విశాఖలో వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తను బలవంతంగా ఈడ్చుకెళ్తున్న పోలీసులు
ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన వారిపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. హోదా అంటే జైలుకే అంటూ మరోసారి గుడ్లురిమింది. పోలీసుల సాయంతో బంద్‌ను నిర్వీర్యం చేయడానికి విఫలయత్నం చేసింది. సర్కారు పెద్దల గట్టి ఆదేశాలతో పోలీసులు సైతం రెచ్చిపోయి వ్యవహరిస్తూ బంద్‌లో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ ఈడ్చి పడేశారు. మహిళలన్న కనికరం కూడా లేకుండా లాగిపడేశారు. పెద్దవాళ్లని కూడా చూడకుండా దురుసుగా తోసివేశారు. సర్కారు వైఖరి చూసిన జనం మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా.. అంటూ నివ్వెరపోయారు. చంద్రబాబు హోదా పట్ల యూటర్న్ తీసుకోవడం అంతా డ్రామా అని, ఆయనకింకా జ్ఞానోదయం కాలేదని బాహాటంగానే వ్యాఖ్యానించారు.
సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని వంటి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను పురిగొల్పింది. వైఎస్సార్‌సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందోనని ఆక్రోసిస్తూ దుర్మార్గంగా వ్యవహరించింది. సర్కారు ఆదేశాలతో బంద్‌పై ఖాకీల దాష్టీకం హద్దులు దాటింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు సర్కారు అన్ని ప్రయత్నాలు చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, ఐపీసీ సెక్షన్ 144లను అమలులోకి తెచ్చిన పోలీసులు అడుగడుగునా బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా వెనకడుగు వేయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో ప్రతీ జిల్లాలోను వందలాది మంది పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికిపైగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు అనేక పోలీస్‌స్టేషన్లకు తిప్పి సాయంత్రం వరకు నిర్బంధించారు. రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో నిండిపోయాయి. బంద్‌లో పాల్గొన్న మహిళలను మగ పోలీసులే దురుసుగా ఈడ్చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలు పోలీస్ స్టేషన్ వద్దే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా నగరి ఎస్.ఐ మునిస్వామి ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ జీపు ఎక్కించారు. విజయవాడ బస్టాండ్, బీసెంట్‌రోడ్డు, లెనిన్ సెంటర్‌లలో శాంతియుతంగా ధర్నా, ర్యాలీలు నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడతోపాటు పలుప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నాం నుంచి కొన్ని ఆర్టీసీ బస్సులను పోలీసు పహారాతో బలవంతంగా నడిపి ఏపీ బంద్ విఫలమైందని చూపించేందుకు ప్రభుత్వం తాపత్రయ పడింది.
వాగ్వాదాలు.. తోపులాటలు..
శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంపై పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, పశ్చిమ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నానిని పోలీసులు అరెస్ట్ చేయటం అన్యాయమంటూ పార్టీ నేతలు, శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పార్టీ కార్యకర్తలను లాగిపడేసి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గృహ నిర్భంధం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నా శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డితోపాటు పలువురు మహిళలను అరెస్టు చేసే సందర్భంలో డీఎస్పీ గోపాల కృష్ణ అనుచితంగా ప్రవర్తించాడు.
మహిళలను మగ పోలీసులతో ఈడ్చి వేయిచండంతో తొపులాటలో వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు రాజ్యలక్ష్మి, హుసేనమ్మలకు రక్తగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద తెల్లవారుజామునే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తుండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో బలవంతంగా అందరినీ తోసివేశారు. బంద్‌లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి నగరికి వస్తున్న ఎమ్మెల్యే రోజాను పుత్తూరు పున్నమి సర్కిల్‌లో పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పీలేరు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎన్‌కౌంటర్ చేస్తానని ఎస్‌ఐ శ్రీనివాసులు బెదిరించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్త తరుణ్‌ను చొక్కా పట్టుకొని లాక్కుంటూ వెళ్లాడు. నగరిలో ఎస్సై మునుస్వామి కార్యకర్తలపై జులుం ప్రదర్శించాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా దుర్భాషలాడారు. 80 సంవత్సరాల తాతపై కూడా చేయి చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లాలో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ‘అనంత’ గొంతుపై చేయి వేసి బలవంతంగా లాగేశారు. విశ్వేశ్వరరెడ్డిని కార్యకర్తల మధ్య నుంచి బలవంతంగా లాగేసి స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులు తగవు : జనసేన, హోదా సాధన సమితి
వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులను జనసేన పార్టీ ఖండించింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూసిందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. రోడ్డుపై దీక్షలు చేస్తున్న చంద్రబాబు.. ఎవరైనా హోదా కోసం ఉద్యమిస్తే అక్రమంగా అరెస్టులు చేయించి.. రోడ్లు వెంట తిప్పడం దారుణమని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. హోదా ఉద్యమంలో దుర్గారావు మృతి బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment