సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 45వేల కోట్ల రూపాయలను బీసీలకు కేటాయించి బీసీ కార్పోరేషన్, చైర్మన్‌లను ఏర్పాటు చేశారన్నారు. ఇది తెలిసి టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌పై 23 ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలపై చట్టపరమైన విచారణ కొనసాగుతోందని చెప్పారు. బీసీలతో ఓటు వేయించుకోని వారిని మోసం చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముసుగులో జిల్లాలో కొందరు నేతలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
అలాగే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. బీసీ అభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయలను సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది మానుకోవాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపణలపై విచారణలో నిజాలు తెలియాల్సి ఉందని, ఈ వ్యవహారంలో టీడీపీ అనుబంధం.. బీసీ సంఘాల తీరును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులపై సైతం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి పరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment