సాక్షి ప్రతినిధి, అనంతపురం: తన జిత్తులమారి తనాన్ని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. తనను నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునగాల్సిందే అని అందరూ అనే మాటను మళ్లీ రుజువు చేశారు. పొత్తు ధర్మం అంటే ఇలా కూడా ఉంటుందా అన్న రీతిలో జనసేన, బీజేపీలకు చంద్రబాబు రుచి చూపించారు. కొన్ని రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఘటనలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైతుంది. తన పార్టీ అభ్యర్థులనే పొత్తు పార్టీల్లోకి పంపించడం, లేదంటే సీటు లాక్కోవడం వంటి కుయుక్తులకు పాల్పడుతూ రాజకీయ విశ్లేషకులనే కాకుండా సాధారణ ప్రజానీకాన్ని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.
జనసేన కథ ముగిసినట్టే..!
14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకుండా జనసేనకు చెక్ పెట్టగలిగారు. చంద్రబాబు దెబ్బకు గ్లాసు పార్టీ (జనసేన) కథ ముగిసినట్టేనని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 14 నియోజకవర్గాల్లో ఒక్కసీటు కూడా లేకుండా చేయడమంటే కథ ముగిసినట్టు కాక మరేమిటని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ధర్మవరంలో చిలకం మధుసూదన్‌రెడ్డి, అనంతపురంలో టీసీ వరుణ్ జనసేన తరఫున సీటుకోసం గట్టిగా ప్రయత్నించారు. అనంతపురం సీటు వస్తుందనుకున్న దశలో బాబు వ్యూహం పన్ని దాన్ని లాగేసుకున్నారు.
బీజేపీ పరిస్థితీ అంతే
భారతీయ జనతాపార్టీ పరిస్థితి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణంగా ఉంది. తొలుత హిందూపురం పార్లమెంటు సీటు బీజేపీకి వస్తుందని బాగా ప్రచారం జరిగింది. తర్వాత గుంతకల్లు అసెంబ్లీ సీటు కూడా అన్నారు. చివరికి, హిందూ పురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథిని చంద్రబాబు ప్రకటించారు. దీంతో బీజేపీ తరఫున హిందూపురం పార్లమెంటు టికెట్ ఆశించిన పరిపూర్ణానందస్వామి, సత్యకుమార్, అంబికా కృష్ణ లాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి.
అక్కడి అభ్యర్థి బాబు మనిషే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీకి కేటాయించనున్నట్టు చెప్పుకుంటున్న సీటు ధర్మవరం ఒకే ఒక్కటి. ఇక్కడ ప్రస్తుతం వరదాపురం సూరి పోటీలో ఉన్నారు. ఈయనకు గనుక సీటు ఇస్తే టీడీపీకి ఇచ్చినట్టే!. 2019లో వరదాపురం సూరి ధర్మవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత తన అక్రమాలు బయటకు వస్తాయేమోనన్న భయంతో బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలోకి వెళ్లినా ఆయన ఆత్మ టీడీపీనే అనేది అందరికీ తెలిసిందే. అంతెందుకు బీజేపీలో అయినా, టీడీపీలో అయినా ఏ పార్టీనుంచైనా సీటు తనదే అంటూ వరదాపురం సూరి ప్రకటించారు కూడా.
దీన్నిబట్టి చూస్తే బాబు పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కారని బీజేపీ, జనసేన శ్రేణులు వాపోతున్నాయి. బీజేపీ తరఫున ఎంపీ సీటుకు పోటీపడి మోసపోయిన పరిపూర్ణానంద స్వామి, అంబికాకృష్ణ, సత్యకుమార్ లాంటి వారికి కూడా బాబు ఎత్తులు జిత్తులు ఏంటో తెలిసివచ్చినట్టయిందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైతేనేం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేనకు ఒక్కసీటు కూడా లేకపోగా..ధర్మవరంలోనూ బీజేపీ తరఫున సూరికి గనుక సీటు వస్తే బాబు తనమనిషికే ఇప్పించుకుంటున్నట్టు అవుతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment