సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు.
‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్‌నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment