అసెంబ్లీలో దారితప్పిన అధికార పక్షం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభా సంప్రదాయాలకు భిన్నంగా ఆనవాయితీలకు విరుద్ధంగా అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై అధికార పక్షం ఇష్టానుసారంగా అన్ పార్లమెంటరీ పదజాలంతో దూషించడమే కాకుండా వేలు పెట్టి చూపిస్తూ బెదిరింపులకు సైతం దిగడం వంటి విస్మయకర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైన కారణంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చింది. దానిపై సోమవారం స్పీకర్ చర్చకు పెట్టారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను సైతం ప్రతిపక్షంపై రాజకీయ ఎత్తుగడతో చేపట్టగా, ఇక దానిపై చర్చ సందర్భంగా అధికార పక్షం సభా సంప్రదాయాలను పాతరేసింది. ప్రతిపక్షంపై అడ్డూఅదుపు దూషణలు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా అలవోకగా దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు గుప్పించడమే కాకుండా ఆవేశానికి గురవుతూ సభా మర్యాదలకు విరుద్ధం అడ్డగోలు పదజాలం ఉపయోగించారు.
అధికార పక్షం సభ్యులు, మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయాలన్న తపనలో ఆవేశకావేశాలకు లోనవుతూ బల్లలు చరుస్తూ ఖబర్దార్ అంటూ వేలెత్తి బెదిరింపులకు దిగారు. పైపెచ్చు మీకు సభా సంప్రదాయాలు, రూల్స్ తెలియవని ఎదురుదాడి చేశారు. సిగ్గులేదా.. ధైర్యం ఉంటే... మగతనం ఉంటే... అన్న మాటలను సైతం సభలో అధికార పక్షం సభ్యులు యధేచ్చగా ఉపయోగించారు.
ఇలాంటి మాటలు ఎంతటి స్థాయికి చేరుకున్నాయంటే... అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతామన్న ప్రతిసారీ అవకాశం ఇచ్చిన స్పీకర్ సైతం వారి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉపయోగించిన పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నానని స్పీకర్ ప్రకటించాల్సి వచ్చింది. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మగతనం ఉంటే... అంటూ ముందున్న బల్లను చరుస్తూ రెచ్చిపోయారు. ఆ సందర్భంగా కూడా స్పీకర్ కల్పించుకుని సమాధానం చెప్పేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయని, పరిధి దాటి మాట్లాడకూడదని వారించేంతవరకు వెళ్లింది.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి వివిధ అంశాల్లో జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని ప్రస్తావించగానే మంత్రి ఉమామహేశ్వరరావు లేచి మిస్టర్ జగన్ మోహన్ రెడ్డీ కబర్దార్... అంటూ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు దిగారు. విపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ కల్పించుకుని ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జగన్ తన ప్రసంగంలో సోలార్ కుంభకోణం గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని ఆధారాలు చూపించాలంటూ దమ్ముంటే... ధైర్యముంటే... మగతనముంటే... అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ సందర్భంలోనూ స్పీకర్ కల్పించుకుని మాట్లాడేటప్పుడు కూడా హద్దులు ఉంటాయని, వాటిని గమనించి మాట్లాడాలని మంత్రికి చెప్పాల్సి వచ్చింది.
మంత్రుల వ్యవహారం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మరింత విచిత్రంగా ఉంది. జగన్ తాను చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఆవేశంతో ఊగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులవైపు వేలెత్తి చూపిస్తూ, సిగ్గు లేదు మీకు... మీది దివాలా కోరు పార్టీ...మీ ఆటలు ఇక్కడ సాగవు... (జగన్ను ఉద్దేశిస్తూ) నీలాంటి దుర్మార్గులు ఉండబట్టే... ఏం మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మీరు రూల్స్ తెలియవు... సభా సంప్రదాయాలు తెలియవు... అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జగన్ కోరినప్పుడల్లా అధికార తెలుగుదేశం సభ్యులు ఈ రకంగా రెచ్చిపోయిన ఘటనలు సోమవారం సభలో అనేకసార్లు చోటుచేసుకున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా సంయమనం కోల్పోకుండా తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయిస్తే అన్నీ బయటపడుతాయంటూ అంతవరకే పరిమితంగా కాగా, ఆ మాటలు అన్నప్పుడల్లా ముఖ్యమంత్రితో పాటు దాదాపు ఆరుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు... రెచ్చిపోవడంతోనే సభ సాగిపోయింది. ఇలాంటి ఘటనలు తీవ్రమైన దశలో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
దమ్ముందా... మగతనముందా..
Published Mon, Mar 14 2016 5:27 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement