కత్తులు దూసినా పొత్తులు తప్పవా! | political parties aliances for benifits | Sakshi
Sakshi News home page

కత్తులు దూసినా పొత్తులు తప్పవా!

Published Wed, Oct 11 2017 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

political parties aliances for benifits - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్‌తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్‌ఎస్‌తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అప్పుడే రాజకీయ పార్టీలలో పొత్తుల ముచ్చట జోరందుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచిస్తున్న విధంగా జమిలి ఎన్నికలు జరిగేటట్టయితే 2018 చివరలోనే ప్రజా తీర్పు కోరవలసి ఉంటుంది. ఈ ముందస్తుకైనా ఏడాది సమయం ఉంది. ఎక్కడైనా బలహీనంగా ఉన్న పార్టీలే పొత్తుల గురించి ఎక్కువ ఆలోచిస్తాయి. బలహీనం అంటే సిద్ధాంతరీత్యా కాక ఎన్నికలలో ప్రజాబలం రీత్యా అని అర్ధం చేసుకోవాలిక్కడ. కొన్ని పార్టీలైతే రెండు విధాలా బలహీనంగా ఉంటాయి. వాటికి పొత్తులు మరీ అవసరం. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కొన్ని పార్టీలలో ఈ పొత్తుల వెంపర్లాట అప్పుడే బాహాటంగా కనిపిస్తున్నది. మరికొన్ని పార్టీలు లోపల ఆందోళన పడుతున్నా, దానిని బయట పడనీయకుండా గుంభనంగా ఉన్నాయి.

చంద్రబాబు స్వయంకృతం
2014లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తు పెట్టుకున్నాయి. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో మాత్రం ఆ ఎన్నికలలో అరకొర విజయంతో సరిపెట్టుకోవడమే కాకుండా, ఈ మూడేళ్లలో చిరునామా లేకుండా పోయింది. దానికి కారణం ప్రజలు నిరాకరించడం కాదు. అది ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు చేజేతులా కొనితెచ్చుకున్న దీనావస్థ. ఈసారి ఎన్నికలలో మాత్రం తెలంగాణలో తెలుగుదేశంతో కలసి పోటీ చేసే సమస్యే లేదని బీజేపీ రాష్ట్ర శాఖ బహిరంగంగానే చెబుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ లోలోపల గొణుక్కుం టున్నది. పొత్తు గురించి అక్కడ స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. పొత్తుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే ఎక్కువ కదలిక కనిపిస్తున్నది. ఇతర పార్టీలలో కంటే తెలుగుదేశంలోనే ఆ హడావుడి మరీ ఎక్కువగా కనిపించింది గతవారం. ఈ హడావుడి గురించే చంద్రబాబునాయుడు స్వయంగా హైదరాబాద్‌కి వచ్చి ప్రస్తుతానికి ఆపండని చెప్పి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఆదివారం నాడు ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్యులను సమావేశపరచి సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం అందరితో చర్చించి పొత్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందనీ, అప్పటిదాకా ఎవరూ నోరు మెదపవద్దని చెప్పారనీ ఆ వార్తల సారాంశం.

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కలసి పోటీ చేస్తే బాగుంటుందనీ, వీరితో బీజేపీ కూడా కలిస్తే మరింత మెరుగ్గా ఉంటుందనీ ఒక ప్రచారం ఈ మధ్యనే మొదలైంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మా విజయం అప్రతిహతం. కాబట్టి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అనవచ్చు. అందుకు రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను ఉదాహరణగా చూపవచ్చు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఇటీవలనే జరిగిన ఎన్నికలను ఉదహరించవచ్చు. సింగరేణిలోని 11 డివిజన్‌లలో టీబీజీకేఎస్‌ 9 గెల్చుకున్న మాట నిజమే కానీ, ఓట్ల సంగతేంటి? ఓట్లేసిన సింగరేణి కార్మికులలో 50 శాతానికి పైగా అధికార పక్షానికి చెందిన కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఓటేసిన విషయం మరచిపోకూడదు. అధికార పక్షం భూమ్యాకాశాలను తలకిందులు చేసినా ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడంతో ఈ ఫలితం వచ్చిందన్న విషయం గ్రహించలేనంత అమాయకులు కాదు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు.

ఫలితాలు వెలువడగానే నిర్వహించిన పత్రికా గోష్టిలో ఆయన మాట్లాడిన తీరును బట్టే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గెలిచాం కదా అని విర్రవీగకూడదు, ఒదిగి ఉండాలి అని చెపుతూనే, నెహ్రూ నుంచి సోనియాగాంధీ దాకా కాంగ్రెస్‌ మీద ఆయన విరుచుకుపడిన తీరు, మొట్టమొదటిసారిగా కోదండరాం పట్ల ప్రదర్శించిన తీవ్ర అసహనం సింగరేణి ఫలితాన్ని ఆయన ఎట్లా చూస్తున్నారో స్పష్టం చేస్తున్నది. అదే పత్రికా గోష్టిలో ఆయన టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత, ఇతర నాయకులు సరిగా పని చేయలేదని కూడా తెరాస నేత ఆక్షేపించారు. నిజానికి స్థానికంగా టీబీజీకేఎస్‌ నాయకత్వం పట్ల కార్మికులలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని సంకల్పించినా, అధినేతకు ఎంతటి జనాకర్షణ ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా లేకపోతే గెలుపు అంత సులభం కాదని చెప్పడానికి సింగరేణి ఎన్నికల ఫలితం మంచి ఉదాహరణ.

కేసీఆర్‌ వ్యూహం ఏమిటో?
ఈ పరిస్థితులలో ప్రస్తుతం మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని అధికార టీఆర్‌ఎస్‌ చెప్పినా, ఎన్నికలు సమీపించే నాటికి కేసీఆర్‌ వ్యూహం ఎట్లా ఉండబోతున్నదో ఊహించవచ్చు. ఇప్పటికైతే ఆయనకు దీటైన నాయకుడు ఎవరూ ప్రతిపక్షాలలో కనిపించడంలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అని ముఖ్యమంత్రి వేసిన ఎదురు ప్రశ్నలో చాలావరకు వాస్తవం ఉన్నా, ఆ పార్టీకి తెలంగాణలో ఒక వర్గం మద్దతు ఇప్పటికీ ఉన్నదన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఆ సామాజిక వర్గం ప్రస్తుతానికి మచ్చిక అయినట్టు కనిపిస్తున్నా, దానిని పూర్తిగా నమ్మడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే వీలయినంత ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోడానికీ లేదా తటస్థం చెయ్యడానికీ ఏ అవకాశం వచ్చినా వదులుకోవడంలేదు. మొన్నటికి మొన్న ప్రత్యేక విమానంలో ఆ సామాజిక వర్గానికే చెందిన నాయకులనూ, ఒక పత్రిక యజమానినీ వెంట పెట్టుకుని అనంతపురంలో పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే మానవబాంబునవుతానని బెదిరించి, డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన మరునాడే జేసీ దివాకర్‌ రెడ్డితో కలసి ఆంధ్రప్రాంతానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను సేకరించడంలో ప్రధాన పాత్ర వహించిన పయ్యావుల కేశవ్‌తో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్‌తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్‌ఎస్‌తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబునాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. తద్వారా పార్టీ శ్రేణులలోకీ, ప్రజలలోకీ ఎట్లాంటి సంకేతాలు వెళతాయో చూద్దామని ఆయనే ఈ ఆలోచనను ప్రచారంలోకి తెచ్చారని సమాచారం. తీరా గందరగోళం అయ్యేసరికి ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ వ్యతిరేకతే పునాదిగా ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పడినది తెలుగుదేశం పార్టీ. కానీ రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలో అదే కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టపట్టాలు వేసుకుని తిరిగేట్టు చేసినవారు చంద్రబాబు. అంతకుముందు 2009లో కాంగ్రెస్‌ను ఓడించడం కోసం టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలసి మహాకూటమి కట్టారు. అయినా ఓడిపోయారు. ఒకచోట అధికారాన్ని నిలుపుకోవడానికీ, మరొకచోట అస్తిత్వాన్ని కాపాడుకోడానికీ ఏ పార్టీతో అయినా చంద్రబాబు జత కడతారనడానికి ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా మిగిలిపోతారా అనేది 2019 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి.

ఆయన ఖేదం, ఈయన నిర్వేదం
మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు. తనకు గవర్నర్‌ పదవి వస్తుందనీ, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి చంద్రబాబునాయుడు ఆ పదవి ఇప్పిస్తారని కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మోదీ నాకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు, ఇక గవర్నర్‌ పదవి ఏమిస్తారని మొన్నటి సమావేశంలో చంద్రబాబునాయుడు ఒక నిట్టూర్పుతో సరిపెట్టారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేయవచ్చునన్న మాట చెప్పింది ఈ నర్సింహులు గారే. దానికి ఆయన ఒక సూత్రీకరణ కూడా చేశారు. మనది కాంగ్రెస్‌ వ్యతిరేక పునాది మీద ఏర్పడిన పార్టీ కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే ఈ ప్రతిపాదన అన్నారు. అదే ఎన్టీ రామారావును దుర్భాషలాడి పార్టీ నుంచి వెళ్లిపోయి స్వతంత్రంగా పోటీ చేసిన నాయకుడు, కొంతకాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగి తిరిగొచ్చిన నాయకుడు నర్సింహులు ఈ కాంగ్రెస్‌ వ్యతిరేకత సూత్రాన్ని ముందుకు తేవడం ఆశ్చర్యకరం. పలికినవాడు నర్సింహులు పలికించినవారెవరో మనకు తెలుసు.

‘టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు’ అన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. తీవ్రమైన టీఆర్‌ఎస్‌ వ్యతిరేకత ఆయనను ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి కొంత దగ్గర చేసింది. అవసరార్థం కాంగ్రెస్‌తో కలవడంలో తప్పు లేదన్న సూత్రం నీవు నేర్పిన విద్యయే కదా అని ఆయన ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి అదృష్టం కొద్దీ చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో ఫోన్‌ సంభాషణలో దొరికారు కానీ, లేకుంటేæ రేవంత్‌ను ఒంటరిని చేసి ఆ వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదని పార్టీ నుంచి వెళ్లగొట్టి ఉండేవారు. రేపటి రోజున నర్సింహులు ప్రతిపాదనలే కార్యరూపం దాలిస్తే రేవంత్‌ రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గం కాంగ్రెస్‌ తప్ప మరొకటి లేదు. అయితే అక్కడ ఆయన క్యూలో నిలబడే నాయకుల్లో ఏ వందో వాడో అవుతారు. ‘రెంటికీ చెడ్డ రేవంత్‌’ కాకూదదనుకుంటే కాంగ్రెస్‌ వరుసలో నిలబడక తప్పదేమో!

దీర్ఘకాలం వెనుకబడిన తరగతుల వారికోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ నాయకుడు, తెలంగాణ తెలుగుదేశం 2014 సీఎం అభ్యర్థి, శాసనసభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో కొనసాగనేమో అని ఇటీవలే ఒక సభలో ప్రకటించారు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఆయన ప్రకటనతో అర్థం అయిపోలేదా?


దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement