
పెనుకొండలో అఖిలపక్ష నాయకులను దూషిస్తూ వారిపై అక్రమ కేసులు పెట్టాలని అప్పటి సీఐ శ్రీనివాసులును ఆదేశిస్తున్న ఎమ్మెల్యే బీకే (ఫైల్) , పెనుకొండ మండలం కొండంపల్లిలో సీపీఐ నాయకుడు శ్రీరాములును దూషిస్తున్న బీకే పార్థసారథి (ఫైల్)
సాక్షి టాస్క్‌ఫోర్స్: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న ఆశతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంతకుమునుపు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఎంతగానో సహకరించారు. కానీ ఆయన మాత్రం సొంత లాభమే ఎక్కువగా చూసుకున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే బూతు పురాణం వినిపిస్తున్నారు. 2014లో ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. అక్రమ సంపాదనతో అహం పెరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నించే విపక్ష పార్టీల నాయకులను దూషించడం, ప్రజలను చులకనగా మాట్లాడటంతో జనమంతా ఆయనంటేనే ఈసడించుకుంటున్నారు.
చివరకు సొంత పార్టీ నేతలను సైతం రాయలేని పదజాలంతో దూషిస్తుండటంతో చాలా మంది సీనియర్లు ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి నెలకొంది. తన అల్లుడి ద్వారా నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు చేసుకుని సొంత పార్టీలోని సీనియర్లను తీవ్రంగా అవమానించారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడగా...మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాత్రికేయులనూ వదలని బీకే
పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలు, అవినీతిపై కథనాలు రాసిన విలేకరులను సైతం బీకే నోరుచేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. నోటికి అంతూపంతూ లేకుండా ఆయన వినిపించే బూతుపురాణం వింటే ఎవరైనా ఇతనో ఎమ్మెల్యేనా అని అనుమానిస్తారు.
‘‘ఏయ్ ఎస్‌ఐ.. ఈ నా కొడుకులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి మక్కిలు విరిగేలా తన్ను’’
- నీటి సమస్యలపై నిలదీసిన పెనుకొండ మండలం కొండంపల్లి సీపీఐ నాయకులనుద్దేశించి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలివి.
‘‘ఏయ్ సీఐ.. ఆ లం..కొడుకును.. ఎవరు రోడ్డుపై ధర్నా చేయమన్నారు. మొదట ఆ లం..కొడుకును చెప్పుతో కొట్టి పోలీస్‌స్టేషన్‌లో పెట్టి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చెయ్...’’
- ప్రత్యేక హోదాపోరుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి అప్పటి సీఐ శ్రీనివాసులుతో ఎమ్మెల్యే అన్న మాటలివి.
బీకే దూషణల పర్వంలో మచ్చుకు కొన్ని..
- ఇటీవలే సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లిలో గ్రామస్తులు నీటి సమస్యపై ఎమ్మెల్యేని నిలదీస్తే దీనికి బాధ్యుడిగా చేస్తూ స్థానిక ‘సాక్షి’ విలేకరిపై చిందులు వేసి దూషించాడు. అలాగే పెనుకొండ, రొద్దం మండలాలకు చెందిన విలేకరులను సైతం చాలా సందర్భాల్లో బహిరంగంగానే దూషించారు.
- రెండునెలల క్రితం గోరంట్ల మండలం అమ్మవారిపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో మంజూరైన సిమెంట్ రోడ్డును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బీకే గ్రామానికి రాగా...స్థానికులంతా సిమెంట్ రోడ్డు బదులుగా తారురోడ్డు వేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే బీకే సహనం కోల్పోయి వారితో దురుసుగా ప్రవర్తించాడు.
- ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించమని అడిగిన పాపానికి అమ్మవారిపల్లికి చెందిన భూ నిర్వాసితుల కుటుంబానికి చెందిన విద్యార్థి వెంకటరెడ్డిని అందరి ముందే దూషించాడు. ఇలా ఆయన నోటికి బలైన వారు ఎందరో ఉన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడటం తగదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment