Special Category Status
-
ఏపీకి ప్రత్యేకహోదా తప్ప ఏమీ వద్దు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.The people of AP whose 16 MPs are keeping the Central Government stable deserve nothing but Special Category Status. Not “arranged” additional loans, no Special Package, no concession, only Special Category Status. The General Budget is a play of words for us.— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2024శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
ఏ రాష్ట్రానికీ కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు: నిర్మలా సీతారామన్
-
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
పట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై నితీశ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్‌ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్‌కే వెళ్తోందని నితీశ్ కుమార్ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్‌లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ తీరును ఆ పార్టీ నేతలు ఎండగట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ‘పవన్‌వి స్వార్థ ప్రయోజనాలు ...ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు. వామపక్షాలకు బాకీ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారు.అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్ కూడా దేశద్రోహే’ అని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌ది అవకాశ వాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయన... నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్యూకు వెళితే పవన్ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్నపవన్ ‘చెంగువీర’ అయ్యారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, పవన్ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలని అన్నారు. చదవండి: వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్ పవన్‌కు రాజకీయాల్లో స్థిరత్వం లేదు : అంబటి -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ..విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి వడ్డీలు, అసలు కలిపి 40 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెనకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సత్వరమే మంజూరు చేయాలని వెల్లడించారు. ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రాంట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల నవీకరణ కోసం కేంద్రం నిధులను మంజూరు చేయాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఆ రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది...
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక మరోలా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన వ్యవహారశైలికి కొన్నిసార్లు ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. యూటర్న్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అందితే జుట్టు, అంతకపోతే కాళ్లు పట్టుకోవడం అలవాటే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు తాజాగా బీజేపీలోకి కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమయం లో రాహుతల్తో పొత్తు కోసం మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు రాజకీయంగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. కేంద్రం విభేదించి తప్పు చేశామంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బీజేపి ఇంచార్జ్ సునీల్ దియోధరా మాత్రం బాబు ఎంట్రీకి ఎప్పుడో గేట్లు మూసేశామని చెబుతున్నారు. అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు, లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. యూటర్న్ విషయానికి వస్తే... 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకతను పక్కనపెట్టి ఆ పార్టీతో చేతులు కలిపారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆయన వేసిన పిల్లిమొగ్గలతో సొంత పార్టీ నేతలే అయోమయానికి గురయ్యారు. ఇక నాలుగున్నరేళ్లుగా బీజేపీతో పనిచేసిన చంద్రబాబు ఎన్నికల ముందు హఠాత్తుగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి హోదాపై యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి తానే పోరాటం చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చిన ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టులు అప్పచెప్పి..సకాలంలో పూర్తి చేసిన వారిని భారీ బహిరంగ సభ పెట్టి మరీ సన్మానించిన చంద్రబాబే... పవర్ పోయి ప్రతిపక్ష నేతగా మారగానే యూ టర్న్ తీసేసుకున్నారు. చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందంటూ హడావుడి చేసేస్తున్నారు. గతంలో చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని ఆ దేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు చంద్రబాబు. చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. యూటర్న్‌కు... బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం. నాలుగు నెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభాని తప్ప జనానికి ఉపయోగపడేది కాదనేది వాస్తవం. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. ఈ లెక్కన చూస్తుంటే...యూటర్న్‌ను ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది. -
హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. అంతకుముందు పార్లమెంట్లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. -
‘సత్వరమే హోదా ప్రకటించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వాగ్దానాలు ఆకాశాన్నిఆవరించిన మేఘంలా కనిపిస్తున్నా.. మేఘం వర్షిస్తేనే వాగ్దానాలు ఫలించినట్టు అని హిందీ కవిత చదివిన మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని,గాయపడిన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి ఆదుకోవాలని కోరారు.చంద్రబాబును ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు.ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయడంతో పాటు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.13 జిల్లాల్లో 13 భారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇక ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా రోడ్డుమ్యాప్ ఉందా అని భరత్ ప్రశ్నించారు. -
చంద్రబాబు బండారాన్ని బయటపెట్టిన గోయల్
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ బయటపెట్టారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి 2016 అక్టోబర్ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ.. మంగళవారం గోయల్ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ చేసిన తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు. ప్యాకేజీని స్వాగతిస్తూ 2017 మార్చి 16న ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గోయల్ ప్రస్తావించారు. ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్ జట్టుకడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రుజుమైందని గోయల్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆయనను అవమానించిన కాంగ్రెస్‌తో జట్టు కట్టడం దుర్మార్గమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మీకు హైదరాబాద్‌లో ఆస్తులు లేవా.. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు తెలుగు రాష్ట్రల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చులు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి హైదరాబాద్‌లో ఆస్తులు లేవా అని ప్రశ్నించారు. పక్కవారిని తిట్టడానికే ఆయన అనుభవం ఉపయోగపడుతోందని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతారని మంత్రి లోకేష్ కనీస అవగహన లేకుండా మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా బీజేపీ మ్యానిఫెస్టో ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. తన రాజకీయ స్వలాభం కోసమే చంద్రబాబు నాయుడు.. మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
ఇదీ కాపీయేనా..!
-
అది హోదాతోనే సాధ్యం : వైఎస్ వివేకానంద రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పారిశ్రామిక విప్లవం రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా అనేక ఉద్యమాలతో ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచామన్నారు. చివరి అస్త్రంగా తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించామని తెలిపారు. విభజన హమీలతో పాటు నదుల అనుసంధానమైన దొమ్మగూడెం, బ్రహ్మం సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వేలిగోండ వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకోరావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు సహకరిస్తామంటున్నారని, మొత్తం 42 ఎంపీలతో కలిసి పోరాడితేనే తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని తెలిసినా.. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏనాడు అడిగింది లేదని, బీజేపీ ఇచ్చింది లేదన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు హోదా కావాలంటూ ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఘాటుగా విమర్శించారు. -
హస్తినలో వైఎస్సార్ సీపీ సమరభేరీ
-
గర్జించిన గళాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా హోదా గళాలు గర్జించాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాట కాలపై సమరశంఖం పూరించాయి. టీడీపీ, బీజేపీ సర్కారుల ద్రోహానికి నిరసనగా హస్తినలో వైఎస్సార్ సీపీ గురువారం రోజంతా నిర్వహించిన ‘వంచనపై గర్జన’ ధర్నా కార్యక్రమానికి వణికించే చలి గాలుల్లోనూ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ నినదించారు. జంతర్ మంతర్ వేదికగా... ప్రత్యేక హోదాపై నాలుగున్నరేళ్లుగా మడమ తిప్పకుండా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ 16వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో మరోసారి కేంద్రానికి ఏపీ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పింది. హోదాపై ప్రభుత్వాల వంచనను గుర్తు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఢిల్లీ పీఠాన్ని నిలదీసింది. ప్రత్యేక హోదా కోసం 2015 ఆగస్టు 10వతేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే స్థలంలో భారీ ధర్నా నిర్వహించడం తెలిసిందే. 2018 మార్చి 5న పార్టీ శ్రేణులు మరోసారి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వీధిలో మహా ధర్నా కూడా చేపట్టాయి. హోదా కోరుతూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన ఇటీవలే 12 ఏళ్ల నాటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ఢిల్లీలో శీతాకాలపు చలి గాలులను లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, నేతలు ఉదయం 9 గంటలకే ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు దివంగత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ధర్నా కార్యక్రమాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో ఆందోళన నిర్వహించి సభ వాయిదా పడిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు. సీనియర్ నేత కంతేటి సత్యనారాయణరాజు ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. ఏపీకి ప్రాణవాయువు లాంటి హోదాను తాకట్టు పెట్టిన బాబు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏపీని వంచించిన తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేతలు నిలదీశారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు, ప్రత్యేక హోదా తెస్తామని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వంచించడాన్ని వివరించారు. ఏపీకి ఆక్సిజన్ లాంటి ప్రత్యేక హోదాకు చంద్రబాబు అడ్డుపడి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు మంచుకొస్తుండటంతో ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, శంకుస్థాపనలు అంటూ మరోసారి వంచించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు, మోదీ నమ్మించి వంచించారు.. ‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారు. ఇద్దరూ పొత్తు పెట్టుకుని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించారు. ఢిల్లీని తలదన్నేలా ఏపీ రాజధాని నిర్మిస్తామని ఆనాడు మోదీ హామీ ఇచ్చారు. హోదా ఐదేళ్లు ఇస్తామని యూపీఏ అంటే 10 ఏళ్లు ఇస్తామని బీజేపీ నమ్మబలికింది. 15 ఏళ్ల పాటు హోదా సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. వారిని నమ్మి రాష్ట్రం అన్యాయమైపోయింది. మోదీ గ్రాఫ్ తగ్గుతోందని చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బాబు సిగ్గు లేని వ్యక్తి. నయవంచకుడు, రోషం లేని వ్యక్తి. బీజేపీకి మేం బీ–టీం అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడితే వారికే మా మద్దతు ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌గాంధీని వివిధ భంగిమల్లో ప్రేమిస్తున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మీ మోసాన్ని మరిచిపోరు. ప్రతిపక్ష నేతనే అంతమొందించాలని చూశారు. ప్యాకేజీ కోసం, అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఆరాటపడ్డారే కానీ చంద్రబాబు ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదు’ – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎన్డీఏపై మొదట అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసంపై వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసగించాయి. ఇన్నాళ్లూ ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదాపై ప్రజలను వంచించాయి. వైఎస్సార్ సీపీ వీరి మోసాన్ని ఆనాడే గ్రహించి మడమ తిప్పకుండా పోరాడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం మీద మొదటిసారిగా అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే. 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు రానివ్వలేదు. దీంతో రాజీనామాలు చేశాం. ఏపీ భవన్‌లోనే ఆమరణ దీక్షలు చేశాం. ఇవే పార్లమెంట్ చివరి సమావేశాలు. కేంద్రం మెడలు వంచేందుకుమరోసారి గర్జన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలి. బీజేపీతో నాలుగున్నరేళ్లు కాపురం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు వెన్నుపోటు పొడిచారు. ప్యాకేజీకి అంగీకరించి ఘోర తప్పిదం చేశారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. చంద్రబాబు తన దోపిడీ, అవినీతి వెలుగులోకి వస్తే జైలుకు వెళ్తాననే భయంతోనే మోదీని ప్రశ్నించడం లేదు’ – వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ జగన్ పోరాడకుంటే బాబు నోరెత్తేవారా? ‘హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడంతోపాటు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించిన ఎన్డీఏ సర్కారు మెడలు వంచేందుకే ఈ గర్జన నిర్వహిస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హోదాపై నిరంతరం పోరాడకుంటే చంద్రబాబు ఆ మాటే ఎత్తేవారా? ప్యాకేజీనే సంజీవని అంటూ రాష్ట్ర ప్రజలను వంచించినందుకే ఈ గర్జన చేపట్టాం. మేం అవిశ్వాసం పెడితే దానివల్ల ఏం వస్తుందన్నారు.. మేం రాజీనామా చేస్తే.. వాటితో ఏం ఒరుగుతుందన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. పోలవరం పూర్తిచేయకుంటే ఓట్లడగబోనన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. ఏపీకి హోదాను తెచ్చే ఏకైక శక్తి వైఎస్ జగన్’ – పీవీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగులంటే బాబుకు చిన్నచూపు ‘చంద్రబాబుకు పేదలంటే గౌరవం లేదు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తారు. ఓ ముఖ్యమంత్రి ఇలా అవమానించడం సిగ్గు చేటు. బీసీలనూ మోసగించారు.వారిని చిన్నచూపు చూశారు. రిజర్వేషన్ల కోసం అడిగితే మత్స్యకారులను తోలు తీస్తా అని బెదిరించారు. నాయీ బ్రాహ్మణులు కలవటానికి వస్తే బెదిరించారు. ఎన్నికలొచ్చేసరికి ఆయనకు ప్రత్యేక హోదా, పేదోడి ఆకలి గుర్తొస్తుంది. స్టీలు ప్లాంటు కూడా గుర్తొస్తుంది. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా సాధించలేని వ్యక్తిని సీఎం అని పిలుద్దామా? దుగరాజపట్నం ఇస్తామని గడ్కారీ చెబితే బాబు ప్రైవేట్ పోర్టు యాజమాన్యాలతో లాలూచీ పడి రాకుండా చేశారు. రైల్వే జోన్ చిన్న అంశం. అది కూడా సాధించలేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తాడట. మేనిఫెస్టో అంశాలను కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి ధర్మ పోరాటం ఎవరిపై చేస్తున్నారు? – వెలగపల్లి వరప్రసాదరావు (మాజీ ఎంపీ) అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు..? యూపీయే హయాంలో మంత్రిమండలిలో తీర్మానం చేసిన అనంతరం రెండు నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు? రాష్ట్రాన్ని దారుణంగా విభజించి కంటితుడుపు చర్యగా హోదా హామీ ఇచ్చినా చట్టంలో చేర్చలేదు. 2014 ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కలసి హోదా హామీని అమలు చేయాలని మోదీని కోరారు. అప్పటి నుంచి జగన్ నిరంతరం హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అమరణ దీక్షలు, ధర్నాలు, బంద్‌లు, యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ తొలి అసెంబ్లీ భేటీ నుంచే హోదాపై మాట్లాడుతున్నారు. హోదా పోరాటంలో కలసి రావాలని టీడీపీకి పిలుపునిస్తే హేళన చేశారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటనపై మోదీని అభినందిస్తూ బాబు సన్మానించారు. ప్యాకేజీలో కొత్తగా ఏమీ లేదని జగన్ ఆనాడే చెప్పారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని జగన్ అసెంబ్లీలో, బయట చెప్పినా ఆలకించలేదు. ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. వైఎస్సార్ సీపీ పోరాటంతో తన పుట్టి మునుగుతుందని ఆందోళన చెందిన చంద్రబాబు రాత్రికి రాత్రే కేంద్రం నుంచి బయటకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని మళ్లీ ప్రజల్ని మోసగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీకి విలువ ఇచ్చి కేంద్రం ఈ రెండు నెలల్లో హోదాను అమలు చేయాలి. లేదంటే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీకి వచ్చి కేంద్రం మెడలు వంచి జగన్ హోదా సాధిస్తారు. – సజ్జల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) మోదీతో బాబు లాలూచీ.. హోదా విషయంలో ప్రధాని మోదీతో చంద్రబాబు లాలూచీ పడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగానే స్వాగతించి సన్మానించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని హోదా కావాలంటున్నారు. హోదా పేరెత్తితే పీడీ కేసులు నమోదు చేస్తామన్న చంద్రబాబుపై ఇప్పుడు ఏ కేసులు పెట్టాలి? రాష్ట్రంలో అవినీతి మినహా అభివృద్ధి లేదు. రైతుల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. అధిక సంపాదన కోసం రైతులు వలస పోతున్నారని అంటూ వారిని అవమానించారు. గతంలో అంతా కలసి మోదీ వద్దకు వెళ్లి హోదాపై నిలదీద్దాం అని వైఎస్సార్ సీపీ సూచిస్తే పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకుంటున్నారు. హోదా, విభజన హామీల సాధన కోసం ఆది నుంచి పోరాడుతోంది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (శాసన మండలిలో ప్రతిపక్ష నేత) ఎన్నికల వేళ శంకుస్థాపనలతో బాబు మోసం.. ‘చంద్రబాబు నాలుగున్నరేళ్లు మోదీతో అంటకాగి ఆయన చెప్పింది చేస్తూ ప్రత్యేక ప్యాకేజీనే మహద్భాగ్యంగా శాసనసభలో రెండుసార్లు తీర్మానం చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ పట్టలేదు. మాయ మాటలతో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో సచివాలయం, ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటూ ఇంద్రజాలం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇలా రాజకీయ ఆయుధాలను సమీకరిస్తున్నారు. ప్రజలు మరోసారి మోసపోవద్దు. రాష్ట్రాన్ని మోదీ, బాబు వంచించడానికి నిరసనగా ఈ గర్జన నిర్వహిస్తున్నాం. మా పార్టీ సింహంలా గర్జిస్తోంది. సివంగిలా నిలదీస్తోంది’ – భూమన కరుణాకర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ సీనియర్ నేత) చీత్కారం తప్పదనే ఈ వేషాలు ‘టీడీపీ, బీజేపీ కుట్ర పన్ని రాష్ట్రానికి అన్యాయం చేశాయి. వారికి ఇక్కడ ఓట్లు లేవని గ్రహించిన బీజేపీ ప్రభుత్వం నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసింది. చంద్రబాబు, మోదీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారు. నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం వద్దన్నదని చెబుతూ ప్యాకేజీ మాత్రమే కావాలంటూ చంద్రబాబే హోదాకు అడ్డుపడ్డారు. హోదా కోసం చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని గ్రహించి నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం, శ్వేతపత్రాలు అంటూ రకరకాల వేషాలు వేస్తున్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని సంపూర్ణంగా అమలు చేయించలేని వ్యక్తి సీఎంగా ఉన్నారు. రాష్ట్రానికి రూ. 90 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న ఆయన మొదటి సంవత్సరం ఏం చేశారు? రెండో సంవత్సరం ఏం చేశారు? అవకాశం ఉన్నప్పుడల్లా మోదీని పొగిడారు. హోదా ఉద్యమాలను అణచి వేశారు’ – పార్థసారథి, మాజీ మంత్రి ఓటుకు కోట్లులో దొరికిపోయి పరార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చారు. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి వెంకయ్యనాయుడు కూడా కారణం. రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబును ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒక బలమైన శక్తి కావాలి. ఆ శక్తి జగన్‌కు ఉంది. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం. – సి.రామచంద్రయ్య (మండలి మాజీ ప్రతిపక్షనేత) తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు.. శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు విడుదల చేస్తున్నారు. 650 అబద్ధపు హామీలతో ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. హోదా కోసం జగన్ పోరాడుతుంటే హేళన చేసిన చంద్రబాబు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. – మహ్మద్ ఇక్బాల్, పార్టీ సీనియర్ నేత హోదా అంటే కేసులు పెడతానన్నారు.. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమిస్తే పీడీ కేసులు బనాయిస్తానని హెచ్చరించిన చంద్రబాబు ఈరోజు హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. హోదా కోసం నాలుగున్నరేళ్లుగా పోరాడుతోంది వైఎస్ జగన్ మాత్రమే. అందుకే వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రతి పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు బాబు మోసాలను జనం క్షమించరు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైఎస్ జగన్ హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు అవహేళన చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలంటూ బీజేపీ నేతలను ఊరూరా తిప్పి సన్మానించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను ప్రజలు క్షమించరు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు చంద్రబాబును తిరస్కరించినట్టుగానే ఏపీ ప్రజలు కూడా ఆయన్ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు. – పృథ్వీ (ప్రముఖ నటుడు, వైఎస్సార్ సీపీ నేత) చంద్రబాబు అబద్ధాలకోరు... ‘చంద్రబాబు అబద్ధాలకోరుగా మారారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు రంగులు మార్చి అధికారంలోకి వచ్చి మళ్లీ వంచించారు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ తన హక్కుల కోసం పోరాడుతోంది’– శారద, డ్వాక్రా సంఘాల ప్రతినిధి భారీగా హాజరైన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీలో నిర్వహించిన వంచనపై గర్జన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, జగ్గిరెడ్డి, రక్షణనిధి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మహ్మద్ ముస్తఫా, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అంజాద్ బాషా, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, తిప్పేస్వామి, వేణుగోపాలరెడ్డి, కిలివేటి సంజీవయ్య, చింతల రాంచంద్రారెడ్డి, కంబాల జోగులుతోపాటు ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు పినిపె విశ్వరూప్, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్నబాబు, జోగి రమేష్, గౌరు వెంకటరెడ్డి, మల్లాది విష్ణు, ముదునూరి ప్రసాదరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, శిల్పా రవి, ఉండవల్లి శ్రీదేవి, పద్మజ, ఎం.శంకరనారాయణ, విజయశారద, పి.వి.సిద్దారెడ్డి, బీవై రామయ్య, రహమాన్, మాజీ ఎంపీ బాలశౌరి, కుంభా రవిబాబు, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, మల్లా విజయప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, శ్రీపర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాల కృష్ణ, గున్నం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, నంబూరి శంకర్రావు, వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం, గరటయ్య, బాలాజీ, టీజేఆర్ సుధాకర్‌బాబు, మెరిగ మురళీధర్, గంగుల బ్రిజేందర్‌రెడ్డి, రవికిషోర్, కాటసాని రామిరెడ్డి, భరత్‌రామ్, కళ్యాణి, కడప రత్నాకర్, కడపల శ్రీకాంత్‌రెడ్డి, కంగటి శ్రీదేవి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైవీ
ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు. హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. -
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
-
విజయం మాదే: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. హోదా కవచంతో వస్తున్నారు: జంగా ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగు ప్రజల హక్కు అని వైఎస్సార్ సీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. హోదా కవచం కప్పుకుని ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. శ్వేతపత్రాలతో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్సీపీయేనని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తూర్పారబట్టారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాదని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
-
‘ఆయన్ను బ్రోకర్లా బాబు వాడుకుంటున్నారు’
ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్‌ను ఒక బ్రోకర్లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
గర్జించిన కాకినాడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై ... ప్రత్యేక హోదా కావాలంటూ కాకినాడ మరోసారి గర్జించింది. బాలాజీ చెరువు కూడలి జన సంద్రమైంది. దిక్కులు పిక్కటిల్లేలా వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఉదయం ఎనిమిది గంటలకుప్రారంభమై పది గంటలయ్యేసరికి జన ప్రవాహంగా మారిపోయింది. పూటకో మాట...రోజుకో మెలికపెడుతూ ఆది నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన టీడీపీ వైఖరిపైజనాగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది.విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కార్ ఆడుతున్న నయవంచక నాటకాలపై నిరసన గళం విప్పారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సభలో హోదా ఇవ్వాల్సిందేనని పెద్ద ఎత్తున గర్జించారు. వంచనపై దీక్షకు ప్రజా మద్దతు,సంఘీభావం లభించింది. పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉదయం 9.50 గంటలకు జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతంతో సభ ప్రారంభం కాగా, సర్వమత ప్రార్థనలతో దీక్షకు శ్రీకారం చుట్టారు. హోదా కోసం పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన లోకసభ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్‌లు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం చూపించిన చిత్తశుద్ధిపై పార్టీ నేతలతో సహా వివిధ వర్గాల వారు ఉచిత రీతిన సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నేతలంతా నల్ల దుస్తులతో దీక్షల్లో పాల్గొని నిరసన గళం వినిపించారు. సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా దీక్షను చేపట్టారు. తరలివచ్చిన ప్రజలు ఆద్యంతం అక్కడే ఉండి సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో పాల్గొన్న వారికితొలుత హిజ్రాలు మద్దతు పలికారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్వాడీ సమాజం ప్రతినిధులు వేదికపైకి వచ్చి హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసిన ఎంపీలను సన్మానించారు. తదుపరి న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘం నేతలు పెద్ద ఎత్తున వచ్చి, పదవులను త్యాగం చేసిన ఎంపీలను ఉచిత రీతిలో సత్కరించారు. తృణప్రాయంగా పదవులను త్వజించిన నేతలకు ఎంత గౌరవించినా తక్కువేనని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని అభినందించారు..చంద్రబాబు మోసాలపై నేతల గళం... నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను, హామీలు అమలు చేయడంలో చేస్తున్న వంచనపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నయవంచనకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినటు వివరించారు. ప్రజల్ని మోసం చేయకుండా వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని, ఏఏ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా దోపిడీ చేస్తున్నారని సమగ్రంగా వివరించారు. తండ్రి కొడుకులైన చంద్రబాబు,లోకేషే కాకుండా వారి బినామీలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసిన అవినీతి భాగోతాలను బయటపెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదని, ప్రజాధనాన్ని మింగేశాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల్ని నయవంచనకు గురి చేయడమే కాకుండా తానేదో ఉద్దరించినట్టుగా అనుకూల మీడియాలో ఊదరగొట్టి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. హోదా కోసం తొలినుంచి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ అని గుర్తు చేశారు. తన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనో, తన బినామీల బండారం వెలుగు చూస్తుందనో ఐటీ, సీబీఐ, ఈడీ అధికారుల విచారణలను అడ్డుకునేందుకు చంద్రబాబు శతవిధాలా యత్నిస్తున్నారని విమర్శించారు. పవన్ తీరును ఎండగట్టిన నేతలు ఎక్కడైనా అధికార పక్షాన్ని నిలదీయడం, ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలను ప్రశ్నించడం చూశాం గానీ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేసే నేతగా ఒక్క పవన్ కల్యాణ్‌నే చూశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, కాంగ్రెస్, ఇటు పవన్ కల్యాణ్‌లు జగన్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడాన్ని తప్పు పట్టడమే కాకుండా వారి లోపాయికారీ కుట్రలను ఎండగట్టారు. ఇక కోడి కత్తే కదా, దానికంత రచ్చ అని పవన్ చేసే వ్యాఖ్యలపై కూడా అనిల్‌కుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ కోడి కత్తితో ఒక్కసారి చిన్న పిల్లాడితో రక్కిస్తే ఏమవుతుందో పవన్ కల్యాణ్‌కు తెలుస్తుందని సుతిమెత్తని చురక అంటించారు. ఇదే తరహాలో మిగతా నేతలు కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. వంచనపై గర్జన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొప్పర మోహన్‌రావు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు జిల్లా ముఖ్యనేత గౌరు వెంకటరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి , తిప్పల నాగిరెడ్డి, కొయ్యా ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తానేటి వనిత, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బూసి వినీత. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కో–ఆర్డినేటర్లు వాసుబాబు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కవురు శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి, కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, మిండకుదిటి మోహన్, కర్రి నారాయణరావు, కొలగాని దుర్గాప్రసాద్, ఇనుకొండ పట్టాభిరామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంపని రామకృష్ణంరాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల బూత్‌కమిటీల ఇన్చార్జ్ వీవీఎస్ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జంపన రామకృష్ణంరాజు(బుజ్జిరాజు), నాయకులు బుర్రా అనుబాబు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, కాకినాడ పార్లమెంట్జిల్లా బూత్‌కమిటీల ఇన్చార్జ్ ఒమ్మిరఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన మాటలతో ఏపీ పరువు పోతోంది’
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష దోరణిలో ఆర్థిక సంఘానికి రిపోర్టు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడే ఏపీకి ప్యాకేజీకి ఒప్పుకోవద్దని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తే.. మగ బిడ్డను కంటానని అంటే ఏ అత్తయినా వద్దంటుందా అన్న మాటలను మర్చిపోయారా అంటూ టీడీపీ నాయకులకు గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను లెక్కలు చేయకుండా హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు అంటూ చంద్రబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ అంట.. గెలిచినోళ్లకు నోబెలా? రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఉందని అబద్దాలు చెబుతున్నారని, వాస్తవానికి రాయలసీమలో సాగు దెబ్బతిందని వివరించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానిది తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. పరిశ్రమ రంగం, సేవా రంగం పడిపోయాయని అయినా రాష్ట్రం అభివృద్ది చెందుతుందనడం సరికాదన్నారు. చంద్రబాబు మాటలతో రాష్ట్రం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారిన మండిపడ్డారు. రాజధాని కట్టడానికి లక్ష కోట్లు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబే.. ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే చాలు అనండం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి సుందరమైన నగరం అమరవాతి చెప్తున్నారని, కానీ ఇక్కడ కంప మొక్కలు అలానే ఉన్నాయని ఎద్దేవ చేశారు. ఒలంపిక్స్ అమరావతిలో జరుపుతామని.. గెలిచిన వాళ్లకి నోబెల్ ఫ్రైజ్ అంటున్నారని.. కనీసం ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వంగవీటి రాధా మా పార్టీలోనే ఉన్నారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటుందని, స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు తమ రాజీనామాలపై మాట్లాడం సరికాదన్నారు. చంద్రబాబువి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలేనని విమర్శించారు. చిత్త శుద్దితో ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసింది తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలేనన్నారు. తమ పార్టీ అవిశ్వాసం కోసం తీర్మానం పెడితే చర్చ పెట్టలేదని, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా వైవీ గుర్తు చేశారు. వారి మధ్య కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. 23 మంది ఫిరాయింపు దార్లపై చర్యలు తీసుకుంటే ఎన్నిలు వచ్చేవి కాదా? అని ప్రశ్నించారు. బుట్టా రేణుకపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. కోట్లాది రూపాయలు దోచుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. పగలు కాంగ్రెస్‌తో రాత్రిళ్లు బిజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు తమకు మిత్రుడేనని పార్లమెంట్ సాక్షిగా రాజ్‌నాథ్ సింగే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించారని తెలిపారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం 14 నెలల ముందు రాజీనామా చేశామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6, 2018న ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి హోదా విభజన హామీల విషయంలో మోసం చేశారని, ఇది ప్రజలకు చెప్పెందుకే రాజీనామాలు చేశామన్నారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేస్తే.. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మా ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరమదీక్ష చేశారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వంగవీటి రాధా తమ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము బీజేపీతో కలిసి ఉంటే తమపై, వైఎస్ భారతిపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు. -
హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
-
ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య
గోస్పాడు: ప్రత్యేకహోదా రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లెల్లకు చెందిన జమాల్‌బాషా(27)కు ఏడాది క్రితం ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన హరిఫాతో వివాహమైంది. డిగ్రీ చదివినా ఏ ఉద్యోగమూ రాకపోవడంతో సెల్ఫోన్లు మరమ్మతు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే చాలీచాలని సొమ్ముతో జీవనం సాగించడం కష్టమైందని నిత్యం సతమత మవుతుండేవాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే తన లాంటి చదువుకున్న వారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేదని, కనీసం ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకునేవాడినని తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య హరిఫా చెబుతోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వాపోయింది. ఇదే విషయమై గోస్పాడు ఎస్ఐ నరేష్‌ను అడగ్గా.. మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ లభ్యం కాలేదని చెప్పారు. జమాల్‌బాషా భార్య చెబుతున్న సూసైడ్ నోట్‌పై అనుమానాలు ఉన్నాయన్నారు.