పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నాలుగున్నరేళ్లుగా అవకాశం చిక్కిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా.. ప్రైవేట్ పనులైనా ఒకరు ముందు.. మరొకరు వెనుక హాజరవుతూ వచ్చారు. వేదికలపై కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటూ, మరొకరు లేచి వెళ్లిపోయే సంస్కృతిని అలవాటు చేసుకున్నారు. ఇటీవల ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఎంపీ కిష్టప్పను రాజకీయంగా పూర్తిగా అణచివేసేందుకు ఎమ్మెల్యే బీకే చేస్తున్న ప్రయత్నాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో పార్థుడి వ్యవహారంపై కిష్టప్ప గుర్రుగా ఉన్నారు. ఇటీవల సీఎం పర్యటనలో ఎమ్మెల్యేకు విరుద్ధంగా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అనంతపురం,పెనుకొండ : ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకిష్టప్ప మధ్య వైరం తారస్థాయికి చేరుకుంది. ఇంతకాలం నిప్పూ, ఉప్పులా ఉండే ఈ ప్రజాప్రతినిధులు.. మళ్లీ విభేదాలతో వీధికెక్కారు. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వాపోయినట్లు సమాచారం.
భగ్గుమన్న ఎంపీ వర్గీయులు
ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను రెచ్చగొట్టేందుకే ఎమ్మెల్యే పార్థసారథి పోలవరం యాత్ర సాగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఎంపీ వర్గీయులను పూర్తిగా పక్కన బెట్టి కేవలం తన అనుచరులను మాత్రమే ఎమ్మెల్యే సానంపారు. దీనిపై ఎంపీ వర్గీయులు భగ్గుమన్నారు. ఎన్నికల్లో కేవలం ఆయన అనుచర వర్గం మాత్రమే ఓట్లు వేయించలేదని, సమష్టి కృషితోనే ఎమ్మెల్యేగా ఆయన గెలిచారంటూ వ్యాఖ్యానించారు. ఆరంభం నుంచి ఎమ్మెల్యే తమను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై ఎంపీ ఎదుట తమ అక్కసును వెళ్లగక్కారు. తమకు గుర్తింపు లేకుండా చేయడానికే ఎమ్మెల్యే ఇలా వ్యవహరించారంటూ పెద్ద దుమారమే లేపారు. రైతులను పిలుచుకెళ్లాల్సిన చోట పార్టీ కార్యకర్తలను ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. దీని వల్ల పార్టీ ప్రతిష్టను ఎమ్మెల్యే పార్థసారథి మంటగలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పదవి దక్కలేదనే అక్కసు?
నిమ్మల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ఎమ్మెల్యే బీకే.రగిలిపోతున్నట్లు సమాచారం. ఎంపీసిఫారసు చేయడం వల్లనే పల్లె రఘునాథరెడ్డికి గతంలో మంత్రి పదవి దక్కిందనే వాదనలూ ఉన్నాయి. అప్పటి నుంచి ఎంపీపై అసంతృప్తితో ఎమ్మెల్యే రగలిపోతూ వచ్చారు. ఇలాంటి తరుణంలోనే ఎంపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటూ వచ్చారు. గోరంట్ల మండలం కమ్మవారుపల్లికి రూ.90 లక్షలతో ఎంపీ కోటా, ఉపాధి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు తన వర్గీయుడైన సర్పంచ్ సుధాకరరెడ్డి ద్వారా ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి.
నీరు– చెట్టు పనుల కేటాయింపుల్లో ఎంపీ వర్గీయులు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీ ద్వారా తనకు అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యేతో జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ కుటుంబసభ్యులు వాపోవడంతో, ఏకంగా కమిటీల్లో ఉన్న ఎంపీ వర్గీయులను ఎమ్మెల్యే తొలగించడం వీరి మధ్య ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. ఇసుక మాఫియా విషయంలో ఘర్షణలు తలెత్తి ఎమ్మెల్యే అనుచరుడు నరేష్ హత్య కావడంతో ఆ సమయంలో ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గీయులు బహిరంగ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచనలమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేవారిపై చర్యలు తప్పవని, అవసరమైతే రాబోవు ఎన్నికల్లో వారికి టికెట్ కూడా ఇచ్చేది లేదంటూ మూడు రోజుల క్రితం అనంత వేదికగా సీఎం చేసిన ప్రకటన.. ఈ ఇద్దరి విషయంలో ఎంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఎదుటి వారి కళ్లకు గంతలు కట్టే ఈ నాయకుల వ్యవహారం ఎన్నికల నాటికి ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment