మహానాడుకు నన్ను పిలువలేదు: మోత్కుపల్లి | Motkupalli Narasimhulu Absent to Telangana TDP Mahanadu | Sakshi
Sakshi News home page

మహానాడుకు నన్ను పిలువలేదు: మోత్కుపల్లి

Published Thu, May 24 2018 1:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

Motukupalli Narasimhulu Absent to Telangana TDP Mahanadu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇద్దరు సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గురువారం టీటీడీపీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అయితే ఈ మహానాడుకు పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులతో పాటు మరో నేత ,ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మోత్కుపల్లి, కృష్ణయ్య మహానాడుకు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాలు విస్తృతంగా చర్చించుకుంటున్నాయి.

కాగా తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి నరసింహులు  చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లిని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నారని సమాచారం.

మరో వైపు మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్‌ఎస్‌లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి.

నన్ను పిలువలేదు: మోత్కుపల్లి

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడుకు హాజరుకాకపోవడంపై సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గురువారం జరుగుతున్న టీటీడీపీ మహానాడులో మోత్కుపల్లితో పాటు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య పాల్గొనలేదు. ఈ అంశంపై మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీటీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం అందలేదు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారనుకున్నా.. అది జరుగులేదు.. అందుకే దూరంగా ఉన్నాను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నా వ్యాఖ్యలు టీటీడీపీ తప్పుగా అర్ధం చేసుకుంది. అధినేత చంద్రబాబుకే వివరణ ఇస్తానని చెప్పా. ఆరోజు నుంచి ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ కోరినా కలిసేందుకు అవకాశం దొరకటం లేదు’ అని వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement