un parliamentary language
-
ఎమ్మెల్యేవారి బూతుపురాణం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న ఆశతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంతకుమునుపు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఎంతగానో సహకరించారు. కానీ ఆయన మాత్రం సొంత లాభమే ఎక్కువగా చూసుకున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే బూతు పురాణం వినిపిస్తున్నారు. 2014లో ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. అక్రమ సంపాదనతో అహం పెరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నించే విపక్ష పార్టీల నాయకులను దూషించడం, ప్రజలను చులకనగా మాట్లాడటంతో జనమంతా ఆయనంటేనే ఈసడించుకుంటున్నారు. చివరకు సొంత పార్టీ నేతలను సైతం రాయలేని పదజాలంతో దూషిస్తుండటంతో చాలా మంది సీనియర్లు ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి నెలకొంది. తన అల్లుడి ద్వారా నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు చేసుకుని సొంత పార్టీలోని సీనియర్లను తీవ్రంగా అవమానించారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడగా...మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత్రికేయులనూ వదలని బీకే పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలు, అవినీతిపై కథనాలు రాసిన విలేకరులను సైతం బీకే నోరుచేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. నోటికి అంతూపంతూ లేకుండా ఆయన వినిపించే బూతుపురాణం వింటే ఎవరైనా ఇతనో ఎమ్మెల్యేనా అని అనుమానిస్తారు. ‘‘ఏయ్ ఎస్ఐ.. ఈ నా కొడుకులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి మక్కిలు విరిగేలా తన్ను’’ - నీటి సమస్యలపై నిలదీసిన పెనుకొండ మండలం కొండంపల్లి సీపీఐ నాయకులనుద్దేశించి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలివి. ‘‘ఏయ్ సీఐ.. ఆ లం..కొడుకును.. ఎవరు రోడ్డుపై ధర్నా చేయమన్నారు. మొదట ఆ లం..కొడుకును చెప్పుతో కొట్టి పోలీస్‌స్టేషన్‌లో పెట్టి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చెయ్...’’ - ప్రత్యేక హోదాపోరుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి అప్పటి సీఐ శ్రీనివాసులుతో ఎమ్మెల్యే అన్న మాటలివి. బీకే దూషణల పర్వంలో మచ్చుకు కొన్ని.. ఇటీవలే సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లిలో గ్రామస్తులు నీటి సమస్యపై ఎమ్మెల్యేని నిలదీస్తే దీనికి బాధ్యుడిగా చేస్తూ స్థానిక ‘సాక్షి’ విలేకరిపై చిందులు వేసి దూషించాడు. అలాగే పెనుకొండ, రొద్దం మండలాలకు చెందిన విలేకరులను సైతం చాలా సందర్భాల్లో బహిరంగంగానే దూషించారు. రెండునెలల క్రితం గోరంట్ల మండలం అమ్మవారిపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో మంజూరైన సిమెంట్ రోడ్డును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బీకే గ్రామానికి రాగా...స్థానికులంతా సిమెంట్ రోడ్డు బదులుగా తారురోడ్డు వేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే బీకే సహనం కోల్పోయి వారితో దురుసుగా ప్రవర్తించాడు. ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించమని అడిగిన పాపానికి అమ్మవారిపల్లికి చెందిన భూ నిర్వాసితుల కుటుంబానికి చెందిన విద్యార్థి వెంకటరెడ్డిని అందరి ముందే దూషించాడు. ఇలా ఆయన నోటికి బలైన వారు ఎందరో ఉన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడటం తగదంటున్నారు. -
కోరలు తీస్తా.. ఖబడ్దార్
♦ మగాడివైతే.. దమ్ముంటే..సిగ్గులేదు.. ♦ అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇదీ సీఎం, మంత్రుల పదజాలం ♦ వేలెత్తి చూపించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం అధికారపక్షం సభా మర్యాదలకు పూర్తిగా తిలోదకాలిచ్చింది. ప్రతిపక్ష సభ్యులను ఇష్టానుసారం అన్‌పార్లమెంటరీ పదజాలంతో దూషించింది. వేలుపెట్టి చూపిస్తూ బెదిరింపులకు దిగింది. విపక్ష వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ కోడెల సోమవారం సభలో చర్చకు పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా.. జగన్‌పైనా, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిపైనా అధికార పక్ష సభ్యులు, మంత్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సిగ్గులేదా.. ధైర్యం ఉంటే.. ఖబడ్దార్.. మగాడివైతే లాంటి మాటలను యథేచ్ఛగా ఉపయోగించారు. సీఎం సైతం ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా వేలెత్తి చూపుతూ, బల్లను కొడుతూ కోరలు తీస్తానని ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. ఒకరిని మించి మరొకరు.. జగన్మోహన్రెడ్డి వివిధ అంశాల్లో ప్రభుత్వ అవినీతిని, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రస్తావించగా.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేచి ‘మిస్టర్ జగన్మోహన్రెడ్డి ఖబడ్దార్..’ అంటూ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు దిగారు. విపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ కల్పించుకొని ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జగన్ సోలార్ కుంభకోణం గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ఆధారాలు చూపించాలంటూ ‘దమ్ముంటే.. ధైర్యముంటే.. మగాడివైతే..’ అంటూ మాట్లాడారు. ఇంకో సందర్భంలో జగన్‌ను ఉద్దేశించి ‘కొవ్వెక్కి..’ అనే పదాన్ని అచ్చెన్నాయుడు ఉపయోగించారు. ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక చంద్రబాబైతే ఆవేశంతో ఊగిపోయారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ.. (వేలెత్తి చూపు తూ) ‘సిగ్గు లేదు మీకు.. మీది దివాలా కోరు పార్టీ.. మీ ఆటలు ఇక్కడ సాగవు. నీలాంటి దుర్మార్గులు (జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి) ఉండబట్టే.. ఏం మాట్లాడుతున్నారు..’ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జగన్ డిమాండ్ చేసినప్పుడల్లా.. అధికార టీడీపీ సభ్యులు ఈ విధంగా రెచ్చిపోయిన ఘటనలు సోమవారం సభలో అనేకసార్లు చోటుచేసుకున్నాయి. -
దమ్ముందా... మగతనముందా..
అసెంబ్లీలో దారితప్పిన అధికార పక్షం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా సంప్రదాయాలకు భిన్నంగా ఆనవాయితీలకు విరుద్ధంగా అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై అధికార పక్షం ఇష్టానుసారంగా అన్ పార్లమెంటరీ పదజాలంతో దూషించడమే కాకుండా వేలు పెట్టి చూపిస్తూ బెదిరింపులకు సైతం దిగడం వంటి విస్మయకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైన కారణంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చింది. దానిపై సోమవారం స్పీకర్ చర్చకు పెట్టారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను సైతం ప్రతిపక్షంపై రాజకీయ ఎత్తుగడతో చేపట్టగా, ఇక దానిపై చర్చ సందర్భంగా అధికార పక్షం సభా సంప్రదాయాలను పాతరేసింది. ప్రతిపక్షంపై అడ్డూఅదుపు దూషణలు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా అలవోకగా దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు గుప్పించడమే కాకుండా ఆవేశానికి గురవుతూ సభా మర్యాదలకు విరుద్ధం అడ్డగోలు పదజాలం ఉపయోగించారు. అధికార పక్షం సభ్యులు, మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయాలన్న తపనలో ఆవేశకావేశాలకు లోనవుతూ బల్లలు చరుస్తూ ఖబర్దార్ అంటూ వేలెత్తి బెదిరింపులకు దిగారు. పైపెచ్చు మీకు సభా సంప్రదాయాలు, రూల్స్ తెలియవని ఎదురుదాడి చేశారు. సిగ్గులేదా.. ధైర్యం ఉంటే... మగతనం ఉంటే... అన్న మాటలను సైతం సభలో అధికార పక్షం సభ్యులు యధేచ్చగా ఉపయోగించారు. ఇలాంటి మాటలు ఎంతటి స్థాయికి చేరుకున్నాయంటే... అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతామన్న ప్రతిసారీ అవకాశం ఇచ్చిన స్పీకర్ సైతం వారి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉపయోగించిన పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నానని స్పీకర్ ప్రకటించాల్సి వచ్చింది. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మగతనం ఉంటే... అంటూ ముందున్న బల్లను చరుస్తూ రెచ్చిపోయారు. ఆ సందర్భంగా కూడా స్పీకర్ కల్పించుకుని సమాధానం చెప్పేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయని, పరిధి దాటి మాట్లాడకూడదని వారించేంతవరకు వెళ్లింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి వివిధ అంశాల్లో జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని ప్రస్తావించగానే మంత్రి ఉమామహేశ్వరరావు లేచి మిస్టర్ జగన్ మోహన్ రెడ్డీ కబర్దార్... అంటూ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు దిగారు. విపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ కల్పించుకుని ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జగన్ తన ప్రసంగంలో సోలార్ కుంభకోణం గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని ఆధారాలు చూపించాలంటూ దమ్ముంటే... ధైర్యముంటే... మగతనముంటే... అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ సందర్భంలోనూ స్పీకర్ కల్పించుకుని మాట్లాడేటప్పుడు కూడా హద్దులు ఉంటాయని, వాటిని గమనించి మాట్లాడాలని మంత్రికి చెప్పాల్సి వచ్చింది. మంత్రుల వ్యవహారం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మరింత విచిత్రంగా ఉంది. జగన్ తాను చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఆవేశంతో ఊగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులవైపు వేలెత్తి చూపిస్తూ, సిగ్గు లేదు మీకు... మీది దివాలా కోరు పార్టీ...మీ ఆటలు ఇక్కడ సాగవు... (జగన్‌ను ఉద్దేశిస్తూ) నీలాంటి దుర్మార్గులు ఉండబట్టే... ఏం మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మీరు రూల్స్ తెలియవు... సభా సంప్రదాయాలు తెలియవు... అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జగన్ కోరినప్పుడల్లా అధికార తెలుగుదేశం సభ్యులు ఈ రకంగా రెచ్చిపోయిన ఘటనలు సోమవారం సభలో అనేకసార్లు చోటుచేసుకున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా సంయమనం కోల్పోకుండా తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయిస్తే అన్నీ బయటపడుతాయంటూ అంతవరకే పరిమితంగా కాగా, ఆ మాటలు అన్నప్పుడల్లా ముఖ్యమంత్రితో పాటు దాదాపు ఆరుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు... రెచ్చిపోవడంతోనే సభ సాగిపోయింది. ఇలాంటి ఘటనలు తీవ్రమైన దశలో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.