నియోజకవర్గాల పెంపుపై టీడీపీకి షాక్
►టీడీపీలో మొదలైన ఆందోళన
►పునర్విభజన సాధ్యం కాదని తేల్చిన కేంద్రం
►అయోమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. భవిష్యత్తుపై భయాందోళనలు
►60 నుంచి 70 నియోజకవర్గాల్లో కుమ్ములాటల భయం
►దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
అమరావతి: రాష్ట్రంలో శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెంపుదల సాధ్యం కాదని తేలిపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. కోట్లు వెదజల్లి, పదవులతో ప్రలోభపెట్టి 21మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీడీపీలో ఇప్పుడు గుబులు పుడుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందరినీ సర్దుబాటు చేస్తానంటూ మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నేతలను మభ్యపెట్టిన అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేస్తారోనన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.
అసంతృప్తి జ్వాలలు, పరస్పర దాడులతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఆయా నియోజకవర్గాలతో పాటు మరో 40-50 నియోజకవర్గాల్లోనూ గందరగోళం తప్పదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యం కాదనే విధంగా తనతో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాతో సుస్పష్టం చేయడంతో ఏపీలో అధికార పార్టీకి పిడుగుపడినట్లయింది.
నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026 తరువాతనే పరిశీలించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పునర్విభజన అంశాన్ని సానుకూలంగా మలుచుకుని 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని చూసిన పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో నేతల మధ్య కుమ్ములాటలు తప్పవని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఇప్పుడు తలనొప్పులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు.
అడియాశలైన ఆశలు
రాష్ట్ర విభజన చట్టంలో అనేక అంశాలున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన (పెంపు)పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా, పోలవరంలాంటి కీలకాంశాల కంటే ఆయన నియోజకవర్గాల పునర్విభజనకే ప్రాధాన్యమిచ్చారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఫిరాయింపులను ప్రోత్సహించారు. 21 మంది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకునేటపుడు దాదాపుగా వారి నియోజకవర్గాలన్నింటిలోనూ టీడీపీ శ్రేణుల నుంచి, ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల చేతిలో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనీ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు వారిని ఊరడించారని సమాచారం.
పార్టీలో ఇప్పటికి చేర్చుకున్నది 21 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే అనీ, 50 వరకూ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కనుక అంత మందిని అదనంగా చేర్చుకున్నా మనకు ఇబ్బంది లేదని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు పార్టీలోని అసమ్మతి నేతలను అనేకసార్లు బుజ్జగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గత పార్లమెంటు సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన బిల్లు రాబోతోందని టీడీపీ వర్గాలు ఆశించాయి.
అపుడు సాధ్యం కాకపోవడంతో ఈ సమావేశాల్లో ఎలాగైనా ఆమోదింప జేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సందర్భంగా ప్రధాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనపై సానుకూలత కనిపించక పోవడంతో పార్టీ నేతలకు, శ్రేణులకు ఇపుడేం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అధినేత పడిపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు.
పలు చోట్ల పొసగని తీరు
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 21 మందిని టీడీపీలో చేర్చుకునేటపుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి తలెత్తింది. అద్దంకి, జమ్మలమడుగు, కందుకూరు వంటి చోట్ల నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు, గత ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల చేతిలో ఓటమి పాలైనవారూ తీవ్రంగా ప్రతిఘటించారు. వారిని చేర్చుకుంటే తాము పార్టీని వీడతామని హెచ్చరించారు కూడా. వారందరినీ ఇప్పటివరకూ బుజ్జగిస్తూ వచ్చారు. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ నిత్యం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.
జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి రంగ ప్రవేశాన్ని ఆయన చేతిలో ఓటమి పాలైన పి.రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరి మధ్య నేటికీ సఖ్యత కుదరలేదు. ఈ రెండు చోట్లా నియోజకవర్గ స్థాయి నేతలు ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టినా ఉద్రిక్తతలు సద్దుమణగలేదు.
కందుకూరు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన చేతిలో ఓడిపోయిన దివి శివరామ్ వర్గాల మధ్య నేటికీ సఖ్యత లేదు. ఇక టీడీపీలోనే ఒకే నియోజకవర్గంలో ఇద్దరేసి ముఖ్య నేతలున్న చోట్ల కూడా నియోజకవర్గాల సంఖ్య పెరుగుదలపై ఆశలు పెట్టుకున్న వారికి రాబోయే ఎన్నికల్లో అదనపు స్థానాల్లో సర్దుబాటు చేస్తానని టీడీపీ అధినాయకత్వం హామీలిచ్చింది. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, పాలేటి రామారావు... విశాఖపట్టణం నగరంలోని నియోజకవర్గాల్లో ఎంవీవీఎస్ మూర్తి, రెహ్మాన్‌లకు సర్దుబాటు ఆశలు చూపినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విభజన ఉండదని తేలిపోవడంతో అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకూ నియోజకవర్గాల సంఖ్య పెంపుదల పేరు చెప్పి నెట్టుకు వచ్చిన చంద్రబాబు ఇకపై పార్టీ శ్రేణులకు ఏం చెబుతారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.