‘వైఎస్సార్‌ సీపీ ప్రొడక్ట్స్‌పై టీడీపీ మమకారం’ | BY Ramaiah Slams Nara Lokesh In Kurnool | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ సీపీ ప్రొడక్ట్స్‌పై టీడీపీ మమకారం’

Published Tue, Jul 10 2018 3:14 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

BY Ramaiah Slams Nara Lokesh In Kurnool - Sakshi

బీవై రామయ్య

సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి ఫిరాయించిన వారికి సీట్లను కేటాయింపు చేయడంతో టీడీపీ డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ఇప్పటికే రాజకీయ వ్యభిచారం చేస్తున్న సీఎం చంద్రబాబు బాటలోనే లోకేష్‌ రాజకీయ ప్రయాణం సాగుతుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రొడక్టులపై టీడీపీ అధినాయకత్వం బాగానే మమకారం పెంచుకున్నట్లు ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఫిరాయింపుదారులను టీడీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు.

కర్నూలులో 14 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ గెలవబోతోందని పేర్కొన్నారు. జిల్లాను ఐటీ హబ్‌గా మారుస్తానని బీరాలు పలికిన లోకేష్‌ ఆ దిశగా ఒక్క అడుగైనా వేశారా? అని ప్రశ్నించారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఉన్నా వారికి ఐటీ ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రిబ్బన్‌ కటింగ్‌లు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది కర్నూలు జిల్లా అయితే, నాలుగేళ్లుగా ఇంఉకోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే వన్‌ కంట్రీ-వన్‌ ఎలక్షన్‌ (జమిలీ ఎన్నికలు)కు టీడీపీ భయపడుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement