పరిటాల శ్రీరామ్ వర్సెస్ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విధులకు హాజరైతే బయటకు గెంటేస్తామంటూ శ్రీరామ్ హెచ్చరిక
ప్రభుత్వం నియమించింది కాబట్టి పని చేసి తీరుతానన్న కమిషనర్
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు తమ స్వేచ్ఛను కోల్పోయారు. నిజాయితీతో పని చేస్తూ నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు తమకు అవసరం లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు తమ అధినేత బాటలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం నిలువుటద్దమైంది. విధులకు హాజరైతే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానంటూ కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చి అహంకారాన్ని ప్రదర్శించగా... ప్రభుత్వం తనని నియమించింది కాబట్టి విధులను నిజాయితీతో నిర్వర్తించి తీరుతానంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రతిగా స్పందించారు. ఎవరికి వారే పంతం పట్టడంతో వీరిద్దరిలో నెగ్గేదెవరు? తగ్గేదెవ్వరూ? అన్నది ప్రస్తుతం ధర్మవరంలో హాట్ టాపిక్‌గా మారింది.
పరిటాలకు మింగుడు పడని అంశం..
ధర్మవరం మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా మల్లికార్జునను 15రోజుల క్రితం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సదరు కమిషనర్ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ ధర్మవరం మున్సిపాలిటి కమిషనర్‌గా పనిచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన పర్యవేక్షణలో ధర్మవరం మరింత అభివృద్ధి చెందుతుందని భావించిన కూటమి ప్రభుత్వం ఇటీవల ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్‌కు మింగుడు పడలేదు.
కమిషనర్‌గా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించక ముందే పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున కమిషనర్‌గా బాధ్యతలు చేపడితే చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు గెంటేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా మల్లికార్జున కార్యాలయానికి రాకుండా ఉండేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి అల్లర్లకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు తిష్ట వేసి నిరసన తెలుపుతుండటంతో పోలీసులు ఇరుకున పడ్డారు. తమను మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతకు కేటాయిస్తే రోజువారీ డ్యూటీలు ఎలా చేయాలంటూ వారిలో వారు మదన పడుతున్నారు.
అమ్మో ధర్మవరమా?
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారడంతో ధర్మవరానికి బదిలీపై వెళ్లాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం తమ వల్ల కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ధర్మవరానికి పోస్టింగ్ అయిన అధికారులు సైతం తమను మరో ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓ ముఖ్య అధికారి సైతం ఇక్కడ పని చేయలేక వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ నేతల వైఖరితో ధర్మవరం వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేతల తీరుపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment