అధినేత తీరుపై నిమ్మల, బీకే వర్గాల గుర్రు
వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన
కదిరిలో మైనార్టీకి సీటివ్వకుండా మోసం చేశారంటున్న చాంద్‌బాషా వర్గం
కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు
అనంతపురం, గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎవరైనా ఒకటే.. వెన్నుపోటే’ అంటూ తనకు వెన్నతో పెట్టిన విద్యను చంద్రబాబు ప్రదర్శించారు. బూటకపు హామీలతో అన్ని వర్గాలనూ మోసం చేసిన ఆయన సొంత పార్టీ నేతలనూ వంచించారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేగిన మంటలు చల్లారడం లేదు. 20 రోజుల క్రితం టికెట్లు ప్రకటించినా రోజూ ఏదో ఒక నియోజక వర్గంలో అసమ్మతి సెగలు ఎగుస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలు టికెట్లు దక్కించుకున్న ఆ పార్టీ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి.
బీసీ నేతల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం
అనంతపురం జిల్లాలో బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారినే బాబు తొక్కేశారు. చేనేత వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎంపీగా, మంత్రిగా సేవలందించిన నిమ్మల కిష్టప్పను వాడుకుని వదిలేశారు. దీంతో నిమ్మల లోలోనే కుమిలిపోతున్నారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత బీకే పార్థసారథి వర్గం కూడా అంతే స్థాయిలో అసంతృప్తిగా ఉంది. కురుబ సామాజిక వర్గంలో మంచి పట్టున్న పార్థసారథిని ఈ దఫా చంద్రబాబు విస్మరించారంటూ పార్థ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక పుట్టపర్తిలో వడ్డెర్లకు టికెట్ ఇస్తామని మోసం చేశారని ఏకంగా చంద్రబాబు ఇంటివద్దే పలువురు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ వేణుగోపాల్‌ను పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి చివరకు పల్లె రఘునాథరెడ్డి కోడలికి టికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పల్లె దగ్గర రూ.కోట్లు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
మైనార్టీలను ముంచేశారు
చంద్రబాబు తమనూ వంచించారని ముస్లిం మైనార్టీ నేతలు వాపోతున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు ఈ దఫా మొండిచేయి చూపారు. నకిలీ డీడీల కేసులో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై చాంద్ వర్గీయులు మండిపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క మైనార్టీకి కూడా సీటు ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారు. ఇక అనంతపురం అర్బన్ అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించి, బలిజ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి దింపుతామని ఆశ చూపి, నేడు మళ్లీ తన సామాజిక వర్గం వారినే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై ఆయా వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సొంతవారైనా అంతే..
చివరకు సొంత సామాజిక వర్గం నేతలు కూడా బాబును దుమ్మెత్తి పోస్తున్నారు. కళ్యాణదుర్గం టికెట్ కోసం ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు పోటీ పడ్డారు. చివరకు ఇద్దరిలో ఎవరికి సీటు ఇచ్చినా కలసి పని చేస్తామని ప్రకటించారు. కానీ చంద్రబాబు బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రను తెరమీదకు తెచ్చారు. దీన్ని ఉన్నం, ఉమా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాముకు ఇస్తే ఇంకెంత అసమ్మతి మొదలవుతుందోనని ఆ సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అనంతపురం అర్బన్ సీటులో కూడా అసమ్మతుల బెడద తప్పించుకునేందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment