- అసెంబ్లీలో సీఎం డైరెక్షన్... చీఫ్ విప్ యాక్షన్
- విపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా వాయిదా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: శాసనసభలో పార్టీలకు అతీతంగా తటస్థంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థానాన్ని అధికార టీడీపీ శాసిస్తోంది. సభను ఎలా నడిపించాలో, ఎప్పుడు వాయిదా వేయాలో, సభలో మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వొద్దో అన్నీ నిర్దేశిస్తోంది. బుధవారం అసెంబ్లీలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించడం ప్రజాస్వామ్యవాదులను నివ్వెరపరిచింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు యాక్షన్‌లోకి దిగారు. సీఎం కోరుకున్నట్లే సభ వాయిదా పడింది. అసెంబ్లీ నిబంధనలను సవరిం చాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు లేచి ప్రతిపక్ష నేత జగన్‌కి మైక్ ఇవ్వొద్దని, సభా సంప్రదాయాలపై రూలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు లేచి విపక్ష నేతకు మైక్ ఇవ్వొద్దని మంత్రి చెప్పడం సరికాదన్నారు. జల సంరక్షణపై విపక్ష నేత ప్రతిజ్ఞ చేసేందుకే వచ్చారేమో అనగానే సీఎం ఆదరాబాదరాగా లేచి విపక్షం చేద్దామంటే (వారి అభిప్రాయం అడగకుండానే) రెండోసారి ప్రతిజ్ఞ చేద్దాం, లేవండి.. అని అధికార పక్ష సభ్యులను కోరా రు. వారు లేవగానే బాబు తన వెనుక నిల్చు ని ఉన్న చీఫ్ విప్ శ్రీనివాసులుతో ‘ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించు’ అని సూచించారు. దీంతో కాలువ తల ఊపుతూ, చేయి తిప్పుతూ స్పీకర్‌కు సైగ్ చేశారు. సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేయడం గమనార్హం. ఈ దృశ్యాలు వీడియోలో కనిపించాయి.