సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు.
నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్‌చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment