‘టీడీపీ గొంతు శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే’
అమరావతి: అధికారపార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందని, ఊరు మారినా.. తీరు మారలేదని, గత మూడేళ్ల దుష్ట సంప్రదాయాన్ని కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగించిందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంఖ్యాబలం ఉందని, అధికార మంద బలంతో శాసనసభలో అధికారపార్టీ నియంతలా వ్యవహరించి ప్రజావాణిని వినిపించే ప్రతిపక్ష గొంతు నొక్కేశారన్నారు. ఏ ప్రజా సమస్యపైన కూడా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని పట్టుమని రెండు నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా మైక్ కట్ చేయడం ద్వారా అధికారపార్టీ నియంతృత్వ ధోరణిని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయిందన్నారు.
ఇదే సమయంలో ఆయా అంశాలతో సంబంధంలేని అధికార పార్టీ వ్యక్తులకు మైక్ ఇచ్చి గంటల తరబడి వ్యక్తిగత దూషణలతో విలువైన సభసమయాన్ని అధికారపార్టీ దుర్వినియోగం చేసిందంటూ దుయ్యబట్టారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ సభ్యులమైన తాము అధ్యక్షా మైక్... అధ్యక్షా మైక్... అంటూ పోడియం చుట్టిముట్టి పోరాడితేకానీ మైక్ ఇచ్చేవారు కారని, ఇచ్చిన 30 సెకన్లలోనే తిరిగి మైక్ కట్ చేసి సభను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు.
కీలక ప్రజా సమస్యలైన అగ్రిగోల్డ్, పదవి తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్, ఆక్వాఫుడ్స్ కార్మికుల మరణాలు, రైతులు గిట్టుబాటు ధరలు, మైనార్టీల సంక్షేమం, అంగన్‌వాడీ సమస్యలు, విద్యార్థుల సమస్యలు వంటి ఏ సమస్యపై మాట్లాడదామన్నా మైక్ ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేశారన్నారు.
ఈ నియంతృత్వ విధానానికి ప్రజలు చెప్పాల్సిన చోట, నొక్కాల్సిన చోట నొక్కడం ద్వారా ప్రజాక్షేత్రంలో టీడీపీ గొంతును శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికార పక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా దానికి రెట్టించిన ఉత్సాహంతో ప్రతిపక్ష పార్టీ నేతగా వైఎస్ జగన్ ప్రజా గొంతును వినిపిస్తూనే ఉంటారన్నారు.