టీడీపీ లక్ష్యం ‘సాక్షి’
► మహిళలపై స్పీకర్ మాటలను వక్రీకరించారని అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల విమర్శలు
► ఎడిటర్, పబ్లిషర్‌ను సభకు పిలవాలని డిమాండ్
► సాక్షి పత్రిక, చానల్‌పై చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
► స్పీకర్ వజ్రాయుధం బయటకు తీయాలి: శ్యామ్‌సుందర్ శివాజీ
► స్పీకర్ కోడెల ప్రెస్‌మీట్ అసెంబ్లీ టీవీలో ప్రదర్శన
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సాక్షి పత్రిక, టీవీ చానల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం శాసనసభలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చను పక్కదారి పట్టించిన టీడీపీ ఎమ్మెల్యేలు ‘సాక్షి’పై విమర్శలకు దిగారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాత్ర ఉందని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దీంతో చర్చను పక్కదారి పట్టించాలని టీడీపీ సభ్యులు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్ అంశాన్ని సభలో తెరపైకి తెచ్చారు.జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీన ప్రెస్‌మీట్‌లో స్పీకర్ చేసిన ప్రసంగాన్ని (రికార్డు) అసెంబ్లీ టీవీలో ప్రదర్శించారు. అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి రాయడం, చూపడం ద్వారా ‘సాక్షి’ పత్రిక, టీవీ చానల్ స్పీకర్ గౌరవానికి భంగం కలిగించాయని అధికార పక్ష సభ్యులు ఆరోపించారు. అందువల్ల సాక్షి పత్రిక, చానల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇతర పత్రికలు, చానళ్లు కూడా ప్రసారం చేశాయి: చంద్రబాబు
‘‘నేను అనని మాటలను అన్నట్లుగా రాయడం నాకు బాధ కలిగించింది. సోషల్ మీడియాలో కూడా మా కుటుంబ సభ్యులపై లేనిపోనివి రాయడం అన్యాయం, అక్రమం, అనైతికం’’ అని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రతిపక్ష సభ్యులున్నప్పుడు మరోసారి ఈ వీడియోను అసెంబ్లీ టీవీలో ప్రసారం చేసి, కారకులపై చర్యలు చేపట్టేలా సభ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను సాక్షితోపాటు ఇతర పత్రికలు రాశాయని, ఇతర చానళ్లు కూడా ప్రసారం చేశాయని పేర్కొన్నారు. నిజానికి ఆ రోజు తాను స్పీకర్‌కు ఫోన్‌చేసి ఆరా తీశానన్నారు.
తాను ఆ మాటలు అనలేదని స్పీకర్ చెప్పారన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభలోకి వచ్చాక వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సభను, స్పీకర్‌ను అగౌరవపరిచేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి, అనిత, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్‌రాజు తదితరులు ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమన్లు జారీ చేసి ఎడిటర్‌ను, పబ్లిషర్‌ను సభకు పిలవాలన్నారు. మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ మాట్లాడుతూ... స్పీకర్‌కు ఉన్న వజ్రాయుధాన్ని బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైందంటూ పురాణ గాథను వినిపించారు.
గురువారం అసెంబ్లీ టీవీలో ప్రసారం చేసిన స్పీకర్ ప్రెస్‌మీట్‌లోని ముఖ్యమైన అంశమిదీ...
ఏడో తరగతి నుంచి విద్యార్థులకు తప్పనిసరి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సుల నిర్వహణపై మహిళా పార్లమెంట్ సదస్సులో తీర్మానం చేస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పీకర్ సమాధానమిచ్చారు. ఆయన ఏం అన్నారంటే...
‘‘ఒక వెహికల్ కొన్నారనుకోండి. ఇంట్లో షెడ్‌లో పెడితే యాక్సిడెంట్లు జరగవు కదా! బజారుకు పోతే, రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువవుతుంది. 50 కిలోమీటర్లు తక్కువ స్పీడ్. అలా వెళితే యాక్సిడెంట్లకు అవకాశం తక్కువ. 100 కిలోమీటర్ల వేగంతో పోతే అవకాశం ఎక్కువవుతుంది. అట్లాగే ఆడపిల్లలు హౌస్‌వైవ్స్‌గా ఉండి గతంలోలాగే ఉంటే వాళ్లమీద ఏమీ జరగవు. వాళ్లు(ఆడపిల్లలు) ఇవాళ చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్‌పోజ్‌డ్ టు ది సొసైటీ.
లా ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఈవ్‌టీజింగ్ కావచ్చు, వేధింపులు కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు కావచ్చు. అలా ఇళ్లలో నుంచి బయటకు పోకపోతే జరగవు. కానీ, అంతమాత్రం చేత ఆడపిల్లలు మళ్లీ ఉన్నది ఎందుకు? పోవాలి. ధైర్యంగా పోవాలి. ధైర్యంగా చదవాలి. ఉద్యోగాలు చేయాలి. సో.. దానికి తోడు వాళ్లకు కుంగ్‌ఫూ ఒక్కటే కాదు. కుంగ్‌ఫూ ఇలాంటి ఆత్మరక్షణ మెకానిజం ఒక ఎత్తయితే, దానికంటే వాళ్లలో ధైర్యం రావాలి. ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలి’’ అని స్పీకర్ కోడెల ప్రెస్‌మీట్‌లో వివరించారు. మధ్యాహ్నం 1.55 గంటల నుంచి 2.05 గంటల వరకూ స్పీకర్ ప్రెస్‌మీట్‌ను టీవీలో ప్రసారం చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులెవరూ సభలో లేరు. అంతకుముందే బయటకు వెళ్లిపోయారు.
ఇతర పత్రికలు, చానళ్లను వదిలేసిన టీడీపీ
స్పీకర్ ఫిబ్రవరి 8వ తేదీన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలనే సాక్షి పత్రిక ఫిబ్రవరి 9వ తేదీన ప్రచురించింది, టీవీ చానల్ ప్రసారం చేసింది. అలాగే ఇతర పత్రికలు, చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. అయినప్పటికీ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు, నేతలు ఇతర పత్రికలు, చానళ్లను వదిలేసే సాక్షిపైనే గురిపెట్టడం గమనార్హం.