డబ్బు సంచులతో వస్తేనే టికెట్
బడాబాబులకు రెడ్ కార్పెట్ పరిచిన చంద్రబాబు
అధినేత వైఖరిపై మండిపడుతోన్న తెలుగు తమ్ముళ్లు
సీటు ఇచ్చేందుకు ఓ మాజీ ప్రజాప్రతినిధితో బాబు మంతనాలు
కదిరి, పెనుకొండ నియోజకవర్గాలకూ సర్దుబాటు చేయాలని ఆదేశం
అలా అయితే తమకు టికెట్ వద్దంటోన్న సీనియర్ నేత
చంద్రబాబు, లోకేశ్ తీరుపై పచ్చ నేతల మండిపాటు
సాక్షి, పుట్టపర్తి: సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ‘క్యాష్’ పాలిటిక్స్‌కు తెరలేపారు. ఎంతమంది వ్యతిరేకించినా.. ఎన్ని ఫిర్యాదులు అందినా.. డబ్బు సంచులతో వచ్చిన వారందరికీ ఈసారి అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు. డబ్బులివ్వలేము బాబూ అన్న వారందరికీ ఐవీఆర్‌ఎస్ సర్వేను సాకుగా చూపి నేనూ టికెట్లు ఇవ్వలేనని తేల్చి చెప్పారు. టీడీపీలో జరుగుతున్న టికెట్ల అమ్మకాల వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ‘ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు. టికెట్ల ద్వారా వచ్చినకాడికి దండుకుందాం’ అని చంద్రబాబు అనుకుంటున్నారని కొందరు టీడీపీ నేతలే బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
సీనియర్ వద్ద డబ్బు దండుకుని...
జిల్లాలోనే కీలకమైన ఓ అసెంబ్లీ టికెట్ విషయంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వద్ద డబ్బులు భారీగా దండుకుని ఆయన కుటుంబీకులకు చంద్రబాబు టికెట్ ఇచ్చారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ సదరు నేతకు, కుటుంబీకులకు ఎవరికి సీటిచ్చినా ఘోరంగా ఓటమి ఖాయమని సర్వేలు, పార్టీ నేతలు నెత్తీనోరూ కొట్టుకున్నా చంద్రబాబు మాత్రం... సదరు నేత కుటుంబీకులకే టికెట్ ఇవ్వడం టీడీపీ నేతల వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. అయితే తాజాగా మరో కొత్త కోణం వెలుగు చూసింది. సదరు సీనియర్ నేత తన నియోజకవర్గంతో పాటు మరో రెండు నియోజకవర్గాల ఖర్చు భరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తమకు టికెట్ వద్దని ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇతర నియోజకవర్గాలకు తామెందుకు డబ్బులు ఖర్చు చేయాలని సదరు నేత కుమారుడు ప్రశ్నించినట్లు సమాచారం.
సీటు త్యాగానికై నా సిద్ధమట..
ఒక సీటిచ్చి మూడు నియోజకవర్గాల ఖర్చు భరించాలంటే తమ వల్ల కాదని సదరు సీనియర్ నేత కుటుంబీకులు తేల్చేశారు. కాదు.. కూడదంటే... తమ సీటు కూడా వదలుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల నుంచి భారీ వ్యతిరేకత ఏర్పడుతున్న తరుణంలో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి సదరు సీనియర్ నేత కుటుంబీకులు వచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఓటమి భయంతోనే..
సదరు టీడీపీ సీనియర్ నేత గతంలో ప్రాతినిథ్యం వహించిన స్థానంతో పాటు జిల్లాలో ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు. దీంతో డబ్బు ఎరగా వేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈక్రమంలోనే సదరు టీడీపీ సీనియర్ నేత ద్వారా డబ్బులు లాగి.. మిగతా సీట్లకు సర్దాలనే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
రెబల్స్ బెడద..
సీనియర్ నాయకులు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, నిమ్మల కిష్టప్ప తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని అధిష్టానంపై అలకబూనారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు వారంతా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుట్టపర్తి, పెనుకొండ నేతలు కొందరు గోరంట్లలోని నిమ్మల కిష్టప్ప నివాసంలో రహస్యంగా సమావేశమై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment