సాక్షి, విశాఖపట్నం: తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయరని, పదవులు వదులుకోరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంటులోనే ఉండి పోరాటం చేస్తారని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం గ్రామ స్తులతో రచ్చబండ సమావేశాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత ఉప్పలం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.1.46 లక్షల కోట్ల లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం లెక్కతేల్చింది. కానీ కేంద్రం ఇప్పటి దాకా రూ.22,500 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.1.24 లక్షల కోట్ల లోటు ఉంది. దీనికి తోడు మొదటి సంవత్సరం రూ.16,500 కోట్ల లోటు ఉంటే రూ.4 వేల కోట్లే ఇచ్చారు’ అని సీఎం చెప్పారు.
రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రధాని మోదీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. హోదా ఒక్కటే కాదు.. రాజధాని నిర్మాణానికి కూడా డబ్బులిస్తామని చెప్పారన్నారు. విశాఖకు రైల్వే జోన్, కడపలో స్టీల్‌ప్లాంట్.. ఇలా అనేక హామీలిచ్చారని వివరిం చారు. కానీ వీటిలో ఒక్క హామీని కూడా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. అందుకే ఎన్డీఏతో విబేధించి, కేంద్రం నుంచి బయటకొచ్చామని చెప్పారు. రాజధాని, పోలవరానికి నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు.
బీసీలకే మొదటి ప్రాధాన్యం!
వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని.. వారి కోసం రూ.750 కోట్లు ఖర్చు పెట్టిఆదరణ పథకం కింద పరికరాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన మొదటి ప్రాధాన్యత బీసీలకేనని చెప్పుకొచ్చారు. అలాగే కాపులకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంటుందని.. ఇందుకోసం కేంద్రానికి సిఫార్సు చేశామన్నారు.
ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుల్లాగానే.. రిజర్వేషన్ల అంశం కూడా కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే మీరు మాట్లాడరా? అని వైఎస్సార్‌సీపీని ప్రశ్నించారు. అలాగే మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని కూడా కేంద్రానికి సిఫార్సు చేశామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే.. వైఎస్సార్‌సీపీ, జనసేన ఎన్డీయేతో లాలూచీ పడి అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని సీఎం మరోసారి చెప్పుకొచ్చారు.
తాను పట్టించుకోకపోతే హైదరాబాద్‌కు ఇంత గుర్తింపు వచ్చేది కాదన్నారు. అలాగే ఏపీని కూడా అభివృద్ధి చేసి.. ప్రపంచ పటంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతానన్నారు. కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ అతిపెద్ద కుంభకోణం..
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి రాకముందు జరిగిన అతిపెద్ద కుంభకోణం అగ్రిగోల్డ్ స్కామ్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులున్నారని పేర్కొన్నారు. ఒక్క ఏపీ నుంచే రూ.3,941 కోట్ల విలువైన డిపాజిట్లున్నాయని.. అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో 43 మంది అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ నుంచి ప్రతి పైసా వసూలు చేసి, బాధితులకు అందజేస్తామన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఏడు ఆస్తులను వేలం వేయడానికి హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపారు. వాటిలో ఒకదానికి సంబంధించి కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో రూ.11 కోట్ల 11 లక్షలు వచ్చాయని చెప్పారు. మిగతా ఆరు ఆస్తులకు సంబంధించి వేలంలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదని సీఎం వివరించారు.
అగ్రిగోల్డ్ బాధిత సంఘాలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని, ప్రభుత్వం తరఫున న్యాయ సహాయం అందిస్తామన్నారు. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.30 వేల కోట్లు ఉన్నాయని ప్రతిపక్ష నేత ఆరోపిస్తుంటే ఎందుకు ఖండించలేదని బాధిత సంఘాల నాయకులను సీఎం దబాయించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్, సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ గార్గ్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment