం 10 గంటలకే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే 9 గంటలకే కార్యాలయానికి హాజరుకావాల్సిన ఉద్యోగులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. 11 గంటలవుతున్నా సచివాలయం తలుపులు తెరిచేవారు కనిపించకపోవడంతో... గ్రామస్తులు ఫొటోలు తీసి ఎంపీడీఓ కార్యాలయానికి వాట్సాప్ ద్వారా పంపారు. స్పందించిన ఏఓ శ్రీనివాసులు విషయంపై ఆరా తీశారు. సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నా ఒక్కరూ విధులకు హాజరు కాలేదని తెలిసి అందరికీ చార్జ్ మోమో ఇచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఇచ్చే వివరణతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎస్సీ ఉపకులాల సమగ్ర వివరాలు సిద్ధం చేయండి
అనంతపురం అర్బన్/ఎడ్యుకేషన్: ఎస్సీ ఉపకులాల వారీగా సమగ్ర వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అనంతపురం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీల జనాభా తదితర వివరాలను కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ వినోద్‌కుమార్ వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 40.81 లక్షలు కాగా, ఇందులో ఎస్సీలో 48 ఉపకులాలకు సంబంధించి జనాభా 5.83 లక్షలు (14.29 శాతం) ఉందని పేర్కొన్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు 4,75,632 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన వారు 73,525 మంది, మిగిలిన ఉపకులాలకు చెందిన వారు 33,843 మంది ఉన్నారని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, 4, క్లాస్–4, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 48,080 మంది ఉన్నారన్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఉపకులాలకు చెందిన విద్యార్థులు 4,15,677 మంది ఉన్నట్లు వివరించారు. మునిసిపల్, హౌసింగ్, మెప్మా, డీఆర్డీఏ బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా లబ్ధిపొందిన ఎస్సీ, ఉపకులాల వారి వివరాలను తెలియజేశారు. కచ్చితమైన వివరాలు అందించాలి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ, ఉప కులాలకు సంబంధించి కచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు. వివరాల సేకరణలో తప్పిదాలు చోటు చేసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పనిచేయాలని చెప్పారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ సంఘాల నుంచి 237 వినతులు ఏకసభ్య కమిషన్ చైర్మన్‌కు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, మాల మహాసభ, ఎస్సీ కులాల జేఏసీ, జంగం హక్కుల పోరాట సమితి, ఇతర సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగుల నుంచి 237 వినతులు అందాయి. ● కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలు పెరిగి పోయాయని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీసెల్ నాయడులు వరికూటి కాటమయ్య ఏక సభ్య కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చైర్మన్ స్పందిస్తూ... ఈ నెల 31న నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. ● ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రాను పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, గృహ నిర్మాణాలు, భూమి కొనుగోలు పథకం, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నియామకాల్లోనూ కర్షకులు, కార్మికులకు ఎలాంటి లబ్ధి జరగలేదన్నారు. వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులకు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశం ఎస్సీ సంఘాల ప్రతినిధుల నుంచి 237 వినతులు -
30న జెడ్పీ సమావేశం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఆమోదం తెలిపారు. వాస్తవంగా ఫిబ్రవరి 7న సమావేశం నిర్వహించాలని జెడ్పీ అధికారులు భావించారు. అయితే అదే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో తమ నిర్ణయాన్ని జెడ్పీ అధికారులు మార్చుకుని,. కొత్తతేదీ ఫైల్‌ను చైర్‌పర్సన్‌కు పంపగా ఆమె ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో–ఆప్షన్, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులకు సమాచారం పంపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. శ్రీ సత్యసాయి కలెక్టర్ వస్తారా..? జెడ్పీ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ డుమ్మా కొడుతున్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా రావట్లేదు. ఈ అంశంపై సభ్యులు, ప్రజాప్రతినిధులు నిలదీస్తూ వస్తున్నారు. పునర్విభజన తరువాత తొలిసారి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బసంత్‌కుమార్ మాత్రమే క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరయ్యేవారు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ అంశంపై గత సమావేశంలో ప్రజాప్రతినిధులు, సభ్యులు గట్టిగా నిలదీశారు. కలెక్టరే లేకుంటే ఇక తామెందుకు రావాలని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాకపోతే వచ్చే సమావేశాన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ కలుగజేసుకొని వచ్చే సమావేశానికి కచ్చితంగా ఆయన వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే సమావేశానికై నా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వస్తారా లేదా చూడాలి. -
నేడు జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కదిరి అర్బన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతు హుస్సేన్ మంగళవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గాన జిల్లాకు చేరుకోనున్న ఆయన, తొలుత కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మండల పరిధిలోని బోడేనాయక్ తండా, రాందాస్‌నాయక్ తండాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తిగా రమణయ్య హిందూపురం అర్బన్: స్థానిక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఎస్. రమణయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన ప్రత్యేక న్యాయమూర్తి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను హైకోర్టు భర్తీ చేసింది. ఈ క్రమంలోనే విశ్రాంత జడ్జి రమణయ్యను హిందూపురం ప్రత్యేక న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజను మర్యాద పూర్వకంగా కలిశారు. అదే విధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యను కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఎస్.రమణయ్య గతంలో హిందూపురం మెజిస్ట్రేట్‌గా, ఇన్చార్జ్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. అలాగే అనంతపురంలోని కార్మిక న్యాయస్థానం జడ్జిగా పనిచేస్తూ జిల్లా జడ్జి స్థాయిలో పదవీ విరమణ పొందారు. కదిరి వాసికి అరుదైన గౌరవం కదిరి అర్బన్: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మధురై డైరెక్టర్‌గా ఉన్న కదిరి వాసి డాక్టర్ మంగు హనుమంతరావ్కు అరుదైన గౌరవం దక్కింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. వైద్యరంగంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్రముఖుల్లో ఈ ఏడాది 15 మందికి మాత్రమే ఆహ్వానాలు అందగా, హనుమంతరావ్ కూడా ఒకరు. తిరుపతి స్విమ్స్‌లో డైరెక్టర్‌గా 30 ఏళ్ల పాటు సేవలందించిన హనుమంతరావ్...అంతర్జాతీయ వైద్య విజ్ఞాన పత్రికల్లో 100కుపైగా ప్రచురణలు చేశారు. 8న నవోదయ ప్రవేశ పరీక్ష లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం (2025–26 విద్యా సంవత్సరం) దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,084 మంది విద్యార్థులు, 11వ తరగతిలో ప్రవేశానికి 1,228 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం లేపాక్షి నవోదయ విద్యాలయతో పాటు మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 11వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం హిందూపురంలోని నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. www. navodaya.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ‘పీఎం ఇంటర్నషిప్’ను సద్వినియోగం చేసుకోండి పుట్టపర్తి: నిరుద్యోగ యువత పీఎం ఇంటర్నషిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి సూచించారు. సోమవారం ఆయన కొత్తచెరువులోని విలేకరులతో మాట్లాడారు. ‘పీఎం ఇంటర్నషిప్’ పథకం అమలు కోసం ప్రభుత్వం 500 కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఇంటర్నషిప్‌కు ఎంపికై న వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. అలాగే వన్‌టైమ్ గ్రాంటు కింద రూ.6 వేలు, ప్రతి నెల రూ.5 వేల చొప్పున ఇస్తారన్నారు. -
పురంలో నకిలీ నోట్ల కలకలం
హిందూపురం అర్బన్: జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెలరోజుల క్రితం బత్తలపల్లిలో ఓ చిరువ్యాపారికి, ఇటీవలే కదిరిలో ఓ గొర్రెల వ్యాపారికి రూ.32 వేల విలువ జేసే రూ.500 నకిలీ నోట్లు అంటగట్టిన వైనం మరవకముందే తాజాగా సోమవారం హిందూపురంలోనూ నకిలీనోట్లు కలకలం సృష్టించాయి. ఓ చిల్లర దుకాణదారుని వద్ద నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన వ్యక్తి సోమవారం రూ.500 నోట్లు మూడు ఇచ్చాడు. అయితే వాటిని మరో వ్యక్తికి ఇచ్చే తరుణంలో అవి నకిలీవని గుర్తించిన వ్యాపారి వెంటనే వాటిని చించేశాడు. ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో పోలీసుల నుంచి ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే వ్యాపారి నకిలీ నోట్లను చించేసినట్లు తెలుస్తోంది. రోజుకోచోట నకిలీ నోట్లు చేతులు మారుతుండటంతో ఏది నకిలీ.. ఏది అసలో గుర్తించలేక జనం ఆందోళనకు చెందుతున్నారు. అసలు నోటును పోలిన నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి చేస్తుండటంతో ప్రతి నోటు చూసి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నకిలీ నోట్లను ఇలా గుర్తిస్తున్నారు ● నకిలీ నోట్లపై మధ్యన త్రెడ్ ఉన్నా... నోటు తిప్పినప్పుడు అది బ్లూ కలర్ రంగులోకి మారడం లేదు. ● నోటు చివర మీడ్లైన్స్ (నల్లగా ఉండే చారలు) ఉబెత్తుగా కాకుండా మామూలుగా ఉంటున్నాయి. ● నోటుకు ఎడమ చివర భాగంలో ఫ్లవర్‌పై 500 నంబర్ ఉండటం లేదు. ● నోటు ముందుభాగంలోని గాంధీ బొమ్మ సరిగ్గా కనిపించడం లేదు. వీటిని బట్టి వ్యాపారులు నకిలీ నోట్లను గుర్తించ గలుగుతున్నారు. అయితే సామాన్యులు నకిలీ నోట్లు గుర్తించక ఇబ్బందులు పడుతున్నారు. కోయంబత్తూరు, చెన్నెయ్ నుంచే సరఫరా..? నకిలీ కరెన్సీ నోట్లు కోయంబత్తూరు, చెన్నెయ్లలో ముద్రించి కర్ణాటక మీదుగా జిల్లాలోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా ఒక రూ.500 నోట్లే ఉంటున్నాయి. అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు ఇవ్వడం, కొందరి అమాయకుల వద్ద నేరుగా మార్చడం చేస్తున్నారు. ప్రధానంగా 9ఎఫ్బీ 248053, 2టీవీ 175028 సీరీస్ గల నకిలీ నోట్లు జిల్లాలో బయట పడ్డాయి. కదిరి, హిందూపురం, మడకశిర, ధర్మవరం ప్రాంతాల్లో నకిలీ నోట్ల మారకం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
హర్యానా మద్యం పట్టివేత
హిందూపురం అర్బన్: అక్రమంగా జిల్లాలోకి తరలిస్తున్న హర్యానా మద్యాన్ని ఎకై ్సజ్ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సోమవారం శిర– కొడికొండ జాతీయ రహదారిపై కొల్లకుంట క్రాస్ వద్ద ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మారుతీ సుజికి వ్యాగనర్ కారులో హర్యానా రాష్ట్రానికి చెందిన వివిధ బ్రాండ్ల మద్యం 90 బాటిళ్లు పట్టుబడింది. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో హిందూపురం మండలం సుబ్బిరెడ్డిపల్లికి చెందిన శ్రీనాథ్, ముద్దిరెడ్డిపల్లికి చెందిన గురిజాల బాలేంద్ర, దాసరి నవీన్ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ రామకృష్ణ తెలిపారు. -
చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్లు, పేపర్, హ్యాండ్ బ్యాగ్‌లు, పూల బుట్టలు, చీరలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట్రెండు కాదు... ఏకంగా 25 రకాల ఉత్పత్తులు అరటి నుంచి వచ్చినవే. మీరు చది
● అరటి నుండి అందమైన ఉత్పత్తులు ● హస్తకళలకు లేపాక్షి ఎంపోరియం బాసట అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లాలో అరటి సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఆ తరువాత అది వ్యర్థంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యగానే ఉంటోంది. రైతులు వృథాగా పడేసే అరటి బోదెలతో పలు రకాల ఉపఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించడమే కాకుండా వాటి తయారీలో పలువురికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక జిల్లా – ఒక క్రాఫ్టు’తో వెలుగులోకి జిల్లా విభజన అనంతరం ‘అనంత’కు మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. జిల్లాలో 10 వేల హెక్టార్లలో అరటి సాగులో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వన్ డిస్ట్రిక్– వన్ క్రాఫ్ట్ కింద ‘బనానా ఫైబర్’ (అరటి నార)తో అందమైన గృహోపకరణాల తయారీని అనంతపురం జిల్లాకు కేటాయించింది. ఈ ఉత్పత్తులకు లేపాక్షి హస్తకళల సంస్థ అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించడమే కాక అదే స్థాయిలో విక్రయాలను ప్రోత్సహిస్తోంది. అరటి బెరడు నార తీసి దానితో ఎన్నో వస్తువులను తయారు చేయగల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడేరు, అనంత నగర శివారులో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. అరటి వ్యర్థాల నుంచి కళాత్మక వస్తువుల తయారీపై వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ‘మూసా ఫైబ్రల్’ సహకారంతో శిక్షణ అందజేస్తున్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 251 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వరకూ వచ్చి అర్జీలిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలన్నారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడితే సమస్య క్షుణ్ణంగా తెలుస్తుందని, అప్పుడు పరిష్కారం సులువు అవుతుందన్నారు. పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించినట్లు చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌస్ హోల్డ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్టు కేసులు, వివిధ కేసుల్లో కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా చదివి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అధికారులకు జేసీ అభిషేక్‌కుమార్ ఆదేశం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే...
హిందూపురం అర్బన్: వ్యక్తి హత్యకేసులో మిస్టరీని హిందూపురం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను హతమార్చిన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను సోమవారం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ అబ్దుల్ కరీం వెల్లడించారు. స్థానిక రహమత్‌పుర ప్రాంతానికి చెందిన అల్లాబకాష్ (33)కు తొమ్మిదేళ్ల క్రితం కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర పట్టణానికి చెందిన తబ్సుంతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో నగర్‌లోని బీరువాల తయారీ కర్మాగారంలో అల్లాబకాష్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తబ్సుం... తమ ప్రాంతంలోనే ఇంటి వద్ద కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న నదీముల్లా పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అల్లాబకాష్ పనికి వెళ్లినప్పుడు ఇద్దరూ శారీరకంగా కలుసుకునేవారు. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు చెబుతున్నాడని కక్ష పెంచుకున్న ఇద్దరూ పథకం వేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో అల్లాబకాష్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రియుడిని తన ఇంటికి తబ్సుం పిలిపించుకుంది. అల్లాబకాష్‌ను నదీముల్లా గట్టిగా పట్టుకోగా తబ్సుం చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం నదీముల్లా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత భర్త మృతదేహంపై బెడ్‌షీట్ కప్పి తన ఆడపడచు సుమియాకు ఫోన్ చేసి ‘మీ తమ్ముడు ఆరోగ్యం సరిగా లేక నిద్రించాడని, ఎంత లేపినా మేల్కొనడం లేదని’ తెలిపింది. దీంతో స్థానికంగా ఉన్న అల్లాబకాష్ కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. తబ్సుం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో గద్దించారు. దీంతో చేసిన నేరాన్ని ఆమె అంగీకరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో తబ్సుంను, ఆటోనగర్ క్రాస్ వద్ద నదీముల్లాను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
గంజాయి ముఠా అరెస్టు
కదిరి టౌన్: గంజాయి రవాణా చేసి 9 మంది సభ్యులుగల ముఠాను ఎన్పీకుంట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శివనారాయణ స్వామి కదిరి రూరల్ పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ అల్లురి సీతారామరాజు జిల్లాకు చెందిన అర్జున్ నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తుంటారు. ఇందుకోసం 8 మందితో ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా సోమవారం గంజాయి ముఠా సభ్యులు ఎన్పీకుంట మండలానికి గంజాయి రవాణా చేస్తుండగా... ఎన్పీకుంట ఎస్ఐ వలీబాషా తన సిబ్బందితో కలిసి వలపన్ని బాలాజీతో పాటూ మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షలు విలువ చేసే 5 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. రూ.1.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం -
అదనపు కట్నం వేధింపులు తాళలేకపోతున్నా...
పుట్టపర్తి టౌన్: తారాస్థాయికి చేరుకున్న అదనపు కట్నం వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఎస్పీ రత్న ఎదుట బాధితురాలు బోరుమంది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి వినతి పత్రం అందజేసి, మాట్లాడింది. వివరాలు... చిలమత్తూరు మండలం సొమగట్ట గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం కదిరి పట్టణానికి చెందిన అపరంజినితో వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఊహించని పరిణామాలతో అబార్షన్ జరిగి ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అప్పటి నుంచి భర్త, అత్త, మామ అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ సారి బాధితురాలి తల్లి రూ.2 లక్షలు అందజేసింది. అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదు. అదనపు కట్నం కోసం చిత్రహింసలు చేయసాగారు. తాము కోరుకున్న మొత్తం తీసుకురాకపోతే హతమార్చి మరో పెళ్లి చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ రత్నను బాధితురాలు వేడుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే కదిరి పీఎస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేవించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీకి ఫిర్యాదు న్యాయం చేయండి సార్ బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రౌడీ షీటర్ నాగిరెడ్డి తనను చీటింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఎదుట రాశింపల్లికి చెందిన బయపరెడ్డి వాపోయాడు. ఈ మేరకు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. నాగిరెడ్డితో రూ.6 లక్షల అప్పు తీసుకుని రూ.లక్షకు ఒకటి చొప్పున ఆరు ప్రాంసరీ నోట్లను రాసి ఇచ్చినట్లు వివరించారు. ఏడాది తర్వాత రూ.6 లక్షలకు అసలు, వడ్డీ కలిపి చెల్లించానన్నారు. ఆ సమయంలో ఐదు ప్రాంసరీ నోట్లు తిరిగి ఇచ్చి ఒకటి కనిపించడం లేదంటూ తెల్ల కాగితంపై డబ్బు అంతా ముట్టినట్లు రాసిచ్చాడన్నారు. ఇటీవల తనకు డబ్బు చెల్లించాలంటూ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను దుర్బాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంటనే బుక్కపట్నం పీఎస్ ఎస్ఐ కృష్ణమూర్తితో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. -
డీపీఓ సమీపంలో ఎగిసి పడిన మంటలు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ) సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కార్యాలయం ఆవరణలోని ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజా సమప్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసులు సమాచారం ఇవ్వడంతో అగ్రిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఘటనను ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణిస్తూ సెంట్రీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పు రాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ ఏర్పాటు హిందూపురం టౌన్: పట్టణంలోని ముస్లిం నగారా కార్యాలయంలో గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఖాజీ అన్సార్ పాల్గొన్నారు. కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మౌలానా వసీవుల్లా, హిందూపురం పట్టణ అధ్యక్షుడిగా మౌలానా తన్వీర్ అహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇమామ్ మౌజన్ల హక్కుల కోసం కౌన్సిల్ చట్ట బద్దంగా పోరాడుతోందన్నారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ క్యాలండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉబెదుల్లా హుస్సేన్, మౌలానా రిజా–ఉర్–రహమాన్, మౌలానా ఉస్మాన్ ఘనీ, మౌలానా సాజిద్, మౌలానా షాబుద్దీన్, మౌలానా అన్సారీ, హాజీ నాసీర్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య మడకశిర రూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన రామాంజప్ప (50) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన జులాయిగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుకు డబ్బు కావాలంటూ తరచూ కుటుంబసభ్యులను వేధించేవాడు. సోమవారం మద్యం కొనుగోలుకు తనకు డబ్బులివ్వాలంటూ భార్య సంజమ్మ, కుమారుడు, కుమార్తెను వేధించాడు. తమ వద్ద డబ్బు లేదని తెలపడంతో గ్రామంలోని పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో నకిలీ బంగారం ముఠా సభ్యులు?
సోమందేపల్లి: నకిలీ బంగారం అమ్మేందుకు ప్రయ త్నిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో ఎనిమిది మంది బంగారం అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిని పెనుకొండ పీఎస్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కిడ్నాప్ కలకలం సోమందేపల్లి: మండల కేంద్రం సమీపంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఓ హోటల్ కార్మికుడిని హిందూపురానికి చెందిన వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. హిందూపురానికి చెందిన అశోక్ రూ.40వేలు అప్పుగా తీసుకుని చెల్లించకుండా ముఖం చాటేసి సోమందేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న వడ్డీ వ్యాపారులు అందరూ చూస్తుండగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. పెనుకొండ వరకూ వెళ్లిన తర్వాత తిరిగి స్థానిక పీఎస్‌కు చేరుకుని అశోక్‌ను అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
సత్ప్రవర్తన అలవర్చుకోండి
ధర్మవరం అర్బన్: సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సబ్ జైలులోని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్‌యాదవ్ సూచించారు. సోమవారం ధర్మవరంలోని సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లు, రికార్డులు పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కోర్టు కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది లేని వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ బ్రహ్మేంద్రరెడ్డి, న్యాయవాదులు కృష్ణమూర్తి, బాలసుందరి, పారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా పాల్గొన్నారు. ● పెనుకొండ: స్థానిక సబ్‌జైల్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌యాదవ్ సోమవారం తనిఖీ చేసారు. బ్యారెక్‌లు, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌రూం, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి భార్యాపిల్లలతో సంతోషంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైల్ సూపరింటెండెంట్ అజగర్ హుస్సేన్, ప్యారా లీగల్ వలంటీర్ నరసప్ప, పెనుకొండ, అనంతపురం కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. ● హిందూపురం అర్బన్: క్షణికావేశంలో తప్పులు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరూ అధికారుల దృష్టిలో ఒక్కటేనని జిల్లా సివిల్ జడ్జి శివప్రసాద్ యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక ఉప కారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాది సంతోషికుమారి, ఉపకారాగార అధికారి హనుమన్న, లోక్ అధాలత్ సిబ్బంది హేమావతి, పారా లీగల్ వలెంటీర్ సురేష్ పాల్గొన్నారు. -
చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్లు, పేపర్, హ్యాండ్ బ్యాగ్‌లు, పూల బుట్టలు, చీరలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట్రెండు కాదు... ఏకంగా 25 రకాల ఉత్పత్తులు అరటి నుంచి వచ్చినవే. మీరు చది
● అరటి నుండి అందమైన ఉత్పత్తులు ● హస్తకళలకు లేపాక్షి ఎంపోరియం బాసట అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లాలో అరటి సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఆ తరువాత అది వ్యర్థంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యగానే ఉంటోంది. రైతులు వృథాగా పడేసే అరటి బోదెలతో పలు రకాల ఉపఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించడమే కాకుండా వాటి తయారీలో పలువురికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక జిల్లా – ఒక క్రాఫ్టు’తో వెలుగులోకి జిల్లా విభజన అనంతరం ‘అనంత’కు మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. జిల్లాలో 10 వేల హెక్టార్లలో అరటి సాగులో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వన్ డిస్ట్రిక్– వన్ క్రాఫ్ట్ కింద ‘బనానా ఫైబర్’ (అరటి నార)తో అందమైన గృహోపకరణాల తయారీని అనంతపురం జిల్లాకు కేటాయించింది. ఈ ఉత్పత్తులకు లేపాక్షి హస్తకళల సంస్థ అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించడమే కాక అదే స్థాయిలో విక్రయాలను ప్రోత్సహిస్తోంది. అరటి బెరడు నార తీసి దానితో ఎన్నో వస్తువులను తయారు చేయగల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడేరు, అనంత నగర శివారులో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. అరటి వ్యర్థాల నుంచి కళాత్మక వస్తువుల తయారీపై వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ‘మూసా ఫైబ్రల్’ సహకారంతో శిక్షణ అందజేస్తున్నారు. -
గత ఏడాది జిల్లాలో ఇలా..
సాక్షి, పుట్టపర్తి: ప్రేమలో పడితే లోకాన్ని మరిచిపోతున్నారు. కన్న తల్లిదండ్రులను దూరం చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. పాతికేళ్లు పోషించిన వారిని వదిలి అప్పుడప్పుడే మదిలోకొచ్చిన మనిషిపై మోజు పడుతున్నారు. సినిమాల ప్రభావంతో చాలా మంది యువత ప్రేమ బాట పట్టారు. రాత్రింబవళ్లూ స్మార్ట్ ఫోన్లలో ముచ్చటిస్తూ పంచాయితీని తల్లిదండ్రుల ముందు ఉంచుతున్నారు. అంగీకరిస్తే పెళ్లి.. లేదంటే ప్రేమ పెళ్లి. అనంతరం రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించడం.. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రతి వారం ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి పంచాయితీలు వెలుగు చూస్తున్నాయి. 2024 ఏడాది ఆరంభం నుంచి డిసెంబరు 31 వరకూ జిల్లా పోలీసు కార్యాలయానికి రక్షణ కోరుతూ 27 విన తులు వచ్చాయి. బంధువుల నుంచి రక్షణ కల్పించాలని .. తమ బతుకు తమను బతుక్కోనివ్వండి అంటూ ఘాటుగా మాట్లాడుతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. అంతా బిల్డప్.. తర్వాత కటీఫ్ అవతలి వ్యక్తి మనసు దోచుకోవాలనే ఉద్దేశంతో కొందరు లేనిపోని బిల్డప్ మాటలు చెబుతారు. హైఫై లైఫ్ గురించి సంభాషణ మొదలుపెడతారు. రంగు రంగుల దుస్తులతో అలరిస్తారు. అయితే పెళ్లయిన తర్వాత అలాంటివేవీ వారికి కనిపించవు. ఫలితంగా అంతా బిల్డప్ అని తెలుసుకుని తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడలేక తిరిగి బంధువుల చెంతకు చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రేమ పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై పంచాయితీలు జరిగి.. స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. సక్సెస్ రేట్ అంతంతే.. చాలా మంది యువతీ యువకులు సినిమాల ప్రభావంతోనే ప్రేమలో పడుతున్నారు. సినిమాల్లో కథానాయక, నాయికల స్థానాల్లో తామే ఉన్నామనే భావనలోకి వెళ్లి.. ఊహల్లో తేలియాడుతున్నారు. ప్రేమపెళ్లిని పెద్దలు అంగీకరిస్తే ఆనందంగా గడిపేస్తున్నారు. అంగీకారం లేకున్నా.. రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిలో చాలా మంది విడిపోతున్నారు. ఆరు నెలలు తిరగకుండానే.. కలిసి ఉండలేమంటూ మళ్లీ పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. విడాకుల కోసం పిటిషన్ వేస్తున్న వారిలో సగం మందిపైగా ప్రేమ పెళ్లి చేసుకున్న వారే ఉండటం గమనార్హం. రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు విడాకుల కోసం కోర్టుకెక్కిన దంపతుల సంఖ్యవిడాకుల పిటిషన్లలో ప్రేమ వివాహాలు శాతం తల్లిదండ్రుల బాటలో నడవండి పిల్లలపై తల్లిదండ్రుల నిఘా అవసరం. మొబైల్ ద్వారా ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టాలి. ప్రేమలో పడిన తర్వాత బయటికి లాగడం చాలా కష్టం. వయసుకు వచ్చాక పెళ్లి చేసుకుంటారు. మేజర్లు కావడంతో చట్టం కూడా అంగీకరిస్తుంది. అయితే ప్రేమ వివాహాల కారణంగా గొడవలు చేసుకోకూడదు. పరువు కోసం ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ప్రేమ వివాహాలు ఎక్కువ జరిగేందుకు సినిమాల ప్రభావమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. – వి.రత్న , ఎస్పీ తలుపులలో నివాసం ఉంటున్న బీసీ కులానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలో అగ్రవర్ణంలోని అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇద్దరి బంధువులను పిలిపించి సర్దిజెప్పి పంపించారు. ఎవరూ గొడవలకు దిగరాదని, మేజర్లు కావడంతో చట్టపరంగా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉందన్నారు. కదిరికి చెందిన ఓ యువకుడు పులివెందులలోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. అయితే కదిరిలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కుల, మతాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వాళ్లు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఇంతలోనే ఓ యువకుడితో ఆ అమ్మాయికి పెళ్లిని ఖాయం చేశారు. అయితే ప్రేమించిన యువకుడితో ఆమె వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆ జంట పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కోరింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించారు. 27 6381 ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, ఫలితంగా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఎక్కువ మంది చెబుతున్నారు. అయితే తమ బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను రక్షణ కోరుతున్నారు. జిల్లాలో గత ఏడాదిలో మొత్తం 27 జంటలు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కోరడం గమనార్హం. -
వైభవంగా పెద్దమ్మ ‘దేవర’
పుట్లూరు: మండలంలోని కడవకల్లు గ్రామంలో పెద్దమ్మ దేవర ఆదివారం వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. గ్రామంలో 13 ఏళ్ల తర్వాత నిర్వహించిన దేవర కావడంతో ప్రతి ఇంటా రెండు నుంచి 10 పొట్టేళ్ల వరకు అమ్మవారికి మొక్కుబడి కింద బలి ఇచ్చారు. బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం కడవకల్లు గ్రామం జనసంద్రమైంది. పలు రాజకీయ పార్టీల నాయకులు దేవర మహోత్సవానికి హాజరైయ్యారు. నేడు చౌడేశ్వరీ జ్యోతుల మహోత్సవం.. పెద్దమ్మ దేవర మహోత్సవంలో భాగంగా సోమవారం చౌడేశ్వరీ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ పెద్దలు ఆదివారం వెల్లడించారు. గ్రామంలోని చౌడేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతుల ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
పాడి ఆవును బలిగొన్న ప్లాస్టిక్ వ్యర్థాలు
పుట్టపర్తి అర్బన్: ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న ఓ పాడి ఆవు మృతి చెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లికి చెందిన గోపాలరెడ్డి ప్రభావతి దంపతులు పాడి పోషణతో జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది రూ.80 వేలు వెచ్చించి ఓ ఆవును కొనుగోలు చేశారు. రోజూ పది లీటర్ల మేర పాలు ఇస్తున్న ఈ ఆవు వారం రోజులుగా మేత మేయక తీవ్ర అనారోగ్యం బారిన పడింది. గోరంట్లకు చెందిన పశు వైద్యుడు శివారెడ్డితో చికిత్స చేయించారు. అయినా ఫలితం దక్కక ఆదివారం మృత్యువాతపడింది. ఈ క్రమంలో ఆవు మృతికి కారణాలు అన్వేషిస్తూ పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఆవు పొట్ట నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు, చీరలతో పేనిన తాడు వ్యర్థాలు బయటపడ్డాయి. గమనించిన రైతు దంపతుల బోరున విలపించారు. మండ్లిపల్లిలో భారీ చోరీ తనకల్లు: మండలంలోని మండ్లిపల్లిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు, అదే స్థాయిలో బంగారం, వెండి వస్తువులను అపహరించారు. మండ్లిపల్లికి చెందిన మల్లికార్జునరెడ్డి, పద్మావతి దంపతులు తమ కుమారుడు మహేష్‌రెడ్డి, కోడలు రోషిణి, మనుమరాలితో కలసి ఈ నెల 16న ఇంటికి తాళం వేసి శ్రీశైలం వెళ్లారు. దైవ దర్శనం అనంతరం 18వ తేదీ రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తలుపులు బద్ధలుగొట్టి ఉండడం గమనించి లోపలకు వెల్లి పరిశీలించారు. గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి రూ. 3 లక్షల నగదు, 24.5 తులాల బంగారు నగలు, 260 గ్రాముల వెండి సామగ్రిని అపహరించినట్లు నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఉదయం కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ గోపి పరిశీలించారు. స్నిప్పర్ డాగ్‌ను రంగంలో దించారు. క్లూస్‌టీం సాయంతో నిందితుల వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రాయదుర్గం టౌన్: స్థానిక నేతాజీ రోడ్డులోని తాజ్జిన్నా ప్రాంతానికి చెందిన అబ్దుల్లా (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య ముంతాజ్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో జీన్స్ కటింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు లోనయ్యాడు. పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను పిలుచుకుని ముంతాజ్ గుండ్లపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న అబ్దుల్లా ఉరి వేసుకున్నాడు. గమనించి చుట్టుపక్కల వారు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అబ్దుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సందడిగా 10కే రన్.. 5కే వాక్
అనంతపురం: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆదివారం 10కే రన్, 5కే వాక్ మూడో ఎడిషన్‌ను కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. కార్యక్రమాలను కలెక్టర్ వినోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. స్పెయిన్ నుంచి వచ్చిన వారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ శిక్షణ సమయంలో ముస్సోరిలో నిర్వహించిన ఇలాంటి కార్యక్రమంలో 11వ స్థానంలో నిలిచినట్లు గుర్తు చేసుకున్నారు. కాలికి చిన్న గాయమైన కారణంగా పోటీల్లో పాల్గొనలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ మాట్లాడుతూ అల్ట్రా ఫెర్రర్ రన్నింగ్ పది సంవత్సరాల క్రితం ప్రారంభమైందన్నారు. పెద్ద ఎత్తున రన్నర్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో స్పెయిన్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు జిల్లా నుంచే చాలా మంది రన్నర్స్ పాల్గొనడం శుభపరిణామన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా అటవీ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, అల్ట్రా రన్నర్ జువాన్ మాన్యుయల్ వియోరా తదితరులు పాల్గొన్నారు. -
● ఇస్తెమా ప్రారంభం
తాడిమర్రి: మండల కేంద్రమైన తాడిమర్రిలో ఇస్తెమా కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి తొలిరోజు వేలాదిగా ముస్లింలు తరలివచ్చారు. దీంతో తాడిమర్రి పరిసరాలు కిటకిటలాడాయి. వచ్చిన వారందరికీ నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. అనంతరం ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక బోధనలు చేశారు. రెండోరోజైన సోమవారం సుమారు లక్ష మంది కార్యక్రమానికి హాజరుకానున్నట్లు మత పెద్దలు తెలిపారు. -
హంద్రీ–నీవా లక్ష్యాలు దెబ్బతీస్తే సహించం
గుంతకల్లు టౌన్: హంద్రీ–నీవా ప్రాజెక్టు లక్ష్యాలు దెబ్బతీస్తే సహించబోమని కూటమి సర్కార్‌ను ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్దేశిత లక్ష్యాలకు సమాధి కట్టేలా సీఎం చంద్రబాబు జారీ చేసిన జీఓ 404, 405ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గుంతకల్లప్ప స్వామి కల్యాణమంటపంలో జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి బి.సురేష్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు విశిష్ట అతిథులుగా పౌర ప్రగతిశీల వేదిక కార్యదర్శి ధాయిపూలే తారకేష్ రావు, ప్రముఖ న్యాయవాది ఓపీడీఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ రూ.6,182 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ పనులు ముందుకు సాగలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన కూటమి ప్రభుత్వం... గత ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన అనుమతులను రద్దు చేస్తూ ప్రాజెక్టు ప్రయోజనాలకు సమాధి కట్టేలా జీఓ 404, 405ను విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. ఈ జీఓల ప్రకారం పనులు చేపడితే కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 3,850 క్యూసెక్కులకే పరిమితమవుతుందన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ప్రతిసారీ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు తీరని మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. సీమ అభివృద్ధికి గండి పడుతున్నా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కుల పెంచడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పిల్ల కాలువల ఏర్పాటు చేసి 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జీఓ.404,405ను రద్దు చేసే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. సదస్సులో న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు ఎర్రిస్వామి, దావిద్, ఆశాబీ, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు -
‘విశ్వ’తేజం.. తగ్గుతున్న వైభవం
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 90 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ఇప్పటికే 40 కళాశాలలకు అటానమస్ హోదా దక్కింది. తక్కిన 50 కళాశాలల్లో సింహభాగం వచ్చే ఏడాది అటానమస్ హోదా పొంద నున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారాలు కనుమరుగవుతాయి. జిల్లాలో రెండింటికి మినహా అన్ని కళాశాలలకూ అటానమస్ హోదా దక్కింది. ఆ రెండు కూడా ‘అటానమస్’కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. నూతన విద్యా విధానంతో బాటలు.. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలకు అటానమస్ హోదా ఉండాలి. గతంలో ఆ హోదా దక్కాలంటే శాశ్వత అనుబంధ హోదాతో పాటు న్యాక్‌లో మెరుగైన గ్రేడింగ్ దక్కించుకోవాల్సి ఉండేది. అయితే, నూతన విద్యా విధానంలో భాగంగా నిబంధనలు సరళీకరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి కళాశాలకూ అటానమస్ హోదాను కట్టబెడుతున్నారు. అటానమస్ అయితే విద్యా ప్రణాళిక, సిలబస్ రూపకల్పన, ప్రోగ్రాం అమలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పరీక్ష ఫలితాల విడుదల వరకు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. మార్కు లను వర్సిటీకి పంపితే.. స్నాతకోత్సవ డిగ్రీని వర్సిటీ తన పేరున ప్రదానం చేస్తుంది. ప్రైవేట్ వర్సిటీల బాటలో.. పలు ఇంజినీరింగ్ కళాశాలలు ప్రైవేట్ వర్సిటీలుగా మారేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. కోర్సుల ఫీజులను కూటమి ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో చాలా కళాశాలలు ఆ బాట పట్టినట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునే అవకాశం లభిస్తుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుంది. ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ, మార్క్స్‌కార్డుల జారీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేసుకునే అధికారం ప్రైవేట్ వర్సిటీకి ఉంటుంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు ‘యూజీసీ’ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) సైతం సుముఖంగా ఉంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో ఇప్పటికే మోహన్‌బాబు, అన్నమాచార్య ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. మిట్స్ (మదనపల్లి), ఆర్జీఎం (నంద్యాల), పుల్లారెడ్డి (కర్నూలు), ఆదిశంకరాచార్య, ఎస్వీ సెట్ (చిత్తూరు), కేఎస్ఆర్ఎం (కడప), ఎస్వీ ఐటీ (తిరుపతి) కళాశాలలు ప్రైవేట్ వర్సిటీలుగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. సొంతంగా ఫీజుల నిర్ణయం.. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేస్తుంది. కానీ, ప్రైవేట్ వర్సిటీలు స్వతహాగా ఫీజులను నిర్ణయించుకోవచ్చు. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు. కేవలం 30 శాతం విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తుంది. ప్రైవేటు వర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ కూడా ఎక్కువగా ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు ఫీజు రీయింబర్స్మెంట్ అందేది. కూటమి ప్రభుత్వంలో సకాలంలో ఫీజులు అందడం ప్రశ్నార్థకంగా మారడంతో ప్రైవేటు వర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ పరిధిలో అనుబంధ కళాశాలలకు అటానమస్ ఇప్పటికే 40 కాలేజీలకు మంజూరు.. వచ్చే ఏడాది మరిన్నింటికి హోదా నూతన జాతీయ విద్యా విధానంలో వెసులుబాటే కారణం త్వరలో పర్యవేక్షణ వరకే పరిమితం కానున్న వర్సిటీ రాయలసీమకే తలమానికంగా నిలిచి.. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జేఎన్టీయూ (ఏ) వైభవం క్రమంగా తగ్గుతోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇంజినీరింగ్ కళాశాలలు అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండటంతో వర్సిటీ పరిధి కుంచించుకుపోతోంది. త్వరలో కేవలం కాగితాలకే కార్యకలాపాలు పరిమితం కానున్నాయి. -
సీసీ రోడ్డుపై వాటర్ ప్లాంట్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చు మీరాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములు, స్థలాలు, చివరకు ప్రైవేటు ఆస్తులతో పాటు శ్మశాన స్థలాలను సైతం వదలకుండా ‘పచ్చ’ నేతలు కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేత కుమ్మర నాగేంద్ర మరింతగా బరితెగించాడు. ఏకంగా సీసీ రోడ్డును కబ్జా చేసి వాటర్ ప్లాంట్ నిర్మించాడు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ అని పేరు కూడా పెట్టాడు. భవనంపై ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, పరిటాల రవి, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్ధ, ఎమ్మెల్యే సోదరుడు ధర్మవరపు మురళీ ఫొటోలు వేయించాడు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, పొందలేదు. రోడ్డుపై ప్లాంట్ నిర్మించకూడదంటూ గ్రామ ప్రజలు అడ్డు పడితే తీవ్రంగా బెదిరించాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాంటు ఏర్పాటు చేయడంతో సర్పంచు మిడతల శీనయ్య అనుమతి ఇవ్వలేదు. శీనయ్య టీడీపీ సానుభూతి పరుడే కావడం గమనార్హం. దీన్ని బట్టి నాగేంద్ర ఎంతలా బరితెగించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సీసీ రోడ్డుపై నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ‘పచ్చ’ నేత బరితెగింపు -
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
పుట్టపర్తి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు వరుసగా 10 రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. పరీక్షలకు తప్పక హాజరు కావాలి పుట్టపర్తి: ఇంటర్మీడియట్ ప్రీఫైనల్ పరీక్షలు ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు డీవైఈఓ రఘనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. అలాగే ఫిబ్రవరి 1న జరిగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష , 3న జరిగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని పేర్కొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వి.రత్న ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని సూచించారు. వలస బాటలో మృత్యువాతరాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృత్యువాత పడ్డాడు. అయిన వారికి తీరని శోకం మిగిల్చాడు. వివరాలు.. మండలంలోని రాయంపల్లికి చెందిన విశ్వనాథ్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఎక్కడా ఉపాధి దొరక్కపోవడంతో కుటుంబ పోషణ కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు 15 రోజుల క్రితం విశ్వనాథ్ వలస వెళ్లాడు. అక్కడ కూలీ పనులకు వెళ్తూ వారానికోసారి భార్యకు నగదు పంపుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం పని ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స కోసం స్థానికులు అక్కడి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన విశ్వనాథ్.. ఆదివారం ప్రాణాలు వదిలాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. రిమాండ్‌కు 11 మంది పెనుకొండ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వివాహితపై దాడి కేసులో 20 మందిపై కేసు నమోదు కాగా, 11 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు కియా పీఎస్ ఎస్ఐ రాజేష్ తెలిపారు. వివరాలు... పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన ఓ వివాహితపై గత బుధవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందనే అపోహతో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేసి జుత్తు కత్తిరించి అవమానించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు డి.శంకర, లక్ష్మీదేవి, రామస్వామితో పాటు సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ, రమేష్, శాంతి, ధనలక్ష్మి, రమణ, సుందరమ్మ, అనితను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.