Kambhampati Haribabu
-
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
వ్యవసాయ ప్రగతిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడురోజులు నిర్వహిస్తున్న 4వ ఆర్గానిక్మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులు కష్టపడినంతగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ దేశం 4.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌లో సాధిస్తున్న పురోగతే కారణమని చెప్పారు. విదేశీమారక ద్రవ్యలోటును తీర్చగలిగే శక్తి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎగుమతి అవకాశాలున్న పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయన్నారు. బియ్యం, పత్తి, పసుపు, పప్పుధాన్యాలు, అల్లం, పొగాకు ఇలా ఇక్కడ పండేవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. అరుకు కాఫీకి ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఎగుమతి చేయని స్థాయిలో ఏటా రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు అమెరికా తదితర దేశాలకు ఎగుమతవు తున్నాయన్నారు. డెయిరీ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన భీమవరం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలను అదే ప్యాకింగ్‌తో అమెరికా వాల్‌మార్ట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. అదేరీతిలో మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాల్లో మన బ్రాండింగ్‌తో అమ్మే స్థాయికి ఎదగాలన్నారు. సేంద్రియ సాగును ప్రోత్సహించాలి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుని మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలన కోరారు. జిల్లాల వారీగా లభించే ఉత్పత్తులు (డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్టస్)ను గుర్తించి అవి ఇతరదేశాలకు ఎగుమతి అయ్యేలా జిల్లాల మధ్య పోటీవాతావరణం తీసుకురావాలని చెప్పారు. డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగడమే కాదు.. ప్రపంచపటంలో నిలబడుతుందని చెప్పారు. సేంద్రియ సాగులో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. సేంద్రియ సాగును లాభసాటి చేయాలన్నారు. విదేశీమారక ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు పామాయిల్ సీడ్ మిషన్‌ను ప్రారంభిస్తున్న కేంద్రం పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకునేందుకు మొక్కజొన్న తదితర ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోది కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ రైతులు, పాత్రికేయులకు సత్కారం ఈ సందర్భంగా సేంద్రియ రైతులు తిప్పేస్వామి (అనంతపురం జిల్లా), రమణారెడ్డి (వైఎస్సార్), గంగాధరం (చిత్తూరు), పాపారావు (గుంటూరు), మలినేని నారాయణప్రసాద్ (కృష్ణా), ఝాన్సీ (పశ్చిమగోదావరి జిల్లా), తాతారావు, లక్ష్మీనాయక్ (జెడ్పీఎన్ఎఫ్), రాజ్కృష్ణారెడ్డి (ఉద్యానశాఖ ఏడీ), ధర్మజ (ఉద్యానశాఖ డీడీ), రామాంజనేయులు, సురేంద్ర (ఎన్జీవోలు), సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, మల్లిఖార్జున్, సుబ్బారావు, శ్రీనివాసమోహన్లను సత్కరించారు. ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవిచౌదరి, రైతుసాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్, ఆర్గానిక్మేళా నిర్వహణాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం కుమారస్వామి, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ స్థాయి నుంచి గవర్నర్ గా..
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులవడంపై విశాఖలో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు. ఏయూ విద్యార్థి నుంచి ప్రొఫెసర్ వరకు.. హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953, జూన్ 15న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశారు. పీహెచ్డీ పట్టా కూడా ఏయూ నుంచే పొందారు. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యార్థి నాయకుడిగా.. విద్యార్థి దశలోనే నాయకుడిగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్‌కు సెక్రటరీ అయ్యారు. 1975–75లో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు, ముషీరాబాద్ జైలులో 6 నెలలు ఉన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. విశాఖ–1 ఎమ్మెల్యేగా.. 1999లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి హరిబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003లో శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కూడా అక్కడే నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. 2014 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అభినందనల వెల్లువ గవర్నర్‌గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దసపల్లా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
రైల్వే జోన్‌పై చర్చలో రచ్చరచ్చ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించడానికి టీడీపీ మంత్రులు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సుజయ్‌కృష్ణా రంగారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని పీయూష్ గోయల్ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు కూడా రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకరికొకరు తారసపడడంతో అందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తాము కేంద్ర మంత్రితో రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు వెళ్తున్నామని, మీరు కూడా రండి అంటూ బీజేపీ ఎంపీ హరిబాబును టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించారు. తాము కూడా ఇదే అంశంపై చర్చించేందుకు వచ్చామని హరిబాబు చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రితో టీడీపీ నేతల సమావేశం సందర్భంగా బీజేపీ ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. జోనూ లేదు.. గీనూ లేదు అని వీడియో టేపులో దొరికిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు గడచిపోయాయని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జీవీఎల్‌ను ఎందుకు పిలిచారు? టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ఆయన రైల్వే జోన్‌పై మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. అసలు జీవీఎల్‌ను ఎందుకు పిలిచారంటూ టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంపీ హరిబాబు కల్పించుకుని సుజనా చౌదరి పిలిస్తేనే ఈ సమావేశానికి వచ్చామని చెప్పారు. దీనికి సుజనాచౌదరి అంగీకరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జోన్ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
‘ఎంపీ ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్‌నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. -
హరిబాబు ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
-
మోదీ మచ్చలేని నాయకుడు
సాక్షి, విజయనగరం : ప్రధాని నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడని విశాఖపట్నం ఎంపీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. శుక్రవారం విజయనగరంలో జరిగిన విసృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి అవసరమైన నాయకత్వం ఉందని తెలిపారు. కేంద్రం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పడి ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీ ఇచ్చే స్థితిలో ఉందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, నల్లధనాన్ని వెలికి తీయడంలో, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ తీసుకు రావడం జరిగిందని వెల్లడించారు. దీని వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని భావించామని, అందుకే విభజనకు అంగీకరించినట్లు తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. -
బాబు దీక్ష వల్ల రాష్ట్ర ఖజానాకు 20 కోట్ల నష్టం
-
మే 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి
విశాఖపట్నం : అధికార టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత విషయం అని విష్ణుకుమార్ రాజు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. టీడీపీతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. టీడీపీ కుటుంబ పార్టీ అని, మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. దోపిడీపై ఉద్యమించేవారికి కాంగ్రెస్‌తో పనేంటి? : విశాఖ ఎంపీ హరిబాబు దోపిడీపై ఉద్యమిస్తామంటున్న కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తామనడంలో ఆంతర్యం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని, ముద్రా రుణాలు కోట్ల మంది ప్రజలకు ఇస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతోన్న ప్రధాని మోదీపై ఎలా విమర్శలు చేస్తారని సూటిగా అడిగారు. ఇరవైకి పైగా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని సీపీఎం మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్కప్పుడు రెండో స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అట్టడుగు స్థానానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగా రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృశ్యా మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు. ఏపీలో అధికార, ప్రతిప్రక్షాలు తమపై విమర్శలు చేస్తుంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను...అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఐబీ అధికారులు రాజకీయ నాయకులను కలవడం సహజమని, కేంద్రం అనవసరంగా ఎవ్వరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని తేల్చిచెప్పారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
-
ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఈయనే!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధినాయకత్వం నియమించినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా పోరాటం ముమ్మరం కావడం, బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. హరిబాబు స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. శుక్రవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. పార్టీని దూకుడుగా నడిపించే వ్యూహంలో భాగంగా సోము వీర్రాజుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి.. పార్టీ విధేయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అనేక ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తున్న అనుభవం కూడా కలిసివచ్చినట్టు భావిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబును ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యునిగా అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఫైర్‌బ్రాండ్ నేత సోము వీర్రాజు పేరొందారు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ మొదటినుంచి ఆ పార్టీపై, సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలోని అవినీతిని, అవకతవకలను సోము వీర్రాజు ఎండగడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీని, చంద్రబాబును మరింత ఇరకాటంలో నెట్టేందుకు, ఏపీలో బీజేపీని బలమైన పార్టీగా నిలబెట్టేందుకు ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారని కమలం వర్గాలు అంటున్నాయి. -
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా హరిబాబు
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేసిన హరిబాబు రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి హరిబాబు రాజీనామా చేసి ఉంటారనే వాదన బలంగా వినిపించింది. అయితే మిత్రపక్షం టీడీపీతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారనేవి మరో వాదన. 2014 జనవరిలో పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. కాగా, ఈ రోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం కన్పిస్తోంది. అధ్యక్ష పదవి కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి నలుగురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమువీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరిబాబు రాజీనామాపై బీజేపీ స్పందన
సాక్షి, విశాఖ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సోమవారం సాయంత్రమే రాజీనామా లేఖను పంపించారు. ఈ అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబిచ్చారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి ఆయన కోరారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కంభంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి తేలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం కావడానికి ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని పేర్కొన్నారు. త్వరలోనే అమిత్ షా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని తెలిపారు. -
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు
-
కంభంపాటి హరిబాబు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల నడుమ హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి రాంమాధవ కీలక పాత్ర పోషించారని సమాచారం. -
మళ్లీ మోదీనే ప్రధాని; చంద్రబాబు కోరిక
సాక్షి, అమరావతి: ‘‘దేశప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగా 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీఏని అఖండ మెజారిటీతో గెలిపింది, మళ్లీ మోదీ గారినే ప్రధానిగా చేయాలని చంద్రబాబు అనే నేను కోరుతున్నాను’’ ఇది.. 30 రాజకీయ పార్టీల ప్రతినిధుల సాక్షిగా ఎన్డీఏ సమావేశంలో ఏపీ సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానం! ఆవిధంగా మాట్లాడిన బాబుగారు నెలలు తిరిగేలోపే మళ్లీ మాటమార్చారని, కేంద్రాన్ని, మోదీని విమర్శిస్తూ వింత ప్రేలాపనలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహకారం’ పేరుతో 32 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖను ఆయన విడుదలచేశారు. పలు కీలక అంశాలతో కూడిన ఆ లేఖలో చంద్రబాబు బండారం బట్టబయలు కావడంతోపాటు బీజేపీ ద్వంద్వవైఖరి కూడా స్పష్టంగా వెల్లడికావడం గమనార్హం. ► విభజన సమయంలో నాటీ యూపీఏ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినా, ఆ విషయాన్ని 14వ ఆర్థిక సంఘానికి నివేదించలేదని, జాతీయ సమగ్రతా మండలిలో ఆమోదించలేదని హరిబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆ పక్క పేజీలోనే ఏపీకి వరదాయిని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని కూడా నాటి యూపీఏ ప్రభుత్వమే చెప్పిందని, ముంపు మండలాలలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ కూడా తెస్తామని హామీ ఇచ్చినా చేయలేకపోయిందని రాసుకొచ్చారు. ►ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాల్లోనే.. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘ముంపు మండలాల బదలాయింపు ప్రక్రియ’ను తాము విజయవంతంగా పూర్తిచేశామని హరిబాబు గొప్పలు చెప్పారు. కానీ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఏమేరకు జరిగాయో, నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పే సాహసం చెయ్యలేకపోయారు. అదే విధంగా హోదా హామీని ఎందుకు అమలుచేయలేకపోయారన్న దానిపై కప్పదాటువైఖరి ప్రదర్శించారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలను ప్రస్తావించినా.. మోదీ ప్రధాని అయిన 7 నెలల తర్వాతగానీ ఆర్థిక సంఘం రద్దైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు. ►పోలవరం, ప్రత్యేక హోదా హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిచేయకుండా సాకులు వెతుక్కోవడం మోసకారితనమే అవుతుందని బీజేపీ-టీడీపీలకు ముందే తెలుసు. ఇప్పుడు మాత్రం ‘కూరిమి విరసంబైనను నేరములే కానవచ్చు..’ అన్న చందంగా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ మొత్తంగా ఏపీ ప్రజల కళ్లకుగంతలుకట్టే వ్యర్థప్రయత్నాలు చేస్తున్నారు. (ఏపీ దూరదర్శన్ అధికారిక ట్విటర్లో పోస్ట్ అయిన ఫొటోలివి) -
మంత్రి కామినేని వివరణ
సాక్షి, విజయవాడ: తనపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే నిన్న జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది..? రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కమలనాథులు కీలక విషయాలు చర్చించారు. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చి సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. అప్పటివరకు సమావేశంలో ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంశం ప్రస్తావనకు రాగానే బయటకు వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటకు వెళ్లిపోవడం పట్ల పలువురు అభ్యంతరం చేశారు. దీంతో మంత్రి కామినేని ఈరోజు వివరణయిచ్చారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడతా.. బీజేపీ మంత్రుల రాజీనామాలను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పంపితే బాగుంటుందని సమావేశంలో చర్చించుకున్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జవాబిచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని హరిబాబు సూచించడంతో ఈ అంశంపై చర్చను ముగిసించారు. -
చంద్రబాబు సవాల్‌కు వీర్రాజు సై
-
చంద్రబాబు సవాల్‌కు వీర్రాజు సై
సాక్షి, విజయవాడ: కేంద్ర సాయంపై బహిరంగ చర్చ సిద్ధమని సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు చేయనంత సాయం కేంద్రం చేస్తోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును పిలిస్తే లెక్కలన్నీ చెబుతారన్నారు. హరిబాబు సినిమా స్క్రిప్టులు చదువుతారంటూ విమర్శిస్తున్నారని, ఆ అలవాటు మాది కాదు మీదంటూ టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు. విశాఖపట్నంలో రోడ్లు మెరవడానికి కేంద్రం నిధులే కారణమని వెల్లడించారు. అమరావతికి రూ. 20 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. కావాలనే దుష్ప్రచారం.. ఏపీని కేంద్రం అన్నివిధాల ఆదుకుంటోందని, టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కంభంపాటి హరిబాబు అన్నారు. రెవెన్యులోటు పూడ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీయే పాటుపడుతోందని చెప్పుకొచ్చారు. కేంద్రం సాయంపై డాక్యుమెంట్ ఆదివారం జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి దగ్గుబాటి పురందేశ్వరి, గోకరాజు రంగరాజు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు హాజరయ్యారు. టీడీపీ నేతల విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి కేంద్రం సాయంపై డాక్యుమెంట్ రూపొందించారు. ఏపీలో ప్రాజెక్టులు, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇందులో పొందుపర్చారు. -
మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని విద్యాసంస్థల ఏర్పాటు వందశాతం పూర్తి చేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కొన్ని సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు రాలేదని అయినా ఇబ్బందులు తొలగించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మెకా అనే సంస్థ నివేదిక ఇచ్చిందని, ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం రాష్ట్రప్రభుత్వమే చూపించాలని హరిబాబు డిమాండ్ చేశారు. త్వరలోనే రైల్వేజోన్‌పై నిర్ణయం రానుందని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విడుదలలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు వివక్ష ఉండదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత సాయం అందించడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు. సంస్థల భవనాల నిర్మాణాల పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఏపీ విభజన జరిగిన ఏడాదిలోనే ప్రత్యేక దూరదర్శన్ ఏర్పాటు చేశారని, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్‌లకు 17సంత్సరాల తర్వాత దూరదర్శన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. కేంద్రానికి ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందువల్లే అభివృద్ధి చెందుతోందని అన్నారు. తమని పొగడాల్సిన అవసరం లేదని, కానీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిధులు ఇస్తే మా హక్కు లేదంటే మోదీ పాపం అంటూ ప్రచారం చేయడం తప్పు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. తాము కేంద్రం తరపున మాట్లాడుతున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఇది కేవలం రాజకీయ అస్త్రమేనని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాయితీలు ఇచ్చామని, ఏడు జిల్లాల్లో ఏం మాత్రం పెట్టుబడులు తెచ్చారో తెలుగుదేశం నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రజలను రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం, తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఏపీ ప్రజల గొంతు కోసిందని, హైదరాబాద్‌లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేసినందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
మీ కుట్రలు సాగనివ్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలనలో ఘోర వైఫల్యం, అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తప్పంతా కేంద్రంపై నెట్టివేసి తప్పుకోవాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్న సమయంలో కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించి లబ్ధి పొందాలన్న ఎత్తుగడలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం అందించిన సాయం వివరాలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 27 పేజీల నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్రం సహాయం చేయడంలేదన్న టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట్టారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనంటూ కుండబద్దలు కొట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచలేమన్నందుకే మాపై కుట్ర చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కేంద్రం ఎంతో సాయం చేస్తుందంటూ నాలుగేళ్లుగా పొగిడిన చంద్రబాబు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు ఎలా భేటీ అవుతారంటూ నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా గొడవ చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తమను ముంచాలని చూస్తే చంద్రబాబే మునిగిపోతారని హెచ్చరించారు. కేంద్రం ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చుచేశారో బహిరంగ ప్రకటన చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈవెంట్ల పేరుతో, సదస్సుల పేరుతో ఫైవ్‌స్టార్ హోటళ్లకు కోట్లాది రూపాయలు తగలేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏపీకి నిధుల లోటు ఉందంటే ప్రజలు కూడా నమ్మబోరని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం దుబారాపై చర్చకు సిద్ధమా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ... ప్రభుత్వ నిర్ణయాలను ఒకవైపు ఆమోదిస్తూ... మరోవైపు ప్రజలను మభ్యపెట్టడానికి సభలో నిరసనలకు దిగుతున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు అస్త్రాలను సన్నద్ధం చేసుకుంటున్నారు. రాజీనామాలు ఎందుకు చేయడం లేదు? ఇటీవల చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రెండు ఎకరాల ఆసామి రెండు వేల కోట్లకు పైగా ఆస్తులు ఎలా సమకూరాయని కూడా ఆయన పరోక్షంగా సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ సమయంలో టీడీపీ నేతలు వీర్రాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలతో వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. చంద్రబాబును విమర్శించే ముందు వీర్రాజు తమ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామాలు చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదవుల్లో కొనసాగుతూ ప్రశ్నించే అర్హత టీడీపీ వారికి లేనేలేదని, ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే తమ వ్యూహమని చెబుతున్నారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను, ఇతర ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని, అవినీతి అక్రమాలను పాల్పడిందని, వాటినీ ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. పోలవరం, రాజధాని నిధులే కాకుండా వివిధ పథకాల కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియోజకవర్గంలోనే రూ.10 కోట్లమేర ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పేర్లు మార్చి తన సొంత పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టడం లేదని ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సోము వీర్రాజు ప్రకటనల తరువాత బీజేపీ రాష్ట్ర నేతల ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడికి తెలుగుదేశం నేతలు కొన్ని లీకులు ఇప్పించి సోము వీర్రాజును ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మందలించినట్లు తమ మీడియాలో ప్రచారం చేయించారు. బీజేపీ నేతలు వాటిని ఖండించడమే కాకుండా మరింత ఉధృతంగా టీడీపీపై విమర్శల దాడి పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షాత్తూ అమిత్‌షానే తమకు మార్గనిర్దేశం చేసినందున జిల్లా స్థాయి వరకు టీడీపీ మోసపూరిత నిరసన నాటకాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీ లేకపోతే టీడీపీకి అధికారమెక్కడిది? మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం తెరవెనుక కుట్రలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ వారికి పనులు కూడా చేయనివ్వకుండా అధికారులకు ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. ఇదంతా రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు తెరవెనుక ఆడిన నాటకమని పేర్కొంటున్నారు. కాకినాడ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తున్నారు. ‘బీజేపీకి రాష్ట్రంలో స్వతంత్రంగా 18% ఓట్లు సాధించుకొనే సత్తా ఉంది. గతంలో ఇది నిరూపితమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే అది మా చలవే. టీడీపీ వైఎస్సార్సీపీకి కేవలం ఓట్ల తేడా ఐదు లక్షల ఓట్లే. మా వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పడు మమ్మల్నే అణగదొక్కాలని చూస్తోంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. ‘రాష్ట్ర బీజేపీ పార్టీనే కాకుండా జాతీయ పార్టీని, ప్రధాని మోడీని కూడా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది. దీనిని మేమెంత మాత్రం సహించబోము. మా తడాఖా ఏమిటో మేమూ చూపిస్తాం’ అని మరో బీజేపీ నేత చెప్పారు. లెక్కలు చెప్పడానికి భయమెందుకు? కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇచ్చిన నిధులు లెక్కలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని బీజేపీ రాష్ట్రనేత ఒకరు ప్రశ్నించారు. ‘‘టీడీపీ నేతలు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రాలేదని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదు. పోలవరానికి ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. యూసీలు ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అక్కడ జరిగిన అవినీతి బయటపడుతుందని భయమా? రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల పరిస్థితీ అలాగే ఉంది. శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలంటూ ఆ నిధులు వృథా చేస్తున్నారు. తెరవెనుక లాలూచీలతో ఇవన్నీ తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నిటిలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. నిధులు కేంద్రం నుంచి సహాయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన రిపోర్టులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు త్వరితంగా డీపీఆర్‌లు పంపించి నిధులు రప్పించుకుంటుండగా ఇక్కడ మాత్రం అలా చేయడం లేదు. వారి వైఫల్యాలకు కేంద్రంపై, బీజేపీపై నిందలు వేస్తున్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
హరిబాబుకు 'విజయవాడ' షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు విజయవాడ నగర శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా మంగళవారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజును సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేస్తున్నట్లు హరిబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. -
వారంలో ఏపీ నూతన అధ్యక్షుడి ఎంపిక
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికను వారంలో పూర్తి చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. శుక్రవారం అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ రెండేళ్ల పాలన విజయాలపై ప్రచారం కోసం 30 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 21వ శతాబ్దం ఇండియదే అన్న లక్ష్యంగా తమ పాలన సాగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలన తర్వాత దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నామని అమిత్ షా తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని, రైతులకు ఉపయోగం కలిగేలా పథకాలు ప్రవేశపెట్టామని, దేశంలో వృద్ధి రేటును పెంచగలిగామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో సమతుల్యత పాటించినట్లు అమిత్ షా అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఏపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో తలమునకలై ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఆపార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ను నియమించిన విషయం తెలిసిందే. -
రైల్వే జోన్‌పై బీజేపీ-టీడీపీ డ్రామాలు
ఎంపీ హరిబాబు ప్రకటనపై సీపీఎం నిరసన డాబాగార్డెన్స్: విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు రైల్వేజోన్‌పై చేసిన కుట్రపూరిత ప్రకటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడానికి చాలా అవరోధాలు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి మాట్లాడుతూ మొన్నటి వరకు అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ప్రకటనలు గుప్పించిన ఎంపీ హరిబాబు చావు కబురు చల్లగా చెప్పినట్టు విశాఖకు రైల్వేజోన్ రాదని పరోక్షంగా వెల్లడించారన్నారు. రైల్వేజోన్‌పై వేసిన కమిటీ విశాఖకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పడం వెనుక ఎంపీ కుట్ర ఉందన్నారు. చట్టంలో రైల్వేజోన్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న తర్వాత రైల్వేజోన్ ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నామన్నారు. ఇది బీజేపీ-టీడీపీ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం విశాఖలో పెట్టి విశాఖకు రైల్వేజోన్ రాకుండా కుట్రకు పాల్పడినట్టు అర్థమవుతోందన్నారు. విశాఖకు అన్యాయం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని, అమరావతికి రైల్వేజోన్‌ను తరలించే కుట్రలను బీజేపీ-టీడీపీ నాయకులు ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.మణి, పార్టీ నగర కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, అప్పారావు, నరేంద్రకుమార్, డి రాజు, నూకరాజు, నాయుడు, రమణ, భూలోకరావు, కుమారి, విజయ తదితరులు పాల్గొన్నారు.