
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు.