
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.
విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.
పవన్.. కేవలం మాటలేనా?
ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.

ఆడబిడ్డలకు రక్షణ కరువు..
ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరం
దిశ యాప్ కాపీనే శక్తి..
గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.

బాధితురాలికి న్యాయం జరగాలి..
నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్‌లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం.