ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు.
హోదా కోసం ఎన్‌డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు.
హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment