కొత్తచెరువులో ఎక్కువైన టీడీపీ నేత ఆగడాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక రెచ్చిపోతున్న వైనం
పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలపై కన్ను
స్టేషన్‌కు వెళ్తే సన్మానం చేసి పంపిన సీఐ ఇందిర
సామాజిక మాధ్యమాల్లో ఫొటో, వీడియో వైరల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎస్‌ఎస్.. ఇదో వ్యక్తి పేరు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి సాలక్కగారి శ్రీనివాసులు అలియాస్ ఎస్‌ఎస్. మండలంలో తానే కింగ్‌నంటూ విర్రవీగుతుంటాడు. కేసులకు బెదిరేది లేదంటాడు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చినట్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లొస్తానని ప్రగల్బాలు పలుకుతుంటాడు. ఇతని తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఎన్నో దందాలు చేశాడు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాడు. మహిళలు అని కూడా చూడకుండా నేరుగా అతనే రంగంలోకి దిగి చితకబాదుతున్నాడు. కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో సీఐగా పని చేస్తున్న ఇందిర కూడా ఇతనికి వత్తాసు పలుకుతున్నారు. ఇటీవల పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఎస్‌ఎస్‌కు శాలువా కప్పి, పూలహారం వేసి మరీ సన్మానించారు. రౌడీషీటర్‌గా ఉన్న ఎస్‌ఎస్‌కు ఓ పోలీసు అధికారి సన్మానం చేయడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఎస్‌ఎస్ ఇంత చేస్తున్నా.. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నోరు మెదపకపోవడం గమనార్హం.
మహిళలను చితకబాది..
కొత్తచెరువులో నివాసం ఉండే ఎస్‌ఎస్‌కు ఇటీవల ఇంటి పక్కనే ఉన్న వారితో రోడ్డు విషయమై తగాదా తలెత్తింది. దీనిపై అవతలి నుంచి మహిళలు నిలదీయగా.. తనపైనే తిరగబడతారా? ఎదురు మాట్లాడతారా? అంటూ ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేదని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
స్టేషన్‌కు పిలిపించి కాపుకాచి
కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఈ నెల 17న పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ముగ్గురినీ పంపించారు. అయితే స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై సాలక్క గారి శ్రీనివాసులు అనుచరులు దాడి చేశారు. మరుసటి రోజు ఉదయం బాధితులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
22 ఇంటి స్థలాలపై కన్ను
కొత్తచెరువు నుంచి ధర్మవరం వెళ్లే దారిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. అక్కడ వందలాది మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అయితే రోడ్డుకు ఆనుకుని ఉండే 22 స్థలాలపై ఎస్‌ఎస్ కన్ను పడింది. అధికారులను అడ్డుపెట్టుకుని నిర్మాణాలు ఆపాడు. దీనిపై బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఇప్పటికీ న్యాయం జరగలేదు.
అక్రమాలు అన్నీ ఇన్నీ కాదయా..
సాలక్కగారి శ్రీనివాసులు అక్రమాలు కొత్తచెరువులో ఒక్కొక్కటిగా వెలికి తీస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. అధికారాన్ని.. అధికారులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం వెన్నతో పెట్టిన విద్య. స్థానిక పెనుకొండ రోడ్డులోనూ చాలామంది పేదల భూములను కొట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment