జై కొట్టిన తమ్ముళ్లే చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఇన్నాళ్లూ పార్టీ జెండాలు మోసిన వారే కిందపడేసి తొక్కారు. మీ నిర్ణయం మార్చుకోండి..లేకపోతే మా నిర్ణయం మేం తీసుకుంటామంటూ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ– జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించింది. నమ్ముకున్న వారికి అన్యాయం చేశారంటూ పలుచోట్ల రోడ్లెక్కి నిరసన తెలిపారు.
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ/ మడకశిర: టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలతో తమ్ముళ్ల వర్గపోరు రచ్చకెక్కింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనాగ్రహం వ్యక్తమైంది. టికెట్ ఆశించి భంగపడ్డ వర్గం అధిష్టానంపై అసమ్మతి వ్యక్తం చేసింది. టీడీపీ వెంట నడిచేది లేదని తేల్చిచెప్పింది.
చంద్రబాబు డౌన్‌డౌన్
పెనుకొండ ఇన్‌చార్జిగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని సంప్రదించకుండా సవితమ్మకు టికెట్ ఖరారు చేయడంపై ఆగ్రహ జ్వాలలు రేగాయి. బీకే పార్థసారథి ఇంటి ముందుకట్టిన చంద్రబాబు, లోకేష్‌ల ఫ్లెక్సీలను చించివేశారు. బీకే ఇంట్లో ఉంచిన టీడీపీ కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిని రోడ్డుపైవేసి కాల్చేశారు. ‘చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పెనుకొండలో దమ్ముంటే గెలవాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రపన్ని బీకే పార్థసారథి రాజకీయ జీవితంతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, తెలుగు మహిళలు బీకే ఇంటి వద్దకు చేరి బీసీ వర్గానికి అన్యాయం చేశారని బిగ్గరగా రోదించారు. అనంతరం వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో సవితమ్మను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. టీడీపీ ముఖ్య నాయకులు చినవెంకటరాముడు, రొద్దం నరసింహులు, నరహరి, చిన్నప్పయ్య, సాయిప్రసాద్ తదితరులు ఉన్నారు. మరోవైపు అనంతపురంలోని బీకే పార్థసారథి నివాసం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలనూ బీకే అభిమానులు చించేశారు.
ఈరన్న, సునీల్‌పై చెప్పులదాడి
మడకశిర టీడీపీ టికెట్ ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌కు ఇవ్వడంపై ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం పెల్లుబుకింది. చంద్రబాబు టికెట్ ప్రకటించగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్‌కుమార్‌ను తీసుకుని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటికి వెళ్లారు. అప్పటికే గుండుమల ఇంటి వద్ద గుమిగూడిన వందలాది మంది ఆయన అనుచరులు... ఇంట్లోకి రాకుండా ఈరన్న, సునీల్‌కుమార్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంలోనే కొందరు ఈరన్న, సునీల్‌పై చెప్పులతో దాడి చేశారు. దీంతో ఈరన్న, సునీల్‌కుమార్ అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం ‘గుండుమల’ తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. సునీల్‌కుమార్‌కు సహకరించబోమని స్పష్టం చేశారు. అనుచరులు కూడా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే ఇండిపెండెంట్‌గా పోటీలో దిగాలని నిర్ణయించారు.
శ్రీరామ్ అవుట్...పల్లెకు డౌట్..!
టీడీపీ తొలి జాబితా తర్వాత టీడీపీ నేతల్లో చాలా అనుమానాలు నెలకొన్నాయి. రాప్తాడు, పెనుకొండ, హిందూపురం, మడకశిర సీట్లు ప్రకటించిన చంద్రబాబు... ధర్మవరం, పుట్టపర్తి, కదిరి సీట్లు ఖరారు చేయకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. ధర్మవరం సీటును బీజేపీ, పుట్టపర్తి లేదా కదిరి సీటును జనసేనకు ఇస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో పరిటాల శ్రీరామ్‌కు ఈ సారి టికెట్ లేనట్లే అని తెలుగు తమ్ముళ్లే తెలుస్తోంది. ఇక పుట్టపర్తి సీటును జనసేన ఆశిస్తోందని, అందువల్లే చంద్రబాబు తొలి జాబితాలో పల్లె రఘునాథరెడ్డి పేరు ప్రకటించలేదని చర్చ జరుగుతోంది, అయితే పల్లె రఘునాథరెడ్డి మాత్రం తనకే టికెట్ వస్తుందని గంపెడాశలతో ఉన్నారు.
కందికుంటకు టికెట్ లేనట్టే..!
కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయనపై నకిలీ డీడీల కేసు ఉన్నందున... ఈ కేసు నుంచి బయట పడేవరకూ తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ఆయనే స్వయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారని టీడీపీ లీగల్ వ్యవహారాలు చూసే ఒకరు తెలిపారు. అందుకే శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో కదిరి స్థానం నుంచి ఎవరన్నది ప్రకటించలేదన్నారు.
తనపై కేసు ఉన్నందుకు తన భార్య కందికుంట యశోదమ్మకు టికెట్ ఇవ్వాలని కందికుంట పార్టీ అధిష్టానాన్ని కోరారని, దీనిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కానీ కందికుంట, ఆయన సతీమణి రెండు రోజుల క్రితం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తనకు కాకపోతే తన భార్యకు టికెట్ గ్యారంటీ అని కందికుంట ధీమాగా చెబుతున్నారని అనుచరులు అంటున్నారు. మరోవైపు మలి జాబితాలో కదిరి అభ్యర్థిగా తన పేరు ప్రకటిస్తారని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈసారి కదిరి టికెట్ బీజేపీకి కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి కందికుంట బరిలో ఉండరని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment