మే 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి | After May 15 From TDP To YSRCP | Sakshi
Sakshi News home page

మే 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి

Published Mon, Apr 23 2018 5:48 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

After May 15 From TDP To YSRCP - Sakshi

విశాఖ ఎంపీ కె.హరిబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు(పాత చిత్రం)

విశాఖపట్నం : అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్‌ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత విషయం అని విష్ణుకుమార్‌ రాజు తెలిపారు..  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. టీడీపీతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. టీడీపీ కుటుంబ పార్టీ అని, మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు.

 దోపిడీపై ఉద్యమించేవారికి కాంగ్రెస్‌తో పనేంటి? : విశాఖ ఎంపీ హరిబాబు

దోపిడీపై  ఉద్యమిస్తామంటున్న కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తామనడంలో ఆంతర్యం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని, ముద్రా రుణాలు కోట్ల మంది ప్రజలకు ఇస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతోన్న ప్రధాని మోదీపై ఎలా విమర్శలు చేస్తారని సూటిగా అడిగారు. ఇరవైకి పైగా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని సీపీఎం మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్కప్పుడు రెండో స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అట్టడుగు స్థానానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఒంటరిగా రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృశ్యా మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు. ఏపీలో అధికార, ప్రతిప్రక్షాలు తమపై విమర్శలు చేస్తుంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను...అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఐబీ అధికారులు రాజకీయ నాయకులను కలవడం సహజమని, కేంద్రం అనవసరంగా ఎవ్వరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని తేల్చిచెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement