సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వాగ్దానాలు ఆకాశాన్నిఆవరించిన మేఘంలా కనిపిస్తున్నా.. మేఘం వర్షిస్తేనే వాగ్దానాలు ఫలించినట్టు అని హిందీ కవిత చదివిన మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని,గాయపడిన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి ఆదుకోవాలని కోరారు.చంద్రబాబును ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు.ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయడంతో పాటు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.13 జిల్లాల్లో 13 భారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇక ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా రోడ్డుమ్యాప్ ఉందా అని భరత్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment