చంద్రబాబు తీరు రాష్ట్రప్రయోజనాలకే ప్రమాదకరం: చెల్లుబోయిన వేణు | YSRCP Chelluboyina Venugopala Krishna Criticise CM Chandrababu Naidu Over Polavaram, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరు రాష్ట్రప్రయోజనాలకే ప్రమాదకరం: చెల్లుబోయిన వేణు

Published Sat, Apr 5 2025 12:30 PM | Last Updated on Sat, Apr 5 2025 3:42 PM

YSRCP Chelluboyina Venugopala Krishna Criticise CM CBN Over Polavaram

పోలవరంను బ్యారేజీగా మార్చే కుట్ర

ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించడంపై చంద్రబాబు రాజీ

స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు

చరిత్రలో చంద్రబాబు ద్రోహిగా మిగిలిపోవడం ఖాయం

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్

రాజమహేంద్రవరం, సాక్షి: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chelluboyina Venugopala Krishna) మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శనివారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పోలవరం(Polavaram)ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడు. తన కమీషన్ల కోసం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని కేంద్రాన్ని ఒప్పింది, అందుకు బదులుగా ప్రత్యేకహోదా హామీని వదులుకున్నారు. పోలవరంను అయినా నిర్మించారా అని చూస్తే ఆయన పాలనలో ఒక ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. 

.. పోలవరం కంటే ముందుగా స్పిల్‌వేను నిర్మించాల్సి ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt) ఎటువంటి చొరవ తీసుకోలేదు. కేవలం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను చేపట్టాలని ప్రయత్నించారు. వాటిని పూర్తి చేయకుండా గ్యాప్‌లను ఉంచి, డయాఫ్రంవాల్‌ ను నిర్మించారు. అప్పర్ కాఫర్ డ్యాంలో స్పిల్ వే లేకపోవడం వల్ల కాఫర్ డ్యాంపై ఒత్తిడి పెరిగి వరదతో అవి దెబ్బతిన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుంటూ అధికారంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపైనే నిందలు మోపేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కేంద్రంలోని పోలవరం అథారిటీ దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ను పరిశీలించి నివేదిక అందించడంలో జాప్యం జరిగింది. అప్పటి వరకు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే పోలవరంపై కొత్త అబద్దాలను తెర మీదికి తీసుకువచ్చారు. వైయస్ జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందంటూ పచ్చి అబద్దాలను చెబుతున్నారు. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయ్యిందని ఒకవైపు చంద్రబాబు ఊదరగొడుతుంటే, కాదు కేవలం 53 శాతం మాత్రమే పూర్తయ్యిందని కేంద్రం స్పష్టం చేసింది.

పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలను మోసం చేస్తున్నారు: చెల్లుబోయిన

కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నిర్లక్ష్యం
తాజాగా పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, దానికి గానూ రూ.12,157.53 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం నుంచి చెల్లించడం జరుగుతుందని కేంద్ర జలశక్తి సంఘం వార్షిక నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ముందు నుంచి భావిస్తున్న 45.72 మీటర్ల మేర పోలవరం నిర్మాణం ఉండదూ అనేది స్పష్టమవుతోంది. ఎత్తు తగ్గించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.25వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందుకు గానూ పోలవరంను ఒక బ్యారేజీ స్థాయికి కుదించివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 164 టీఎంసీలకు బదులుగా కేవలం 115 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరిజిల్లాల ఆయకట్టు స్థిరీకరణకు కూడా నీటిని ఇవ్వలేని దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. 

వీటిపైన చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎత్తు తగ్గింపుపైన కేంద్రంతో రాజీ పడ్డారు. టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కీలకమైన పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్దితో నిలబడితే కేంద్రం ఖచ్చితంగా దిగివచ్చి పోలవరంకు అవసరమైన నిధులు అందిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పనిచేయడం లేదు. పోలవరంకు పట్టిన గ్రహణంలా చంద్రబాబు మారారు. గతంలో కూడా పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారో తెలియదు.

చంద్రబాబు.. అబద్దాలపైన అబద్దాలు
ఎన్నికలకు ముందు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్‌ సిక్స్‌ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. 

ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. పీ4 ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ కొత్త డ్రామాలు చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనబైశాతం పేదలను ఇరవై శాతం ధనవంతులు దత్తత తీసుకుని, వారిని పేదరికం నుంచి విముక్తి చేస్తారంటూ రంగుల కలలను చూపిస్తున్నారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపైన కూడా వైయస్ఆర్‌సీపీపై తన సోషల్ మీడియా మూకను ప్రయోగించి తప్పుడ ప్రచారంకు తెగబడ్డారు. బిల్లుకు వైయస్ఆర్‌సీపీ రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయడానికి విప్ జారీ చేయలేదంటూ అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిగజారుడు రాజకీయం చేస్తున్నారు అని  వేణుగోపాలకృష్ణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement