చంద్రబాబు ‘మాయాబజార్’ చూపిస్తున్నారు
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నంద్యాలలో ‘మాయాబజార్’ చూపిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికతో టీడీపీ ఊహలు తారుమారు అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందన్నారు.
టీడీపీని గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, వైఎస్‌ఆర్ సీపీ గెలిస్తే అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందని అంబటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని అంబటి కోరారు. ఉప ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.
పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... నంద్యాలలో రేపు (గురువారం) ఎస్పీజీ గ్రౌండ్స్‌లో జరిగే వైఎస్‌ఆర్ సీపీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారని తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఈ నెల 4న నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. అలాగే జగన్ సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీలో చేరతారని చెప్పారు.
శిల్పా చక్రపాణిరెడ్డికి ఏ పదవి ఆశ చూపలేదని అన్నారు. మూడేళ్లుగా చంద్రబాబుకు నంద్యాల గుర్తులేదా, ఉప ఎన్నిక సందర్భంగానే ఆయనకు నంద్యాల గుర్తుకొచ్చిందా అని బొత్స ప్రశ్నించారు. నంద్యాలకు, మైనార్టీలకు తాము ఏం చేస్తామో రేపు వైఎస్ జగన్ చెప్తారని, తాము చేసేదే చెప్తామని, చెప్పిందే చేసి చూస్తామన్నారు. చంద్రబాబులాగా నేతలకు గాలం వేయమని బొత్స సత్యానారాయణ అన్నారు.