సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నిత మనస్కులని, ఏదైనా కష్టం వస్తే బాధపడతారేగానీ, ఆందోళనల పేరుతో రోడ్ల మీదికి రారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేశారు. కేంద్రంతో తాడోపేడో తలేల్చుకుంటామని నిన్నంతా లీకులిచ్చిన ఆయన.. ప్రత్యేక హోదాపై మళ్లీ పాతపాడేపాడారు. పైగా కేంద్రం ఏమీ ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు.
పది రూపాయలు నష్టం జరిగినా ఫర్వాలేదు కానీ ఆత్మాభిమానం, హక్కును కాదన్నప్పుడు మాత్రం ఎక్కడలేని బాధ, వ్యధ కలుగుతుందని, నాలుగేళ్ల తర్వాత తనదిప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితేనని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై సీఎం సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుపడిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బాబుపై బీజేపీ ఫైర్, టీడీపీ ఎదురుదాడి : ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : పోలవరం, వృద్ధిరేటు, కేంద్ర సాయం తదితర అంశాలపై సీఎం మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ‘పోలవరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న ముఖ్యమంత్రి మాటలు నిజం కాదు. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఒక వేళ సీఎం చెప్పినట్లు బిల్లులు ఆగితే.. ఆ వివరాలు నాకివ్వండి.. నేను క్లియర్ చేయిస్తా’నని విష్ణుకుమార్ రాజు అనగా, ‘రాష్ట్రంలో ఇంత వెనుకబాటు ఉంటే, రెండంకెల వృద్ధిరేటు ఎలా చూపుతారు? అందువల్లే కేంద్రం సాయానికి వెనుకడుగు వేస్తున్నదేమో!’ అని మరో బీజేపీ సభ్యుడు అన్నారు. హోదా రాష్ట్రాలకు 2020 దాకా పన్ను మినహాయింపులు ఇచ్చారన్న సీఎం వ్యాఖ్యలకు.. ‘ అది కాలపరిమితికి లోబడి తీసుకున్న నిర్ణయమేగానీ, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు’ అని ఇంకో సభ్యుడు పేర్కొన్నారు. ఇలా బీజేపీ నేతలు మాట్లాడిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా లేచి కాసేపు ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీజేపీకి సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు..
ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : ‘‘కేంద్ర సాహాయం లేకపోయినా, ఏపీ రెండంకెల వృద్ధిరేటు (11.3 శాతం) సాధించినందుకు యావత్ దేశం గర్వపడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కారణంగా నిధులు రావడంలేదనడం సరికాదు. కోఆపరేటివ్ ఫెడరలిజంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలి. కానీ కేంద్రం మన డబ్బును తీసుకెళ్లి మధ్యప్రదేశ్‌లో ఖర్చుపెడుతోంది! 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నారు. సరేనని మేం ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు కేంద్రం.. హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు 2020 దాకా పన్నుల మినహాయింపులను పొడిగించడం దారుణం’’ అని చంద్రబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment