సాక్షి, కర్నూలు : ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ యువతను సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిల్పాచక్రపాణి రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌లు దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాస్తవానికి పది శాతం మంది నిరుద్యోగులకు కూడా భృతి అందడం లేదని చెప్పారు. గతంలో సుమారు రెండు కోట్ల మందికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, నాలుగేళ్ల తర్వాత కేవలం 12 లక్షల మందికి రూ. వెయ్యి చొప్పున భృతి కల్పిస్తామని యూటర్న్ తీసుకున్నారని వివరించారు.
నయవంచనకు, మోసానికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో ప్రభుత్వం చేసిన ప్రకటన కోట్లాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.80 లక్షల ఖాళీలు ఉంటే కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడమేంటని నిలదీశారు. పదవి కోసం బూటకపు హామీలు ఇచ్చిన బాబు పప్పులు ఇక ఉడకవని పేర్కొన్నారు.
కాపులు మొదలుకుని మైనార్టీల దాకా అందరినీ బాబు మోసం చేశారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రకు కాపు సోదరులు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏ సామాజికవర్గ హక్కులకు, డిమాండ్లకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్లు ప్రకటించడం వైఎస్ జగన్ దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. చైతన్యవంతులైన ప్రజలు ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త టీడీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment