చంద్రబాబు, కేసీఆర్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తోన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి వెల్లడించారు. ‘‘పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా..’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి బాగోతాన్ని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ సీఎం, బీజేపీ సీఎంలపైనా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: కేసీఆర్)
ఏపీలో జరుగుతున్నదిదే: ‘‘నాలుగేళ్ల నుంచి ఏపీలో జరుగుతున్నదేంటో మనం చూడట్లేదా, డుమ్కీలు కొట్టడం తప్ప అక్కడ పని జరగట్లేదు. మాకంటే పెద్ద ఎవడూలేడన్న స్థాయిలో ఏదేదో చేస్తమని అక్కడి పాలకులు అన్నారు. కేవలం మాటలు చెప్పుకుంటపోతే అయ్యేదేమీలేదని రుజువైంది. ఏపీకి భిన్నంగా తెలంగాణలో నాయకులందరం కష్టపడి పనిచేశాం. కాబట్టే మంచి ఫలితాలు, అభివృద్ధి సాధించాం’’ అని కేసీఆర్ అన్నారు. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడమేకాక, అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని ప్రజానీకం గట్టిగా భావిస్తున్నా, సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేసులకు భయపడి కేంద్రం పాదాల వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, తీరా ఎన్నికలు వస్తుండటంతో కొత్త నాటకాలకు తెరలేపడాన్ని జనం అసహ్యించుకుంటుండటం విదితమే.
బీజేపీ సీఎంలకు కితాబు: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు వదులుకోలేరన్న కేసీఆర్.. అందుకు ఉదాహరణగా బీజేడీ, బీజేపీ సీఎంలను పేర్కొనడం గమనార్హం. ‘‘మన పక్కనే ఒడిశాలో బీజేడీ వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో గెలిచింది. ఐదోసారి కూడా ఆయనే(నవీన్ పట్నాయకే) గెలుస్తాడు. ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ముఖ్యమంత్రులు విజయవంతంగా మూడో టర్మ్ పూర్తిచేసుకున్నారు. మంచిచేస్తే జనమే నాయకుల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. తప్పుచేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు’’ అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment