
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.
పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.